Begin typing your search above and press return to search.

స్టార్స్ ఎంత ఫేమ‌స్ అయితే అంత ముప్పు!

ఇటీవల కాలంలో పలువురు ప్రముఖ హీరోలు, నిర్మాతలకు ఇలాంటి బెదిరింపులు రావడం క‌నిపిస్తూనే ఉంది.

By:  Srikanth Kontham   |   19 Oct 2026 10:00 PM IST
స్టార్స్ ఎంత ఫేమ‌స్ అయితే అంత ముప్పు!
X

సెలబ్రిటీల జీవితాలు పైకి ఎంతో గ్లామరస్‌గా.. ఆనందంగా కనిపిస్తాయి. కానీ ఆ వెలుగుల వెనుక ఎప్పుడూ ఓ భయానక నీడ పొంచి ఉంటుంది. స్టార్స్ ఎంత ఫేమస్ అయితే? వారికి అంత ముప్పు అనే నానుడి నేడు అక్షరాలా నిజమవుతోంది. కేవలం ధనవంతులు కావడం మాత్రమే కాకుండా వారికున్న విపరీతమైన క్రేజ్, పాపులారిటీయే వారిని గ్యాంగ్‌స్టర్లు, మాఫియా ముఠాలకు ప్రధాన టార్గెట్‌గా మారుస్తున్నాయి. ఇక్కడ డబ్బు ఒక్కటే కారణం కాదు. అంతకు మించి సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు.. వారి బహిరంగ వ్యాఖ్యలు నేరగాళ్ల కంట్లో పడేలా చేస్తున్నాయి.

నేటి కాలంలో గ్యాంగ్‌స్టర్లు వ్యాపారవేత్తలనే కాకుండా సినీ నటులు, ప్రముఖులను లక్ష్యంగా ఎంచుకోవడానికి వారి సోషల్ మీడియా ప్రచారాలు, పబ్లిక్ ఈవెంట్లలో చేసే చిన్న చిన్న వ్యాఖ్యలు కూడా కారణమవుతున్నాయి. సమాజంలో స్టార్ మాట్లాడే మాటలకు విపరీతమైన ప్రభావం ఉంటుంది. అయితే కొన్నిసార్లు ప్రచార సమయాల్లో లేదా ఇంటర్వ్యూలలో వారు ఆలోచించకుండా చేసే వ్యాఖ్యలు, వివాదాస్పద ప్రకటనలు కొందరి కక్షలకు దారితీస్తాయనే మాట బ‌లంగా వినిపిస్తోంది. ఈ చిన్నపాటి మాటలే వారి ప్రాణాల మీదికి తెచ్చే తీవ్ర ప్రమాదకర పరిస్థితులను సృష్టిస్తున్నాయి.

చరిత్రను పరిశీలిస్తే ముంబై అండర్ వరల్డ్ మాఫియా పుట్టినప్పటి నుంచి సినీ ప్రముఖులే వారి ప్రధాన వసూళ్ల కేంద్రాలుగా మారారు. నటులు సంపాదిస్తున్న కోట్లాది రూపాయల సంపద ఒక ఎత్తైతే..మీడియాలో నిత్యం ట్రెండింగ్‌లో ఉండే వారి సెలబ్రిటీ స్టేటస్ గ్యాంగ్‌స్టర్లకు అస్త్రంగా మారుతుంది. సినిమాల్లో గ్యాంగ్‌స్టర్ పాత్రలు చేయడం లేదా సమాజంలోని కొన్ని అంశాలపై స్టార్లు బహిరంగంగా స్పందించడం వల్ల కూడా అండర్ వరల్డ్ నుంచి బెదిరింపులు ఎదురవుతుంటాయి. ఈ రకమైన బెదిరింపులు తారల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.

ఇటీవల కాలంలో పలువురు ప్రముఖ హీరోలు, నిర్మాతలకు ఇలాంటి బెదిరింపులు రావడం క‌నిపిస్తూనే ఉంది. ఇంటిపై కాల్పులు జరగడం, ప్రాణహాని ఉందని హెచ్చరికలు రావడం వంటి ఘటనలు సెలబ్రిటీల భద్రతా వైఫల్యాలను ఎత్తిచూపుతున్నాయి. ఒక సినిమా స‌న్నివేశాల్లో అభ్యంత‌రాలు.. ప్రమోషన్ కోసం లేదా పొరపాటున నోజారిన చిన్న మాట కారణంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న సందర్భాలు తారలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లపై మాట్లాడేటప్పుడు స్టార్లు ఎంత జాగ్రత్తగా ఉండాలో? ఈ సంఘటనలు హెచ్చరిస్తున్నాయి.

దీనివల్ల సెలబ్రిటీలు భద్రత కోసం ప్రైవేట్ సెక్యూరిటీని పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు షూటింగ్ స్పాట్లలోనే కనిపించే సెక్యూరిటీ గార్డులు ఇప్పుడు వారి వ్యక్తిగత జీవితంలోనూ నీడలా వెంటాడాల్సి వస్తోంది. ఉచితంగా బయట తిరిగే స్వేచ్ఛను కోల్పోయి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, కట్టుదిట్టమైన భద్రతా వలయాల మధ్య బతకాల్సిన దుస్థితి స్టార్స్‌కు ఎదురవుతోంది. పాపులారిటీ తెచ్చిపెట్టే కీర్తి ప్రతిష్టలు ఒకవైపు సంతోషాన్ని ఇస్తే మరోవైపు అదే వారి ప్రాణాలకు అతిపెద్ద ముప్పుగా పరిణమిస్తోంది.

అంతిమంగా ప్రజాధారణ పొందిన ప్రతి ఒక్కరూ చేసే వ్యాఖ్యల పట్ల.. ప్రవర్తన పట్ల బాధ్యతాయుతంగా ఉండాలని ఈ పరిణామాలు హెచ్చరిస్తున్నాయి. గ్యాంగ్‌స్టర్లు ..మాఫియా ముఠాల కన్ను పడకుండా ఉండాలంటే పోలీసు భద్రతే కాకుండా సెలబ్రిటీలు మాటల తీరుపై సంయమనం పాటించడం అత్యంత ముఖ్యం. ఫేమ్ అనేది కేవలం కీర్తిని మాత్రమే కాదు. ఎప్పుడూ వెంటాడే ప్రమాదాలను కూడా మోసుకొస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.