పవన్ ఫ్యాన్స్ ను భయపెడుతున్న డైరెక్టర్!
కెరీర్ స్టార్టింగ్ లో బిల్లా లాంటి స్టైలిష్ మూవీని తెరకెక్కించి ఆ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న మెహర్, ఆ తర్వాత స్టార్ డైరెక్టర్ అయిపోతాడనుకున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 15 Oct 2025 6:09 AM ISTపవన్ కళ్యాణ్ రాజకీయాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తాను ఒప్పుకున్న సినిమాలను ఎంతో వేగంగా పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు, ఓజి సినిమాలను పూర్తి చేసి రిలీజ్ చేసిన పవన్ నుంచి తర్వాతి సినిమాగా ఉస్తాద్ భగత్‌సింగ్ రానుంది. రీసెంట్ గా ఓజి సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ, ఓజి యూనివర్స్ లో సినిమాలు రానున్నాయని చెప్పడంతో ఆయనకు సినిమాలు చేసే ఇంట్రెస్ట్ ఉందని అందరికీ అర్థమైంది.
పవన్ తో దిల్ రాజు మూవీ
పవన్ చెప్పిన మాటల్ని అర్థం చేసుకున్న పలువురు దర్శకనిర్మాతలు ఆయనతో సినిమాలు చేయడానికి పవన్ ను సంప్రదించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే నిర్మాత దిల్ రాజు కూడా పవన్ తో ఓ సినిమా చేయనున్నట్టు వెల్లడించారు. దిల్ రాజు- పవన్ కాంబోలో వచ్చే సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
పవన్ కోసం మెహర్ రమేష్ పడిగాపులు
దిల్ రాజు సంగతి పక్కన పెడితే పవన్ కోసం ఓ డైరెక్టర్ తెగ పడిగాపులు కాస్తున్నట్టు తెలుస్తోంది. పవన్ తో మూవీ చేయడానికి మెహర్ రమేష్ పలు సందర్భాల్లో ఆయన్ను కలిసి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని, హరి హర వీరమల్లు లొకేషన్ లో కూడా మెహర్ పవన్ ను కలిశారని తెలుస్తోంది. పవన్ తో సినిమా కోసం మెహర్ అన్నీ రెడీ చేసుకున్నారని, పవన్ ఓకే చెప్పడమే లేట్ అని వార్తలొస్తున్నాయి.
బిల్లాతో మెహర్‌కు మంచి క్రేజ్..
కెరీర్ స్టార్టింగ్ లో బిల్లా లాంటి స్టైలిష్ మూవీని తెరకెక్కించి ఆ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న మెహర్, ఆ తర్వాత స్టార్ డైరెక్టర్ అయిపోతాడనుకున్నారు. కానీ ఆయన చేసిన సినిమాలు ఫ్లాపులుగానే నిలిచాయి. వరుస సినిమాలు ఆయన్ని డైరెక్షన్ కు దూరం చేయగా, మళ్లీ చాన్నాళ్ల తర్వాత భోళా శంకర్ రూపంలో చిరంజీవి ఛాన్స్ ఇచ్చారు. కానీ ఆ అవకాశాన్ని కూడా మెహర్ రమేష్ వాడుకోలేకపోయారు.
ఇవన్నీ చూశాక తమ హీరో కోసం మెహర్ వెయిట్ చేస్తున్నాడని తెలిసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. పవన్ మీతో సినిమాకు ఓకే అంటే ఆ సినిమాపై తాము ఆశలు వదులుకోవాల్సిందేనంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ పవన్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి పవన్ తో సినిమా చేయాలనే మెహర్ రమేష్ కోరిక తీరుతుందో లేదో చూడాలి.
