అలా చెప్పడం వల్ల నిర్మాతకు లాభం ఏంటి?
ఎలాంటి సినిమా తెరకెక్కినా ఆ చిత్రం వాస్తవ బడ్జెట్ ఎంత అన్న దానిపై ఎప్పుడూ క్లారిటీ ఉండదు.
By: Srikanth Kontham | 2 March 2026 8:00 PM ISTఎలాంటి సినిమా తెరకెక్కినా ఆ చిత్రం వాస్తవ బడ్జెట్ ఎంత అన్న దానిపై ఎప్పుడూ క్లారిటీ ఉండదు. ఎందుకంటే బడ్జెట్ విషయంలో రకరకాల ప్రచారాలు జరుగుతుంటాయి. వంద కోట్లు..రెండొందల కోట్లు..50 కోట్లు..నలభై కోట్లు అంటూ రకరకాల ఫిగర్స్ తెరపైకి వస్తుంటాయి. బడ్జెట్ అన్నది ఏ ప్రొడక్షన్ హౌస్ అయినా? దర్శకుడైనా ఎక్కువే చెబుతాడు తప్ప తక్కువ అని చెప్పిన దాఖలాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఎంత ఎక్కువ బడ్జెట్ చెబితే ? అంత హైప్ వస్తుంది? అన్నది వారి అభిప్రాయం కావొచ్చు. అయితే సినీ పరిశ్రమలో తక్కువ ఖర్చు చేసి ఎక్కువ బడ్జెట్ అని చెప్పుకోవడం అనేది వ్యాపార వ్యూహం.
ఇలా చేయడం వల్ల నిర్మాతకు స్వల్పకాలికంగా కొన్ని లాభాలు ఉన్నప్పటికీ, దీర్ఘకాలికంగా పరిశ్రమకు ఇది నష్ట దాయకం. నిజానికి 20 కోట్లతో తీసిన సినిమాను 50 కోట్లు అని ప్రచారం చేయడం వెనుక నిర్మాతలకు కొన్ని పక్కా లెక్కలు ఉన్నాయి. సినిమా థియేటర్లలోకి రాకముందే దాని నాన్-థియేట్రికల్ రైట్స్ అమ్ముడవుతాయి. ఈ సినిమాను భారీ వ్యయంతో, రిచ్ విజువల్స్‌తో తీశాం అని నమ్మించడం ద్వారా ఓటీటీ సంస్థల నుంచి, టీవీ ఛానెళ్ల నుంచి భారీ మొత్తాన్ని డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. బడ్జెట్ ఎక్కువ అని చెబితే? సినిమా క్వాలిటీ ఎక్కువగా ఉంటుందని కొనుగోలుదారులు భావిస్తారు.
భారీ బడ్జెట్ సినిమా అంటే ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. 100 కోట్ల బడ్జెట్ చిత్రమన్నది సినిమాకు ఒక రేంజ్ ని తెస్తుంది. ప్రేక్షకులలో క్యూరియాసిటీని పెంచుతుంది, తద్వారా అడ్వాన్స్ బుకింగ్స్ , ఓపెనింగ్ కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. హీరో మార్కెట్ పెరగాలంటే ఆయన సినిమా బడ్జెట్ కూడా పెరుగుతూ ఉండాలి. హీరో రేంజ్ పెరిగిందని చూపించడానికి నిర్మాతలు బడ్జెట్‌ను ఎక్కువగా చెబుతారు. ఇది తదుపరి సినిమాలకు హీరో రెమ్యునరేషన్ పెరగడానికి, అలాగే బిజినెస్ పెరగడానికి దోహదపడుతుంది.
ఇంత వరకూ బాగానే ఉంది. కానీ ఇలా తప్పుడు లెక్కలు చెప్పడం వల్ల ఇండస్ట్రీకి కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. బడ్జెట్ ఎక్కువని నమ్మి భారీ ధరలకు సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లు, సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోతే నిలువునా నష్టపోతారు. ఇది హీరో, నిర్మాత-పంపిణీ దారులు మధ్య తీవ్రమైన వివాదాలకు దారి తీస్తుంది. అలాంటి సన్నివేశాలెన్నో చూసారు. అగ్ర హీరోలే డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్లకు తల దించిన సన్నివేశాలెన్నో. భారీ బడ్జెట్ అని చెప్పి ప్రభుత్వం నుంచి టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి పొందుతారు. దీనివల్ల సామాన్య ప్రేక్షకులపై భారం పడుతుంది.
ఒకసారి ఓటీటీ సంస్థలు లేదా బయటి ఇన్వెస్టర్లు వాస్తవ బడ్జెట్ తెలుసుకుంటే, తదుపరి సినిమాలకు డీల్స్ కుదు ర్చుకోవడం కష్టమవుతుంది. సినిమా నిర్మాణంలో ఇంత మోసం ఉంటుందా? అని గ్రహిస్తే జెన్యూన్ ప్రొడ్యూసర్స్ సినిమాలు తీయడానికి ముందుకు రారు. ఇప్పటికే చిన్న సినిమాల నిర్మాణం 90 శాతం పడిపోయింది. ఓటీటీ సంస్థలు రిలీజ్ స్లాట్ బుకింగ్ పేరిట నిర్మాతల్ని తమ చెప్పు చేతల్లో పెట్టుకుంటున్నాయి. అదే సినిమా నిర్మాణం జెన్యూన్ గా జరిగితే? ఈ రకమైన పరిస్థితులు తలెత్తేవి కావు.
