హీరోలకు ఒక రూల్.. హీరోయిన్లకు మరో రూల్ ఎందుకు?
ఒక హీరో నటించిన భారీ యాక్షన్ సినిమా ఫ్లాప్ అయితే కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్టర్ లేదా టైమింగ్ వంటి అనేక కారణాలను విశ్లేషిస్తారు.
By: Sravani Lakshmi Srungarapu | 6 Sept 2026 7:00 PM ISTసినీ ఇండస్ట్రీలో ఫ్లాప్ అనేది కొత్త విషయం కాదు. భారీ అంచనాలతో వచ్చిన స్టార్ హీరోల సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన సందర్భాలెన్నో ఉన్నాయి. అయితే ఒక స్టార్ హీరో సినిమా ఫ్లాప్ అయినంత మాత్రాన వారి తర్వాతి భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ ఆగిపోవడం అరుదు. ప్రొడ్యూసర్లు, ఇన్వెస్టర్లు వెంటనే వెనక్కి తగ్గరు. స్టార్ పవర్, మార్కెట్, గత సక్సెస్‌లను పరిగణనలోకి తీసుకుని మరోసారి భారీగా పెట్టుబడి పెట్టడానికి రెడీ అవుతారు. కానీ ఇదే పరిస్థితి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విషయంలో ఎందుకు కనిపించడం లేదన్న ప్రశ్న ఇప్పుడు మరోసారి డిస్కషన్‌కు వస్తోంది.
ఒక ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్, ముఖ్యంగా భారీ స్థాయిలో తెరకెక్కిన సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిలైతే దాని ఇంపాక్ట్ కేవలం ఆ ఒక్క సినిమాకే పరిమితం కావడం లేదనే వాదన ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఆ ఫ్లాప్‌ను ఒక వ్యక్తిగత సినిమా వైఫల్యంగా చూడకుండా, మొత్తం లేడీ ఓరియెంటెడ్ సినిమాల మార్కెట్‌కు సంబంధించిన హెచ్చరికగా ఇన్వెస్టర్లు భావిస్తున్నారన్న విషయాన్ని రీసెంట్ గా హీరోయిన్ తాప్సీ పన్ను తెలిపారు.
ఒక హీరో నటించిన భారీ యాక్షన్ సినిమా ఫ్లాప్ అయితే కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్టర్ లేదా టైమింగ్ వంటి అనేక కారణాలను విశ్లేషిస్తారు. కానీ ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ యాక్షన్ మూవీ ఫెయిలైతే మాత్రం వెంటనే లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ మూవీస్‌కు మార్కెట్ లేదనే డెసిషన్ కు రావడం ఎంతవరకు సమంజసమని దీనిపై పెద్ద డిస్కషన్ జరుగుతోంది.
రీసెంట్ గా బాలీవుడ్ లో ఆలియా భట్ నటించిన లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ మూవీ ఆల్ఫా ఆశించిన రిజల్ట్ అందుకోకపోవడంతో ఈ డిస్కషన్ మరింత బలపడింది. అసలు ఒక సినిమా ఫ్లాప్ కావడం వల్ల ఆ జానర్‌పైనే నమ్మకం ఎందుకు తగ్గాలి? హీరోలతో వచ్చిన యాక్షన్ సినిమాలు వరుసగా ఫ్లాపైనా యాక్షన్ జానర్‌ను ఎవరూ పూర్తిగా పక్కన పెట్టరు. కానీ హీరోయిన్ తో చేసిన ఒక భారీ ప్రయత్నం విఫలమైతే మాత్రం ఆ తరహా ప్రాజెక్టులపై సందేహాలు మొదలవుతాయి. ఇక్కడ సమస్య కేవలం ఒక సినిమా ఫ్లాప్ కాదు. ఆ ఫ్లాప్ తర్వాత మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందన్నదే అసలు విషయం.
ఒక్క లేడీ ఓరియెంటెడ్ మూవీ ఫ్లాపైతే, మార్కెట్‌లో ఉన్న మరో నాలుగు లేదా ఐదు ప్రాజెక్టులపై కూడా ఇంపాక్ట్ పడితే అది సినిమా ఫ్లాప్ కాదు.. మార్కెట్ ఫ్లాప్‌గా మారినట్టే. సినిమాకు పెట్టుబడిదారులు వెనక్కి తగ్గడం, కొత్త స్క్రిప్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ రాకపోవడం, ఇప్పటికే డిస్కషన్స్ లో ఉన్న ప్రాజెక్టులు నిలిచిపోవడం వంటి పరిణామాలు ఎదురైతే ఆ నష్టం ఒక్క హీరోయిన్‌కే కాకుండా మొత్తం ఉమెన్ సెంట్రిక్ మూవీ సిస్టమ్‌కే నష్టం వాటిల్లుతుంది. అందుకే ఇప్పుడు ఇండస్ట్రీ ముందున్న అసలు ప్రశ్న ఒక్కటే.. హీరోల ఫ్లాప్స్‌ను పర్సనల్ ఫెయిల్యూర్స్ గా చూసే మార్కెట్, హీరోయిన్ల ఫ్లాప్స్‌ను మాత్రం మొత్తం జానర్ వైఫల్యంగా ఎందుకు చూస్తోంది? ఒక్క సినిమా రిజల్ట్ తో మొత్తం లేడీ ఓరియెంటెడ్ సినిమాల ఫ్యూచర్‌కు తీర్పు చెప్పడం నిజంగా మార్కెట్ లెక్కలా? లేక ఇండస్ట్రీలో ఇంకా మారని ఆలోచనా విధానానికి నిదర్శనమా? అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.
