Begin typing your search above and press return to search.

హరీష్ మూవీ.. ఎవరు చేసినా రిజల్ట్ సేమ్ తప్పదా?

ఇప్పుడు తాజాగా ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో ఆయన మరో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమా కథ అసలు హిందీలో వచ్చిన రైడ్ ఆధారంగా రాసుకున్నానని తెలిపారు.

By:  M Prashanth   |   13 March 2026 10:05 PM IST
హరీష్ మూవీ.. ఎవరు చేసినా రిజల్ట్ సేమ్ తప్పదా?
X

సినిమా ఇండస్ట్రీలో హిట్లు, ఫ్లాపులు అనేవి సహజం. కానీ ఒక మూవీ ఫ్లాప్ అయితే ఆ భారం ఎక్కువగా మోయాల్సి వచ్చేది దర్శకుడే అని చెప్పాలి. తర్వాత హిట్ వచ్చే వరకు ఆయనపై విమర్శలు, అనుమానాలు కొనసాగుతూనే ఉంటాయి. ప్రస్తుతం దర్శకుడు హరీష్ శంకర్ కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. ఆయన గత చిత్రం మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైంది.

మాస్ మహారాజా రవితేజ లీడ్ రోల్ లో నటించిన ఆ చిత్రం 2024 ఆగస్టు 15న విడుదలైంది. భారీ అంచనాల మధ్య వచ్చినప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. సాధారణ ఫ్లాప్ కంటే కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచిందనే చెప్పాలి. అసలు ఆ సినిమా ఎందుకు అలాంటి రిజల్ట్ అందుకుందనే చర్చ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

ఇటీవల తన కొత్త చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్లలో భాగంగా హరీష్ శంకర్ ఈ అంశంపై మరోసారి మాట్లాడారు. మిస్టర్ బచ్చన్ ఫలితంపై తాను ఇప్పటికే ఒకసారి స్పందించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సినిమా ఓటీటీ ఒప్పందాల కారణంగా త్వరగా పూర్తి చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఆ తొందరలో సెకండాఫ్ తాను సరైన విధంగా తీర్చిదిద్దలేకపోయానని అంగీకరించారు.

అయితే అదే సమయంలో సినిమా ఫ్లాప్ కావడానికి ఒక్క కారణమే అది కాదని కూడా చెప్పారు. ముఖ్యంగా సెకండాఫ్‌ లో తన రైటింగ్ వీక్ గా ఉండిపోయిందని నిజాయితీగా అంగీకరించారు. ఇంకొంచెం సమయం దొరికుంటే ఔట్‌ పుట్ బెటర్‌ గా ఉండేదనిపిస్తుందని, కానీ రెండేళ్లు టైమ్ తీసుకున్నా కూడా ఫలితం మారిపోయేదా అన్న అనుమానం కూడా ఉందని హరీష్ శంకర్ వ్యాఖ్యానించారు.

ఇప్పుడు తాజాగా ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో ఆయన మరో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమా కథ అసలు హిందీలో వచ్చిన రైడ్ ఆధారంగా రాసుకున్నానని తెలిపారు. ఆ సినిమాలో హీరో పాత్ర తనకు ఎంతో నచ్చిందని, అందుకే దానిని తెలుగులో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. అసలు తాను రాసిన స్క్రిప్ట్ మాత్రం చాలా బాగుందని హరీష్ అభిప్రాయపడ్డారు.

"నేను రాసిన స్క్రిప్ట్‌ తో ఇంకో దర్శకుడు, ఇంకో హీరో సినిమా తీసి ఉంటే ఫలితం చాలా బాగుండేదేమో" అని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ఆ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుండగా.. నెటిజన్లు మాత్రం వాటిని ఏకీభవించడం లేదు. సినిమా సమస్య కేవలం దర్శకత్వంలోనే కాదు, మొత్తం కథనం, స్క్రీన్‌ ప్లే, ప్రెజెంటేషన్‌ లోనే ఉందని వారంతా అంటున్నారు. మొదటి నుంచి చివరి వరకు సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిందని, అందుకే ఎవరు చేసినా కచ్చితంగా సేమ్ రిజల్ట్ వచ్చేదని అభిప్రాయపడుతున్నారు. కంటెంట్‌ లోనే మొత్తం సమస్య ఉందని చెబుతున్నారు.