బాక్సాఫీస్ టెన్షన్ల మధ్య సీక్వెల్స్ సక్సెస్ సీక్రెట్ ఇదే!
సినిమా ప్రపంచంలో ప్రేక్షకుల అభిరుచులతో పాటు వెండితెర సమీకరణాలు కూడా శరవేగంగా మారిపో తున్నాయి.
By: Srikanth Kontham | 15 Jun 2026 12:00 AM ISTసినిమా ప్రపంచంలో ప్రేక్షకుల అభిరుచులతో పాటు వెండితెర సమీకరణాలు కూడా శరవేగంగా మారిపో తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ చిత్రసీమను గమనిస్తే ఒకప్పుడు కేవలం ప్రయోగాలకే పరిమితమైన సీక్వెల్స్ ట్రెండ్ ఇప్పుడు భారీ విజయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. కొత్త కథలతో రిస్క్ చేయడం కంటే, అప్పటికే మార్కెట్లో క్రేజ్ ఉన్న ఫ్రాంచైజీల వైపే దర్శకులు, నిర్మాతలు ఎక్కువగా అడుగులు వేస్తున్నారు. ఇది ఒకరకంగా పరిశ్రమకు సేఫ్ జోన్ లాగా కనిపిస్తున్నా? తెర వెనుక ఉండే సవాళ్లు, ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో ఉండే భారం అంత సులువేం కాదు.
సినిమా పరిశ్రమలో దశాబ్దాల అనుభవం ఉన్న స్టార్ హీరోకైనా సరే తన కొత్త చిత్రం రిలీజ్ అవుతుందంటే చాలు.. గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖాయం. ప్రతి శుక్రవారం బాక్సాఫీస్ ఇచ్చే రిజల్ట్ ఎవరికైనా ఒక పెద్ద పరీక్షే. తాము పడిన కష్టాన్ని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు? థియేటర్లలో వసూళ్ల వర్షం కురుస్తుందా లేదా? అనే ఆందోళన ఎంతటి అగ్ర నటుడినైనా వెంటాడుతూనే ఉంటుంది. ఈ మానసిక ఒత్తిడి అనేది స్టార్‌డమ్‌తో సంబంధం లేకుండా, ప్రతి సినిమాకూ పునరావృతమయ్యే ఒక అనివార్యమైన సవాలుగా మారిపోయింది.
అయితే మొదటి భాగం సూపర్ హిట్ అయి దానికి సీక్వెల్ వచ్చేటప్పుడు ఈ అంచనాల భారం మరింత రెట్టింపవుతుంది. అసలు కథల కంటే సీక్వెల్స్ ఎందుకు అంతగా క్లిక్ అవుతాయనే కోణంలో విశ్లేషిస్తే.. అక్కడ విభిన్నమైన కథ కంటే ప్రేక్షకుల మనసుల్లో ముద్ర వేసుకున్న పాత్రలదే కీలక పాత్ర అని అర్థమవుతుంది. ఆడియన్స్ కేవలం సినిమాను మాత్రమే చూడరు. తెరపై కనిపించే క్యారెక్టర్లతో తెలియని ఎమోషనల్ బాండింగ్ ఏర్పరచుకుంటారు. ఆ పాత్రల ప్రవర్తన వారి మ్యానరిజమ్స్ ప్రేక్షకులకు బాగా అలవాటైపోవడం వల్ల వాటి చుట్టూ ఎలాంటి లైన్ అల్లినా సులభంగా కనెక్ట్ అవుతారు.
ఆ పాత పరిచయమే సీక్వెల్స్‌ను విజయతీరాలకు చేర్చే అసలైన ఇంధనం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్.. `ధమాల్`, `గోల్‌మాల్` వంటి అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫ్రాంచైజీలు. వీటిలో ప్రతి భాగంలోనూ కథ మారుతుంది కానీ అందులోని పాత్రల మూల స్వభావం, వాటి మధ్య ఉండే క్రేజీ కెమిస్ట్రీ మారవు. ప్రేక్షకులు కూడా థియేటర్లకు వచ్చేది ఏదో సరికొత్త ప్రపంచాన్ని చూడటానికి కాదు. తాము గతంలో అమితంగా ఇష్టపడిన పాత్రలు చేసే అల్లరిని, పండించే వినోదాన్ని మళ్లీ లైవ్‌లో ఎంజాయ్ చేయడానికి మాత్రమే. ఈ నమ్మకమే ఏళ్ల తరబడి ఒక ఫ్రాంచైజీని సజీవంగా ఉంచుతోంది.
వ్యాపార దృక్పథంతో ఆలోచిస్తే.. అప్పటికే మార్కెట్లో ప్రూవ్ అయిన ఒక ఫ్రాంచైజీపై ఇన్వెస్ట్ చేయడం నిర్మాతలకు ఆర్థికంగా కొండంత అండ. ముందస్తు ప్రచారానికి, పబ్లిసిటీకి ఇది ఎంతో ప్లస్ అవుతుంది. కానీ నాణేనికి మరోవైపు ఉన్నట్లు.. మునుపటి భాగాలను మించి ఎంటర్‌టైన్ చేయాలనే అదనపు ప్రెజర్ చిత్ర యూనిట్‌పై ఉంటుంది. పాత సోల్‌ని మిస్ అవ్వకుండా సరికొత్త కామెడీ ట్రాకులు, ఇంట్రెస్టింగ్ ట్విస్టులు జోడించి స్క్రీన్‌ప్లే నడపడం కత్తిమీద సామే. అంచనాలు ఏమాత్రం మిస్సయినా? ఆ ఇంపాక్ట్ మొత్తం బ్రాండ్ వాల్యూపై పడుతుంది.
ఏదేమైనా? రాబోయే రోజుల్లో చిత్ర పరిశ్రమలో ఫ్రాంచైజీల హవా మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. నటీనటులు, దర్శకులు ప్రతి రిలీజ్ ముందూ బాక్సాఫీస్ టెన్షన్‌ను ఫేస్ చేస్తున్నా? ఆడియన్స్‌కు, క్యారెక్టర్లకు మధ్య ఉండే ఆత్మీయ బంధమే అసలైన సక్సెస్ మంత్ర. కొత్త మలుపులు, నవ్వులతో సాగే వెండితెర ప్రయాణం ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తూనే ఉంటుంది. ఒక బ్రాండ్‌ను క్రియేట్ చేయడం కంటే దాన్ని సక్సెస్‌ఫుల్‌గా మెయింటైన్ చేయడం ఎంత కష్టమో ఈ సీక్వెల్స్ నిరూపిస్తున్నాయి.
