Begin typing your search above and press return to search.

ఇంటర్వెల్ లేకుండా 2 గంటల సినిమాని ఆద‌రించ‌రా?

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో, ముఖ్యంగా టాలీవుడ్ - బాలీవుడ్‌లలో ఇప్పటికీ 3 గంటల నిడివి ఉన్న సినిమాలు రావడం సర్వసాధారణంగా మారింది.

By:  Sivaji Kontham   |   12 Sept 2026 8:00 AM IST
ఇంటర్వెల్ లేకుండా 2 గంటల సినిమాని ఆద‌రించ‌రా?
X

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో, ముఖ్యంగా టాలీవుడ్ - బాలీవుడ్‌లలో ఇప్పటికీ 3 గంటల నిడివి ఉన్న సినిమాలు రావడం సర్వసాధారణంగా మారింది. అంతటి సుదీర్ఘమైన సినిమాను వీక్షించే క్రమంలో ప్రేక్షకులకు ఉపశమనం అందించడానికి మధ్యలో `ఇంటర్వెల్` తప్పనిసరిగా మారింది. ఒక పవర్‌ఫుల్ ఇంటర్వెల్ బ్యాంగ్‌తో ద్వితీయార్థంపై ఆసక్తిని పెంచడమే కాకుండా.. థియేటర్లలో స్నాక్స్, కూల్ డ్రింక్స్ కొనుగోలు చేయడానికి ప్రేక్షకులు ఈ సమయాన్ని ఉపయోగిస్తున్నారు.

అయితే భారతీయ చిత్రాలకు భిన్నంగా.. హాలీవుడ్ పరిశ్రమ దశాబ్దాలుగా కేవలం గంటన్నర లేదా రెండు గంటల నిడివితో ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను అద్భుతంగా అలరిస్తోంది. సుదీర్ఘమైన కట్ లేకుండా వేగవంతమైన కథనంతో థియేటర్లలో ప్రేక్షకులను కూర్చోబెట్టడం అక్కడ ఆనవాయితీగా వస్తోంది. అయితే ఇటీవలి కాలంలో అవతార్, అవెంజర్స్ వంటి భారీ ఫ్రాంచైజీ చిత్రాలు అక్కడ కూడా మూడు గంటల నిడివితో వచ్చి విజయం సాధించినా సాధారణంగా హాలీవుడ్ సినిమాలలో ఇంటర్వెల్ అనే కాన్సెప్ట్ ఉండదు. మన దేశంలో ప్రదర్శించే సమయంలో మాత్రమే థియేటర్ల నిర్వాహకులు బలవంతంగా విరామం ఇస్తుంటారు.

అసలు సినిమా మధ్యలో ఈ `ఇంటర్వెల్` సంస్కృతి ఎలా ప్రారంభమైందనేది ఆసక్తికరమైన అంశం. గతంలో మూవీ ప్రొజెక్షన్ కోసం ఇప్పటిలా హార్డ్ డిస్క్‌లు, డిజిటల్ ప్రొజెక్టర్లు ఉండేవి కావు. పెద్దపెద్ద రీళ్లను వాడేవారు. ప్రొజెక్షనిస్ట్ ఒక రీల్ పూర్తయ్యాక, రెండో రీల్‌ను సెట్ చేయడానికి దాదాపు 10 నుండి 15 నిమిషాల సమయం పట్టేది. సాంకేతిక కారణాల వల్ల వచ్చిన ఈ అనివార్యమైన గ్యాప్‌ను చిత్ర పరిశ్రమ తెలివిగా `ఇంటర్వెల్`గా మార్చింది. కాలక్రమేణా టెక్నాలజీ మారి డిజిటల్ ప్రొజెక్టర్లు వచ్చినా.. ప్రేక్షకుల అలవాట్లలో భాగమైపోయిన ఆ విరామం భారతీయ సినిమా సంస్కృతిలో ఒక శాశ్వత ముద్రగా మిగిలిపోయింది.

ప్రస్తుతం మారిన సినీ ట్రెండ్‌ను పరిశీలిస్తే.. సినిమా నిడివి అనేది విజయానికి పెద్ద సమస్య కాదని స్పష్టమవుతోంది. ప్రేక్షకుల సమయానికి- ప్రాధాన్యతలకు తగినట్లుగా గంటన్నర లేదా రెండు గంటల నిడివితో నాన్-స్టాప్ సినిమాలు తీస్తే ప్రజలు కచ్చితంగా ఆదరిస్తారు. కథలో గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, ఉత్కంఠభరితమైన సన్నివేశాలు ఉంటే ప్రేక్షకుడు ఇంటర్వెల్ లేదనే విషయాన్ని కూడా మర్చిపోయి సినిమాలో మమేకమవుతాడు. ఓటీటీల కాలంలో ప్రేక్షకులు సుదీర్ఘమైన కథనాల కంటే వేగవంతమైన, పకడ్బందీ కథనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

కాబట్టి ఇంటర్వెల్ కార్డు పడాలనే నిబంధన లేకుండా కేవలం కథను మాత్రమే నమ్ముకుని 2 గంటల నాన్-స్టాప్ సినిమాను రూపొందించినా తెలుగు ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వినోద ప్రియులు నిరభ్యంతరంగా ఆదరించే ఆస్కారం ఉంది. ఇంటర్వెల్ కోసం అనవసరపు ట్విస్టులు ఇరికించకుండా..3 గంట‌ల సినిమా కోసం ల్యాగ్ ను తెర నిండా పోగు చేయ‌కుండా.. గ్రిప్పింగ్ నేరేషన్‌తో సినిమాను నడిపిస్తే నిడివితో ప‌నిలేకుండా భారతీయ సినిమాలో ఒక సరికొత్త - విజయవంతమైన విప్లవానికి నాంది పలుకుతుంద‌ని కూడా విశ్లేషిస్తున్నారు.