Begin typing your search above and press return to search.

మానసా వారణాసి ఘటన తర్వాత.. తిరుమల వీఐపీ దర్శనంపై మళ్లీ చర్చ

తిరుమలలో దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలో లేదంటే బయటకు వస్తున్నప్పుడు సెలబ్రిటీలను గుర్తుప‌ట్టి కొందరు భక్తులు వెంటనే సెల్ఫీలు, ఫోటోలు, వీడియోల కోసం చుట్టుముట్టడం ఇప్పుడు సాధారణంగా మారిపోయింది.

By:  Sravani Lakshmi Srungarapu   |   14 Aug 2026 9:55 PM IST
మానసా వారణాసి ఘటన తర్వాత.. తిరుమల వీఐపీ దర్శనంపై మళ్లీ చర్చ
X

తిరుమలలో సెల‌బ్రిటీలు దర్శనానికి వచ్చిన ప్రతిసారి ఒకే ప్రశ్న మళ్లీ మళ్లీ వినిపిస్తూ ఉంటుంది. ఎందుకు చాలా మంది సెలబ్రిటీలు స్పెషల్ వీఐపీ దర్శనాన్నే ఎంచుకుంటారు? సాధారణ భక్తులతో కలిసి క్యూలో నిలబడి దర్శనం చేసుకోవడం ఎందుకు చాలా అరుదుగా కనిపిస్తుంది? ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు ఈ డిస్క‌ష‌న్ కు మరోసారి ఊతమిచ్చాయి.

తిరుమలలో దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలో లేదంటే బయటకు వస్తున్నప్పుడు సెలబ్రిటీలను గుర్తుప‌ట్టి కొందరు భక్తులు వెంటనే సెల్ఫీలు, ఫోటోలు, వీడియోల కోసం చుట్టుముట్టడం ఇప్పుడు సాధారణంగా మారిపోయింది. ఒకరు ఫోటో అడిగితే మరికొందరు కూడా అదే ప్రయత్నం చేయడం, కొన్ని సందర్భాల్లో వారిని వెంబడించడం, ప‌ర్స‌న‌ల్ స్పేస్‌ను కూడా పట్టించుకోకపోవడం వంటి ఘటనలు తరచూ కనిపిస్తున్నాయి. దీంతో ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకోవాలనుకున్న సెల‌బ్రిటీలు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తాజాగా మాన‌స వార‌ణాసి తిరుమ‌ల వెళ్ల‌గా, ద‌ర్శ‌నం త‌ర్వాత భ‌క్తులు ఆమె చుట్టు గూమిగూడి సెల్ఫీలు, వీడియోల కోసం వెంట‌బ‌డ‌గా, ఆమె ఒకింత ఇబ్బందికి గుర‌య్యారు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న నేప‌థ్యంలో ఈ డిస్క‌ష‌న్ మ‌రోసారి వార్త‌ల్లోకి వ‌చ్చింది.

తిరుమల అనేది కోట్లాది మంది భక్తులు ఆధ్యాత్మిక ప్రశాంతత కోసం వచ్చే పుణ్య‌క్షేత్రం. అలాంటి ప్రదేశంలో సెలబ్రిటీలు కనిపిస్తే భక్తులు ఉత్సాహంతో ఫోటోలు అడగడం సహజమే అయినప్పటికీ, అదే ఉత్సాహం కొన్నిసార్లు ఇబ్బందిగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో భద్రత, ప‌ర్స‌న‌ల్ సేఫ్టీ వంటి అంశాలు మరింత కీలకంగా మారుతున్నాయి.

ఈ నేపథ్యంలో స్పెషల్ వీఐపీ దర్శనం అనేది కేవలం సౌకర్యం కోసం మాత్రమే కాకుండా, భద్రత మరియు ప్రశాంతత కోసం కూడా ఒక ప్రత్యామ్నాయంగా చాలామంది సెలబ్రిటీలు భావిస్తున్నారేమో అనే అభిప్రాయం నెటిజన్లలో వ్యక్తమవుతోంది. తక్కువ టైమ్ లో దర్శనం పూర్తవడం, పరిమిత రద్దీ ఉండటం, భద్రతా సిబ్బంది సమన్వయం ఉండటం వంటి అంశాలు వారికి అనుకూలంగా ఉంటాయని అంటున్నారు.

మరోవైపు, సెల‌బ్రిటీలు కూడా గుడికి వ‌చ్చిన‌ప్పుడు భక్తులే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కొందరు సూచిస్తున్నారు. గుడికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికీ ప్రశాంతంగా ప్రార్థన చేసుకునే హక్కు ఉందని, సెల్ఫీల కోసం భారీగా ఒత్తిడి చేయడం, చుట్టుముట్ట‌డం సరైన పద్ధతి కాదని సోష‌ల్ మీడియాలో డిస్క‌ష‌న్ జరుగుతోంది. తిరుమలలో సెలబ్రిటీల స్పెష‌ల్ దర్శనంపై ఎప్పటినుంచో ఉన్న డిస్క‌ష‌న్ కు, ఇటీవల చోటుచేసుకుంటున్న ఇలాంటి ఘటనలు మరోసారి కొత్త కోణాన్ని తీసుకొచ్చాయి. భక్తి, మర్యాద, వ్యక్తిగత గౌరవం మధ్య సమతుల్యత పాటిస్తే ఇలాంటి పరిస్థితులు తగ్గే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.