బయోపిక్స్ లో టాలీవుడ్ అనాసక్తి!
క్రీడాకారులు, రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తల జీవితాలను వెండితెరపై ఆవిష్కరించడంలో హిందీ దర్శకులు చూపిస్తోన్న ఆసక్తి తెలుగులో మాత్రం కనిపించడం లేదు.
By: Srikanth Kontham | 19 July 2026 7:00 PM ISTభారతీయ చలనచిత్ర పరిశ్రమలో బయోపిక్స్ అంటే? బాలీవుడ్ ప్రత్యేక బ్రాండ్‌గా ఎదిగింది. క్రీడాకారులు, రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తల జీవితాలను వెండితెరపై ఆవిష్కరించడంలో హిందీ దర్శకులు చూపిస్తోన్న ఆసక్తి తెలుగులో మాత్రం కనిపించడం లేదు. తెలుగు వారైన శ్రీకాంత్ బొల్లా వంటి స్ఫూర్తిదాయకమైన పారిశ్రామిక వేత్త జీవితాన్ని సైతం బాలీవుడ్ దర్శకులు చిత్రీకరించడం గమనార్హం. ఇలాంటి కథలు మన చుట్టూ, మన తెలుగు గడ్డపై ఉన్నా? ఇక్కడి దర్శక, నిర్మాతలు ఎందుకనో పక్కన పెడుతున్నారు.
తెలుగు సినిమా అంటేనే కమర్షియల్ హంగులు, యాక్షన్ సీక్వెన్స్‌లు, భారీ సెట్టింగ్‌లు అన్నట్లుగా ఓ ముద్ర ఎప్పుడో పడిపోయింది. బయోపిక్ అంటే? కచ్చితంగా గొప్ప విజయం సాధిస్తుందనే గ్యారెంటీ లేకపోవడం ఒక బలహీనత అయితే.. వాస్తవాలను ఉన్నవి ఉన్నట్లుగా చూపించడానికి అవసరమైన ధైర్యం చేయకపోవడం మరో ప్రధాన కారణం. బాలీవుడ్ దర్శకులు కథలోని ఎమోషన్ ను పట్టుకుని దానికి కమర్షియల్ టచ్ ఇస్తూ విజయవంతంగా మలుస్తున్నారు. కానీ టాలీవుడ్ ఇంకా కమర్షియల్ అంటూనే ప్రయోగాలు చేయడానికి వెనుకాడుతోంది.
బయోపిక్స్ అంటే పాత్రకు సరిపోయే నటుడిని ఎంచుకోవడం మాత్రమే కాదు. ఆ వ్యక్తి జీవన ప్రయాణంలోని ఒడిదుడుకులను తెరపై సహజంగా ఆవిష్కరించడం. ఈ విషయంలో బాలీవుడ్ లోని స్క్రిప్ట్ రైటర్లు, దర్శకులు ఒక ప్రత్యేకమైన పాఠశాలనే నడుపుతున్నారు. వారి మేకింగ్ స్టైల్, రిసెర్చ్ , నటీనటుల ఎంపికలో ఉండే నిబద్ధత టాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది. ఈ రికార్డును అందుకోవాలంటే తెలుగు దర్శకులు మూస పద్ధతులను వదిలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నిజానికి తెలుగు నేలలో అద్భుతమైన జీవిత కథలు లేవా అంటే.. కోకొల్లలు. స్వాతంత్య్ర సమరయోధులు, సామాజిక సంస్కర్తలు, వినూత్నంగా ఆలోచించే నేటితరం పారిశ్రామిక వేత్తల జీవితాల్లో సినిమాకు కావాల్సినంత డ్రామా ఉంది. అయితే వాటిని తెరపైకి తీసుకురావడానికి అవసరమైన క్రియేటివ్ రిస్క్ తీసుకోవడానికి టాలీవుడ్ మేకర్స్ సిద్ధంగా లేరు. కమర్షియల్ సేఫ్ గేమ్ ఆడుతూ కొత్త కథలకు తాళం వేయడం వల్ల అద్భుతమైన అవకాశాలను చేజార్చుకుంటున్నామన్నది వాస్తవం.
బాలీవుడ్ ఈ రంగంలో సృష్టించిన రికార్డులను అధిగమించడం అంత సులభం కాకపోవచ్చు. కానీ అసాధ్యం కూడా కాదు. తెలుగు ప్రేక్షకులకు ఉన్న ఆదరణను గమనిస్తే? మంచి కథతో వస్తే బయోపిక్స్ ఇక్కడ కూడా కాసుల వర్షం కురిపించగలవు. కావాల్సింది స్టార్ హీరోల మాయాజాలం మాత్రమే కాదు. బలమైన, నిజాయితీతో కూడిన కథాంశం. దర్శకులు, నిర్మాతలు ఆలోచనా దృక్పథాన్ని మార్చుకుని వాస్తవికతకు దగ్గరగా ఉండే కథలను ప్రోత్సహించాల్సిన సమయం ఆసన్నమైంది.
బయోపిక్స్ పట్ల టాలీవుడ్ నిర్లక్ష్యం సినిమా పరిధిని పరిమితం చేస్తోంది. ప్రపంచం ఇప్పుడు నిజమైన కథల వైపు చూస్తోంది. కల్పిత కథల నుండి బయటపడి చుట్టూ ఉన్న గొప్ప వ్యక్తుల జీవితాలను వెండితెరపైకి తీసుకువస్తే? టాలీవుడ్ కూడా బయోపిక్స్ విభాగంలో తనదైన ముద్ర వేయడం ఖాయం. ఈ సవాలును స్వీకరిస్తే భారతీయ చిత్రపటంలో తెలుగు సినిమా మరో కొత్త పుంత తొక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
