Begin typing your search above and press return to search.

ప్యారడైజ్: డంప్ యార్డ్‌ లోనే ఉంటారెందుకు? పొగకు అర్థమేంటి?

ఇప్పుడు దర్శకుడు చేసిన కామెంట్స్ తో దానికి అర్థం ఉందని క్లియర్ గా తెలుస్తోంది. నానితో జరిగిన చిట్‌ చాట్‌ లో శ్రీకాంత్ ఓదెల ధూమావతి అమ్మవారి గురించి మాట్లాడారు.

By:  M Prashanth   |   28 Sept 2026 4:16 PM IST
ప్యారడైజ్: డంప్ యార్డ్‌ లోనే ఉంటారెందుకు? పొగకు అర్థమేంటి?
X

డంప్ యార్డ్‌లో నే బతుకుతారు.. చుట్టూ ఎప్పుడూ పొగే ఉంటుంది.. మధ్యలో కాకి కూడా కనిపిస్తుంటుంది. ఇవన్నీ ఊరికే పెట్టినవి కావట.. ధూమావతి అమ్మవారి కాన్సెప్ట్‌ తో లింక్ చేసి పెట్టారట! నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ది ప్యారడైజ్ మూవీలో ఆ ఎలిమెంట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సినిమా చూసినప్పుడు డంప్ యార్డ్ ఎందుకు, పొగ ఎందుకు అనే డౌట్ చాలామందికి వచ్చింది.

ఇప్పుడు దర్శకుడు చేసిన కామెంట్స్ తో దానికి అర్థం ఉందని క్లియర్ గా తెలుస్తోంది. నానితో జరిగిన చిట్‌ చాట్‌ లో శ్రీకాంత్ ఓదెల ధూమావతి అమ్మవారి గురించి మాట్లాడారు. పెద్దలు చెప్పిన ప్రకారం, ఆమె శ్మశానాల్లో ఉంటారని, ఆమె ఎక్కడ ఉంటే అక్కడ వర్షం ఉంటుందని చెప్పారు. అందుకే సినిమాలో డంప్ యార్డ్‌ ను ఆమెకు సంబంధించిన భావనతో కలిపినట్టు వివరించారు.

ఇక సినిమాలో కనిపించే పొగకు కూడా అర్థం ఉంది. ధూమావతి పేరులోనే ధూమం అంటే పొగ. సినిమాలో కూడా పొగను ఒక సిగ్నల్ గా చూపించారు. అమ్మవారికి కోపం వస్తే పొగ వస్తుందని, ఆ పొగ కనిపిస్తే యుద్ధం మొదలవుతుందనే ఆలోచనను కథలో పెట్టినట్టు శ్రీకాంత్ ఓదెల చెప్పారు. అంటే సినిమాలో పొగ కనిపించిందంటే ఏదో పెద్దది జరగబోతోందన్నమాట.

సాధారణంగా మనం చూసే పొగలా కాకుండా.. కథలో అది ఒక వార్నింగ్ లా పనిచేస్తుంది. ఇక కాకి కూడా అంతే. ధూమావతి అమ్మవారికి కాకి ముఖ్యమైన సింబల్ గా చెబుతారు. అందుకే ది ప్యారడైజ్ లో కాకిని కూడా కథతో కలిపారు. జడల్ పాత్ర చుట్టూ కాకి కనిపించడం వెనుక ఆ ఆలోచనే ఉన్నట్టు తెలుస్తోంది. ధూమావతి అమ్మవారిని హిందూ సంప్రదాయంలో దశమహావిద్యల్లో ఒకరిగా పూజిస్తారు.

ఆమె రూపం సాధారణ దేవతల కంటే భిన్నంగా ఉంటుంది. శ్రీకాంత్ ఓదెల ఆ అంశాలను నేరుగా దేవత కథగా చెప్పకుండా.. జడల్ జీవితం, అతని చుట్టూ ఉన్న పరిస్థితులతో మిక్స్ చేశారు. చెత్త మధ్య జీవించే మనుషులు, వారి కష్టాలు, కోపం, పోరాటం.. వీటన్నింటికీ ధూమావతి ఫీలింగ్ తో యాడ్ చేశారు. అందుకే ది ప్యారడైజ్ లో డంప్ యార్డ్ ఒక లొకేషన్ మాత్రమే కాదు. పొగ కూడా సాధారణ పొగ కాదు. కాకి కూడా కేవలం కాకి కాదు.

వీటి వెనుక కథకు సంబంధించిన సరైన అర్థం ఉందని దర్శకుడి మాటలతో స్పష్టమవుతోంది. ఇప్పటివరకు సినిమా చూసి ఆ సీన్లను కేవలం మాస్ ఎలివేషన్‌ గా భావించిన వాళ్లకు.. ఇప్పుడు మరో యాంగిల్ కనిపిస్తోంది. ప్యారడైజ్ లో ప్రతి అంశాన్ని ఎందుకు పెట్టారో దర్శకుడు ఒక్కొక్కటిగా చెప్పడంతో సోషల్ మీడియాలో ఇప్పుడు చర్చ జరుగుతోంది. అయితే రీసెంట్ గా వివాదాస్పద జ్యోతిష్కుడు వేణుస్వామి, ప్యారడైజ్ లో ధూమావతి అమ్మవారి రిఫరెన్స్ ఉందని, అందుకే ఆయన సినిమాకు కూడా వెళ్లానని చెప్పిన సంగతి తెలిసిందే.