ఆ రేంజ్ కాంబో కలగానే మిగిలిపోతుందా?
ఇద్దరు ఈక్వల్ ఇమేజ్ ఉన్న స్టార్ హీరోలను ఒకే స్క్రీన్ పైకి తీసుకురావడంలో అసలైన పరీక్ష స్క్రిప్ట్ డిజైనింగ్.
By: M Prashanth | 27 Oct 2026 5:00 AM ISTసోషల్ మీడియాలో అభిమానుల ఊహలకు హద్దులు ఉండవు. ఫలానా హీరోతో ఫలానా డైరెక్టర్ కలిస్తే బాగుంటుంది, ఇద్దరు టాప్ స్టార్లతో ఒకే ఫ్రేమ్‌లో బొమ్మ పడితే బాక్సాఫీస్ బద్దలైపోతుంది అంటూ పోస్టులు పెట్టడం చాలా సులువు. కానీ ప్రాక్టికల్ గా ఇండస్ట్రీ లెక్కలు, వర్కింగ్ రియాలిటీ చూస్తే మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నం. 'ఆర్ఆర్ఆర్' తర్వాత టాలీవుడ్ నుంచి మళ్లీ ఆ స్థాయి మల్టీస్టారర్ రాకపోవడానికి కేవలం కాల్షీట్లు మాత్రమే కారణం కాదు, తెర వెనుక ఉండే ఎన్నో క్లిష్టమైన లెక్కలు దర్శకులను వెనక్కి లాగుతున్నాయి.
ఇద్దరు ఈక్వల్ ఇమేజ్ ఉన్న స్టార్ హీరోలను ఒకే స్క్రీన్ పైకి తీసుకురావడంలో అసలైన పరీక్ష స్క్రిప్ట్ డిజైనింగ్. రాజమౌళి లాంటి బ్రాండ్ ఉన్న దర్శకుడి చేతిలో సినిమా పడినప్పుడు హీరోలు సైతం తమ వ్యక్తిగత ఇమేజ్ కంటే దర్శకుడి విజన్ కే ప్రాధాన్యం ఇస్తారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లను 'ఆర్ఆర్ఆర్' కోసం ఒప్పించడంలో జక్కన్న బ్రాండ్ వ్యాల్యూ కీలక పాత్ర పోషించింది. ఎవరి పాత్రను ఎంతవరకు ఎలివేట్ చేయాలి, ఎవరికి ఏ ఎమోషన్ ఇవ్వాలనే విషయంలో ఆయన తీసుకున్న క్యాలిక్యులేషన్స్ వేరు.
కానీ ప్రస్తుతం ఉన్న ఇతర టాప్ డైరెక్టర్లలో ఆ స్థాయి కమాండ్ తో ఇద్దరు స్టార్ల ఇగోలను కంట్రోల్ చేసే ధైర్యం ఎవరికి ఉంది అనేది ట్రేడ్ వర్గాల్లో వినిపించే ప్రధాన ప్రశ్న. ఇమేజ్ బ్యాలెన్సింగ్ అనేది దర్శకులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఆర్ఆర్ఆర్ అంత బాగా తీసినా ఫ్యాన్స్ లెక్కల్లో ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అనే భావన పూర్తి స్థాయిలో తప్పలేదు. అంతటి రాజమౌళికే ఆ పోలికల తలనొప్పి తప్పనప్పుడు, వేరే దర్శకులు ఆ సాహసం చేస్తే పరిస్థితి ఏంటో ఊహించవచ్చు.
ఒక హీరోకు ఒక ఫైట్ ఎక్కువ పడినా, మరో హీరోకు ఒక ఎమోషనల్ సీన్ తగ్గినా థియేటర్ల బయట ఫ్యాన్ వార్స్ మొదలైపోతాయి. ఇద్దరినీ సమానంగా చూపాలనే తాపత్రయంలో కథలోని సహజత్వం దెబ్బతిని, కేవలం ఎలివేషన్ల కోసమే సీన్లు రాసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే చాలామంది స్టార్ డైరెక్టర్లు ఒకే హీరోతో పూర్తి స్వేచ్ఛగా పనిచేయడానికే మొగ్గు చూపుతున్నారు తప్ప, అనవసరమైన రిస్క్ తీసుకుని చేతులు కాల్చుకోవడానికి సిద్ధంగా లేరు.
దీనికి తోడు ప్రస్తుత మార్కెట్ లెక్కలు కూడా ఈ కలయికలకు అడ్డంకిగా మారాయి. ఒక టాప్ స్టార్ రెమ్యునరేషన్, మార్కెట్ బడ్జెట్ చూస్తేనే ఒక భారీ ప్రాజెక్ట్ అవుతోంది. అలాంటిది ఇద్దరు అగ్ర కథానాయకులను పెట్టి సినిమా తీయాలంటే బడ్జెట్ వెయ్యి కోట్ల మార్క్ ను తాకుతుంది. దానికి తోడు పాన్ ఇండియా స్థాయిలో ప్రీ ప్రొడక్షన్, షూటింగ్ పూర్తి కావడానికి కనీసం మూడేళ్లు పడుతుంది. అంత సమయం, అంత భారీ పెట్టుబడి పెట్టి ఇద్దరు హీరోల డేట్స్ ను అడ్జస్ట్ చేయడం నిర్మాతలకు అంత తేలికైన పని కాదు.
సోషల్ మీడియాలో పోస్టులు చూసి మురిసిపోవడానికి ఇలాంటి క్రేజీ మల్టీస్టారర్ ఆలోచనలు బానే ఉంటాయి. కానీ గ్రౌండ్ లెవెల్ లో వాటిని ఎగ్జిక్యూట్ చేయాలంటే జక్కన్న స్థాయి అథారిటీ, పక్కా స్క్రిప్ట్ రెండూ ఉండాలి. ప్రస్తుతానికి మన దర్శకుల ఆలోచనలు, హీరోల ప్యాక్డ్ లైనప్స్ చూస్తుంటే మాత్రం 'ఆర్ఆర్ఆర్' రేంజ్ మరో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చూడటానికి తెలుగు ఆడియన్స్ కు ఇంకా చాలా కాలం పట్టేలాగే ఉంది.
