Begin typing your search above and press return to search.

టాలీవుడ్ మల్టీస్టారర్ ట్రెండ్.. ఫస్ట్ ఛాయిస్ వెంకీనే ఎందుకు?

ఈమధ్య కాలంలో మల్టీస్టారర్ ట్రెండ్ అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు విక్టరీ వెంకటేష్. లేటెస్ట్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా స్టార్ట్ చేయగా అందులో కళ్యాణ్ రామ్ తో వెంకీ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు.

By:  M Prashanth   |   18 Jun 2026 5:37 PM IST
టాలీవుడ్ మల్టీస్టారర్ ట్రెండ్.. ఫస్ట్ ఛాయిస్ వెంకీనే ఎందుకు?
X

ఈమధ్య కాలంలో మల్టీస్టారర్ ట్రెండ్ అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు విక్టరీ వెంకటేష్. లేటెస్ట్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా స్టార్ట్ చేయగా అందులో కళ్యాణ్ రామ్ తో వెంకీ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. నిజానికి ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించడం అంటే దర్శకులకు నిర్మాతలకు పెద్ద తలనొప్పి. కంటెంట్ ఎంత బాగున్నా స్క్రీన్ స్పేస్ ఎలివేషన్స్ విషయంలో హీరోల మధ్య ఈగోలు కచ్చితంగా వస్తాయి. పైకి చెప్పకపోయినా పక్క హీరోను ఎక్కువగా చూపించి తమను తక్కువ చేస్తారేమో అనే లోపలి భయం ప్రతి హీరోలో ఉంటుంది.

దీనికి తోడు హీరోల కంటే ఫ్యాన్స్ చేసే రచ్చ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా ప్రాజెక్టులు కేవలం ఆలోచనలకే పరిమితం అవుతాయి. కానీ ఇలాంటి భయాలకు చెక్ పెడుతూ మల్టీస్టారర్ అనగానే దర్శకనిర్మాతలకు ముందుగా గుర్తొచ్చే పేరు వెంకటేష్. తెలుగు ఇండస్ట్రీలో ఈగోలు పక్కన పెట్టి కథ కోసం ఎంత వరకైనా తగ్గే నైజం వెంకీకి పుష్కలంగా ఉంది. తన తోటి నటులకు సమానంగా లేదా వాళ్ళకి కాస్త ఎక్కువ ప్రాధాన్యత ఉన్నా కూడా ఏమాత్రం ఆలోచించకుండా సినిమాలు ఒప్పుకోవడం వెంకటేష్ కే చెల్లింది.

కథను నమ్మే ఈ క్యారెక్టర్ వల్లే మల్టీస్టారర్ ట్రెండ్ సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ప్రాక్టికల్ గా ఆలోచించడంలో వెంకటేష్ స్టైల్ పూర్తిగా వేరుగా ఉంటుంది. స్క్రిప్ట్ లో మంచి విషయం ఉండి క్యారెక్టర్ కు తన అవసరం ఉందనుకుంటే రెమ్యునరేషన్ లాంటి ఆర్థికపరమైన లెక్కలు పెద్దగా పట్టించుకోరు. సినిమా బడ్జెట్ కు భారం కాకుండా నిర్మాతలకు మొదటి అడుగులోనే చాలా సపోర్ట్ చేస్తారు. కేవలం కథ డిమాండ్ చేస్తే చాలు ఎలాంటి పాత్రకైనా వంద శాతం న్యాయం చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు.

సాధారణంగా మల్టీస్టారర్స్ లో ఎవరికైనా తమకు ఎలివేషన్స్ తక్కువైతే కాస్త ఫీల్ అవుతారు. కానీ వెంకటేష్ ఆ విషయంలో అస్సలు రాజీ పడరు. పక్కనున్న హీరోకు మంచి సీన్ పడితే తనే ముందుండి ఎంకరేజ్ చేస్తారు. సీన్ డిమాండ్ చేస్తే తోటి హీరోల ముందు ఒక అడుగు తగ్గి యాక్ట్ చేయడానికి కూడా ఏమాత్రం వెనకాడరు. ఈ క్వాలిటీ వల్లే ఇద్దరు హీరోల కథలకు వెంకీ ఫస్ట్ ఛాయిస్ అవుతున్నాడు. పైగా కామెడీ మాస్ యాక్షన్ లో అతని కంటూ ఓ స్టైల్. అలాగే ఫ్యామిలీ ఆడియెన్స్ లో కావాల్సినంత సపోర్ట్.

ఇలాంటి పాజిటివ్ అంశాలు ఉన్న స్టార్ హీరో దొరికినప్పుడు దర్శకులకు కూడా ఏ టెన్షన్ ఉండదు. ఫ్యాన్స్ కోసమో ఇమేజ్ కోసమో బలవంతంగా కమర్షియల్ సీన్స్ రాయాల్సిన పని పూర్తిగా తప్పుతుంది. కథ ఎలా అనుకున్నారో అలా న్యాచురల్ గా తెరకెక్కించే స్వేచ్ఛ దొరుకుతుంది. అందుకే ఇండస్ట్రీలో ఎవరైనా ఒక పర్ఫెక్ట్ మల్టీస్టారర్ కథ రాసుకున్న వెంటనే ఆ మేకర్స్ ఎలాంటి అనుమానం లేకుండా నేరుగా వెంకటేష్ దగ్గరకు వెళ్తుంటారు.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో మొదలుపెట్టిన వెంకీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, నాగ చైతన్య, రామ్ లాంటి ఎంతో మంది హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఎవరితో చేసినా ఆ ప్రాజెక్ట్ కి ఒక పర్ఫెక్షన్ తీసుకువచ్చారు. ఇదే తరహాలో నెక్స్ట్ జనరేషన్ హీరోలు కూడా ఆలోచిస్తే చాలా బెటర్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.