Begin typing your search above and press return to search.

దుమ్ము దులుపుతున్న కొత్త ప్రేమకథ

తమిళంలో ఈ సినిమా ఓ మోస్తరు అంచనాలతో రిలీజైంది. తెలుగులో ఈ పేరుతో సినిమా వస్తున్న సంగతే తెలియదు.

By:  Garuda Media   |   9 Feb 2026 2:53 PM IST
దుమ్ము దులుపుతున్న కొత్త ప్రేమకథ
X

విత్ లవ్.. గత శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో ఒకేసారి విడుదలైన సినిమా. కేవలం పాతికేళ్ల వయసులోనే ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ లాంటి హృద్యమైన సినిమా తీసి మెప్పించిన అభిషాన్ జీవింత్.. ‘విత్ లవ్’తో హీరోగా మారాడు. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’లో కూడా మంచి పాత్ర చేసి మెప్పించిన అతను.. ఇందులో లీడ్ రోల్‌లో నటించాడు. మలయాళంలో తక్కువ సినిమాలతోనే మంచి గుర్తింపు సంపాదించిన అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటించింది.

తమిళంలో ఈ సినిమా ఓ మోస్తరు అంచనాలతో రిలీజైంది. తెలుగులో ఈ పేరుతో సినిమా వస్తున్న సంగతే తెలియదు. కానీ రిలీజ్ రోజు ఈ చిత్రానికి చాలా మంచి స్పందన వచ్చింది. చూసిన వాళ్లందరూ సినిమా సూపరన్నారు. పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. దీంతో రెండో రోజు నుంచి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తోంది. తొలి రోజు రూ.2 కోట్ల వసూళ్లు రాబట్టిన ‘విత్ లవ్’.. రెండో రోజు రూ.4 కోట్ల మేర కలెక్ట్ చేయడం విశేషం. మూడో రోజు వసూళ్లు ఇంకా పెరిగాయి.

మొత్తంగా మూడు రోజుల్లో రూ.11 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది ‘విత్ లవ్’. ఈ సినిమా బడ్జెట్ కేవలం రూ.4 కోట్లు. దీన్ని ప్రొడ్యూస్ చేసింది సూపర్ స్టార్ రజినీకాంత్ చిన్న కూతురు సౌందర్య కావడం విశేషం. మదన్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. తెలుగులో కూడా ఈ సినిమా అంతకంతకూ పుంజుకుంటోంది. గత వీకెండ్లో ‘యుఫోరియా’ సహా అరడజనుకు పైగా తెలుగు సినిమాలు రిలీజ్ కాగా.. అవేవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ‘విత్ లవ్’యే బాక్సాఫీస్ దగ్గర లీడ్ తీసుకుంది.

వేలంటైన్స్ డే వీకెండ్లో కూడా ఈ సినిమా దుమ్ము దులిపేలా ఉంది. పెట్టుబడి మీద ఫుల్ రన్లో పది రెట్ల వసూళ్లు వస్తాయని బాక్సాఫీస్ పండిట్లు అంచనా వేస్తున్నారు. పెళ్లి చూపుల్లో భాగంగా కలిసిన ఒక జంట.. తమ వన్ సైడ్ లవ్ స్టోరీల గురించి చెప్పుకుంటాయి. తమ ప్రేమను అవతలి వ్యక్తికి చెప్పలేనందుకు ఫీలై.. ఇప్పుడు ఆ ప్రయత్నం చేద్దాం అనుకుని ఇద్దరూ కలిసి రంగంలోకి దిగుతారు. ఇదీ ఈ సినిమా కథ. ఆహ్లాదకరమైన కథనం, సన్నివేశాలతో సినిమాను ఆద్యంతం హుషారుగా నడిపించడంతో యూత్ ఈ చిత్రానికి బాగా కనెక్ట్ అవుతున్నారు.