వెండి తెరపై నవ్వులు పూయించడం ఎంత పెద్ద సవాలు అంటే?
కానీ ప్రస్తుత కాలంలో వెండితెరపై పూర్తిస్థాయి హాస్యభరిత చిత్రాలను నిర్మించడం సవాళ్లతో కూడుకున్న వ్యవహారంగా మారింది.
By: Srikanth Kontham | 3 Sept 2026 7:00 PM ISTఒకప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హాస్య చిత్రాలకు, నవ్వుల పండుగలకు కొదవ ఉండేది కాదు. జంధ్యాల, ఇ.వి.వి. సత్యనారాయణ, రేలంగి నరసింహారావు వంటి దిగ్గజ దర్శకులు కేవలం నవ్వులనే నమ్ముకుని బ్లాక్‌బస్టర్ విజయాలను సొంతం చేసుకున్నారు. కానీ ప్రస్తుత కాలంలో వెండితెరపై పూర్తిస్థాయి హాస్యభరిత చిత్రాలను నిర్మించడం సవాళ్లతో కూడుకున్న వ్యవహారంగా మారింది. ఒకప్పుడు సునాయాసంగా అనిపించిన నవ్వించే ప్రక్రియ నేడు కత్తిమీద సాములా మారింది.
ఈ సవాలుకు ప్రధాన కారణం సమాజంలో .. ప్రేక్షకులలో పెరిగిన సున్నితత్వం. ఒకప్పుడు సినిమాల్లో సర్వసాధారణంగా కనిపించే బాడీ షేమింగ్ , జెండర్ ఆధారిత జోకులు, ఎవరినైనా వ్యక్తిగతంగా ఉద్దేశించి చేసే పారడీలు నేటి ప్రేక్షకులకు అస్సలు రుచించడం లేదు. సోషల్ మీడియా విస్తృతి పెరిగిన నేటి కాలంలో ఎలాంటి వ్యంగ్య వ్యాఖ్య అయినా? వివాదాలకు, విమర్శలకు దారితీస్తోంది. దీంతో ఏ రకమైన కామెడీని ప్రేక్షకులు ఆదరిస్తారో? దేనికి నెగెటివ్ టాక్ వస్తుందో? తెలియక రచయితలు, దర్శకులు అయోమయానికి గురవుతున్నారు.
మరోవైపు పరిశ్రమలో నాణ్యమైన హాస్య రచయితల కొరత కనిపిస్తోంది. గతంలో పింగళి నాగేంద్రరావు, ముళ్లపూడి వెంకటరమణ నుంచి పరుచూరి బ్రదర్స్, దివాకర్ బాబు, మరుధూరి రాజా వరకు హాస్య సంభాషణలు రాయడంలో సిద్ధహస్తులు ఉండేవారు. కానీ నేటి డిజిటల్ యుగంలో మీమ్స్, రీల్స్, స్టాండప్ కామెడీల ప్రభావం వల్ల మూస ధోరణి దాటి వినూత్నమైన సిట్యుయేషనల్ కామెడీని సృష్టించే రచయితలు కరువయ్యారు. బలమైన కథ, కామెడీ ట్రాక్ లేకపోవడం వల్ల సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోతున్నాయన్ని కాదనలేని నిజం.
పరిస్థితి ఇలా ఉండటంతో? కథానాయకులు కూడా పూర్తిస్థాయి కామెడీ సినిమాల్లో నటించడానికి వెనుకడుగు వేస్తున్నారు. కేవలం వినోదం మాత్రమే ఉంటే నేటి తరం ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? లేదా? అనే సందేహం హీరోల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో చాలా మంది హీరోలు సేఫ్ జోన్ కోసం యాక్షన్, థ్రిల్లర్, కాన్సెప్ట్ బేస్ట్ కథలు.. లార్జర్ దాన్ లైఫ్ చిత్రాల వైపు మొగ్గు చూపుతున్నారు. హాస్యాన్ని ప్రధాన వస్తువుగా కాకుండా సినిమాలో ఒక భాగం గానే ఉపయోగించడానికి దర్శక హీరోలు పరిమితమవుతున్నారు.
ఇలాంటి ప్రతికూలతల మధ్య కూడా క్లీన్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్న కొద్దిమంది దర్శకులు ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు సాధిస్తున్నారు. అనిల్ రావిపూడి, `జాతిరత్నాలు` ఫేమ్ అనుదీప్ థర్డ్ క్లాస్ కామెడీ కాకుండా హెల్తీ వ్యంగ్యాన్ని నమ్ముకున్న దర్శకులు ప్రేక్షకాదరణ పొందుతున్నారు. జుగుప్సాకరమైన జోకులు లేకుండా కుటుంబ సమేతంగా చూసి నవ్వుకునేలా సిట్యుయేషనల్ కామెడీని సృష్టించగలిగితే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని వీరిద్దరు నిరూపిస్తున్నారు. నటుడు రవిబాబు కూడా రొటీన్ కు భిన్నమైన కామెడీ చిత్రాలు చేయగల దర్శకుడే. కానీ కొంత కాలంగా ఆయన కామెడీ జానర్ పై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. జెన్ జీ తరానికి తగ్గ కామెడీ ట్రాక్ రాయగల రవిబాబు ఆ జానర్ పై కూడా దృష్టి పెడితే బాగుంటుందని అభిమానులు కోరుతున్నారు.
