రిలీజ్‌కు ముందున్న హైప్.. తర్వాత ఎందుకు తగ్గుతోంది?
సినిమా రిలీజ్‌కు ముందు ట్రైలర్, పాటలు, టీజర్లు, పోస్టర్లు, ఇంటర్వ్యూలు, ఈవెంట్స్ ఇలా వరుసగా వస్తుంటాయి. ఒక్కో అప్డేట్‌తో సినిమా చుట్టూ బజ్ పెరుగుతుంది.
By: M Prashanth | 27 Aug 2026 7:00 PM ISTసినిమా రిలీజ్‌కు ముందు ట్రైలర్, పాటలు, టీజర్లు, పోస్టర్లు, ఇంటర్వ్యూలు, ఈవెంట్స్ ఇలా వరుసగా వస్తుంటాయి. ఒక్కో అప్డేట్‌తో సినిమా చుట్టూ బజ్ పెరుగుతుంది. ఆ సమయంలో ప్రేక్షకుడు చూసింది కొంతే కాబట్టి మిగతా సినిమాను తన ఊహలోనే పూర్తి చేసుకుంటాడు. హీరో లుక్, రెండు యాక్షన్ షాట్లు, ఒక మంచి పాట చాలు.. సినిమా గురించి మనసులో ఒక రేంజ్ ఫిక్స్ అయిపోతుంది. అసలు సినిమా ఎలా ఉంటుందన్నదానికంటే, ఎలా ఉండొచ్చన్న ఊహే రిలీజ్ వరకు హైప్‌ను నడిపిస్తుంది.
థియేటర్‌లో సినిమా మొదలైన తర్వాత మాత్రం ఆ ఊహకు అసలు కంటెంట్ ఎదురుగా నిలుస్తుంది. ట్రైలర్ ఇచ్చిన ఎగ్జైట్‌మెంట్ సినిమాలో కూడా ఉందా, పాటలతో వచ్చిన ఫీల్ కథలో కొనసాగిందా, ప్రమోషన్స్‌లో చెప్పిన మాటలకు సినిమాలో బలం ఉందా అన్నది అక్కడే తేలిపోతుంది. అంచనాలు తక్కువగా ఉంటే ఓ మోస్తరు సినిమా కూడా బాగానే అనిపించొచ్చు. హైప్ చాలా ఎక్కువైతే మంచి సినిమా కూడా ఆ స్థాయికి చేరలేదనే ఫీలింగ్ రావచ్చు.
ఇక్కడ మార్కెటింగ్ పని కూడా ఒక లెవెల్ వరకు మాత్రమే. రిలీజ్‌కు ముందు ప్రేక్షకుడిని థియేటర్ దగ్గరకు తీసుకురావచ్చు. ఓపెనింగ్‌కు ఉపయోగపడొచ్చు. కానీ సినిమా బయటకు వచ్చిన తర్వాత మాట్లాడేది.. మొదటి షో చూసిన ప్రేక్షకులే. ఫ్యాన్స్ ముందుగా హడావిడి చేసినా, మధ్యాహ్నం నుంచి ఫ్యామిలీ ఆడియన్స్, సాధారణ ప్రేక్షకుల మాట పెరుగుతుంది. రెండో రోజు నుంచి అసలు రన్ మీద వాళ్ల అభిప్రాయమే ఎక్కువ ప్రభావం చూపుతుంది.
ఇప్పుడు ఈ మార్పు మరింత స్పీడ్ గా కనిపిస్తోంది. ఒకప్పుడు సినిమా బాగుందా లేదా అన్న మాట పూర్తిగా జనాల్లోకి వెళ్లడానికి రెండు మూడు రోజులు పట్టేది. ఇప్పుడు మొదటి షో పూర్తయ్యేలోపే ట్వీట్లు, రీల్స్, వీడియో రివ్యూలు, మీమ్స్ బయటకు వస్తున్నాయి. ఉదయం టికెట్ బుక్ చేయాలని అనుకున్న వ్యక్తి కూడా మధ్యాహ్నానికి సోషల్ మీడియాలో వచ్చిన రెస్పాన్స్ చూసి నిర్ణయం మార్చుకునే పరిస్థితి ఉంది. అందుకే హైప్ కూలిపోవడం కూడా ఇప్పుడు గంటల్లోనే కనిపిస్తోంది.
మరోవైపు ఎక్కువ ప్రమోషన్ కూడా కొన్ని సినిమాలకు తిరగబడొచ్చు. ట్రైలర్‌లోనే కీలక సీన్లు, పాటల్లో మంచి విజువల్స్, ఇంటర్వ్యూల్లో కథకు సంబంధించిన చాలా విషయాలు ముందే బయటపెడితే థియేటర్‌లో కొత్తగా దొరికే అనుభవం తగ్గిపోతుంది. పైగా ట్రైలర్ వ్యూస్, హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్స్, ఫ్యాన్ సెలబ్రేషన్స్ అన్నీ టికెట్ సేల్స్‌గా మారుతాయని కూడా చెప్పలేం. అవి సినిమా గురించి తెలియజేస్తాయి. కానీ టికెట్ కొనే నిర్ణయం దగ్గరికి వచ్చేసరికి ప్రేక్షకుడు మరోసారి ఆలోచిస్తాడు.
అందుకే రిలీజ్‌కు ముందు హైప్ తగ్గిందా, పెరిగిందా అన్నది లెక్క కాదు. ఆ దశలో నిర్మాతలు సినిమాను జనాల్లోకి మాత్రమే తీసుకు వెళతారు. రిలీజ్ తర్వాత ప్రేక్షకులు మాట్లాడటం మొదలుపెడతారు. మొదటి రోజు వచ్చినవాళ్లు హైప్‌తో రావచ్చు. తర్వాతి రోజుల్లో వచ్చే వాళ్లు మాత్రం ముందు చూసిన వారి మాట వింటారు. అక్కడే సినిమా అసలు ట్రాక్ మొదలవుతుంది. ప్రమోషన్ ఇంట్రెస్ట్ ను పెంచవచ్చు. కానీ ఆ ఇంట్రెస్ట్ ను రెండో వీకెండ్ వరకు తీసుకెళ్లాలంటే సినిమాలో మంచి కంటెంట్ అయితే ఉండాలి.
