Begin typing your search above and press return to search.

12 ఏళ్ల తర్వాత.. కింగ్ 100లో ‘మనం’ కనెక్షన్

ఈ పేరు చివరిసారి అక్కినేని కుటుంబానికి ఎంతో ముఖ్యమైన ‘మనం’ దగ్గర కనిపించింది. 2014 తర్వాత ఇప్పుడు నాగ్ వందో సినిమా కోసం మళ్లీ అదే పేరును తీసుకొచ్చారు.

By:  M Prashanth   |   31 Aug 2026 11:19 AM IST
12 ఏళ్ల తర్వాత.. కింగ్ 100లో ‘మనం’ కనెక్షన్
X

నాగార్జున వందో సినిమా ‘కింగ్ 100’ గ్లింప్స్ వచ్చిన తర్వాత అందులో మరో చిన్న విషయం హైలెట్ అవుతోంది. నిర్మాణం దగ్గర ఒక్క నాగార్జున పేరు కాకుండా ‘అక్కినేని ఫ్యామిలీ’ అని వేశారు. ఈ పేరు చివరిసారి అక్కినేని కుటుంబానికి ఎంతో ముఖ్యమైన ‘మనం’ దగ్గర కనిపించింది. 2014 తర్వాత ఇప్పుడు నాగ్ వందో సినిమా కోసం మళ్లీ అదే పేరును తీసుకొచ్చారు.

‘మనం’ అక్కినేని కుటుంబానికి మామూలు సినిమా కాదు. ఏఎన్నార్ చివరిసారి తెరపై కనిపించిన సినిమా అదే. నాగార్జున, నాగచైతన్య ప్రధాన పాత్రల్లో ఉండగా అఖిల్ కూడా చివర్లో కనిపించాడు. మూడు తరాల అక్కినేని నటులు ఒకే కథలో ఉండటంతో నిర్మాణ బాధ్యత దగ్గర కూడా ఒక్కరి పేరు కాకుండా కుటుంబం పేరునే పెట్టారు.

ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి వచ్చిన సినిమాల్లో మాత్రం ఇదే పద్ధతి కొనసాగలేదు. ‘సోగ్గాడే చిన్ని నాయనా’కు నాగార్జున నిర్మాతగా ఉన్నాడు. ‘బంగార్రాజు’కు కూడా నాగార్జున పేరే నిర్మాతగా వచ్చింది. కొన్ని సినిమాలు ఇతర సంస్థల భాగస్వామ్యంతో తెరకెక్కాయి. ఇప్పుడు నాగార్జున వందో సినిమా దగ్గర మళ్లీ కుటుంబం పేరును ముందుకు తీసుకొచ్చారు.

దీనికి కారణం ఏంటో చిత్రబృందం ప్రత్యేకంగా చెప్పలేదు. కానీ ‘మనం’ ఏఎన్నార్ చివరి సినిమా అయితే, ‘కింగ్ 100’ నాగార్జున కెరీర్‌లో వందో చిత్రం. అక్కినేని కుటుంబానికి గుర్తుండిపోయే రెండు సందర్భాల్లో ఒకే నిర్మాణ పేరు రావడం నిజంగా స్పెషల్. ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ‘కింగ్ 100’ పేరును అధికారికంగా ప్రకటించారు. రా కార్తిక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. డిసెంబర్ 24న సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు.

ఇక ‘మనం’ తరహాలో నాగచైతన్య, అఖిల్ కూడా ‘కింగ్ 100’లో కనిపిస్తారని మాత్రం ఇప్పటివరకు ఎక్కడా ప్రకటించలేదు. స్పెషల్ సినిమా కాబట్టి ఉంటే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చాన్స్ ఉంటే నాగ్ ఆ సర్ ప్రైజ్ ఇవ్వడానికి వెనుకాడడు. మరోవైపు నాగచైతన్య భారీ బడ్జెట్ మూవీ వృషకర్మతో బిజీగా ఉండగా అఖిల్ లెనిన్ హిట్ తరువాత మరో సినిమాను ఎనౌన్స్ చేయలేదు. త్వరలోనే ఓ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.