'ల్యాగ్' అనే మూడు అక్షరాల ఉచ్చు.. సినిమాను చంపేస్తోందా?
ప్రతి శుక్రవారం థియేటర్ల వద్ద, సోషల్ మీడియాలో కామన్ గా వినిపించే ఒకే ఒక్క పదం 'ల్యాగ్'. సినిమా ఎలా ఉంది అని అడిగితే.. "ఫస్టాఫ్ బాగుంది కానీ, సెకండాఫ్ బాగా ల్యాగ్ అయ్యింది" అనే సమాధానం వినిపిస్తోంది.
By: M Prashanth | 30 Nov 2025 6:00 PM ISTప్రతి శుక్రవారం థియేటర్ల వద్ద, సోషల్ మీడియాలో కామన్ గా వినిపించే ఒకే ఒక్క పదం 'ల్యాగ్'. సినిమా ఎలా ఉంది అని అడిగితే.. "ఫస్టాఫ్ బాగుంది కానీ, సెకండాఫ్ బాగా ల్యాగ్ అయ్యింది" అనే సమాధానం వినిపిస్తోంది. ఒకప్పుడు సినిమా బాగోలేదు అంటే కథ బాలేదనో, కామెడీ పండలేదనో చెప్పేవారు. కానీ ఇప్పుడు ఆడియన్స్ వెర్డిక్ట్ మొత్తం ఈ ఒక్క పదం చుట్టూనే తిరుగుతోంది. అసలు ఈ ల్యాగ్ అంటే ఏంటి? నిజంగా దర్శకులు కథను సాగదీస్తున్నారా? లేక మనమే ఒక నిమిషం కూడా ఆగలేనంత వేగానికి అలవాటు పడిపోయామా? అనే ప్రశ్నలు ఇప్పుడు ఇండస్ట్రీని తొలిచేస్తున్నాయి.
దీనికి ప్రధాన కారణం మారుతున్న 'అటెన్షన్ స్పాన్'. గత కొన్నేళ్లుగా స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగాక, మన మెదడు పనితీరులో భారీ మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ ప్రభావం మన మీద బలంగా ఉంది. కేవలం 30 సెకన్లలోనే ఒక హై, ఒక జోక్, లేదా ఒక ఎమోషన్ ను చూడటానికి అలవాటు పడ్డాం. స్క్రీన్ మీద ప్రతి నిమిషం ఏదో ఒక మ్యాజిక్ జరగాలని, డోపమైన్ కిక్ కావాలని కోరుకుంటున్నాం. అది మిస్ అయిన మరుక్షణం మనకు తెలియకుండానే "అబ్బా.. సాగదీస్తున్నాడు" అనే ఫీలింగ్ వచ్చేస్తోంది.
ఒక కథలో ఎమోషన్ పండాలంటే దానికి సరైన సమయం, సందర్భం కావాలి. ఒక పాత్ర తాలూకు బాధనో, ప్రేమనో ప్రేక్షకుడికి కనెక్ట్ చేయాలంటే దర్శకుడు ఆ సన్నివేశాన్ని నెమ్మదిగా ఎస్టాబ్లిష్ చేయాలి. దాన్ని 'స్లో బర్న్' అంటారు. కానీ నేటి ఫాస్ట్ ఫుడ్ జనరేషన్ కి ఆ సమయం ఇవ్వడం కష్టంగా మారింది. ఉదాహరణకు 'సీతారామం' లాంటి క్లాసిక్ లవ్ స్టోరీలో కూడా కొందరు ల్యాగ్ ఉందంటూ కామెంట్స్ చేశారు. అంటే స్వచ్ఛమైన భావోద్వేగాలను అనుభవించే ఓపిక మనలో తగ్గిపోతోందనేది చేదు నిజం.
అలా అని తప్పు మొత్తం ప్రేక్షకులదే అని చెప్పలేం. కొంతమంది దర్శకులు కూడా 'డీటైలింగ్' పేరుతో అనవసరమైన సన్నివేశాలను ఇరికించడం కూడా ఈ విమర్శలకు ఆజ్యం పోస్తోంది. కథను ముందుకు నడిపించని సీన్స్, కేవలం హీరో ఎలివేషన్ కోసం పెట్టే స్లో మోషన్ షాట్స్, అనవసరమైన పాటలు కచ్చితంగా ల్యాగ్ కిందకే వస్తాయి. స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా లేనప్పుడు, ఆడియన్స్ మైండ్ స్క్రీన్ నుంచి పక్కకు వెళ్లిపోతుంది. అప్పుడు వారికి ఆ 5 నిమిషాల సీన్ కూడా గంటలా అనిపిస్తుంది.
నిజానికి సినిమా అనేది ఒక ఎక్స్ పీరియన్స్. మనం 3 గంటల పాటు వేరే ప్రపంచంలోకి వెళ్తాం. అక్కడ పాత్రలతో పాటు ప్రయాణించాలి. ప్రతి సీన్ లో ట్విస్టులు, ఫైట్లు ఉండవు. కొన్నిసార్లు నిశ్శబ్దం కూడా కథ చెబుతుంది. కానీ రీల్స్ చూసి చూసి మన బ్రెయిన్ 'ఫాస్ట్ ఫార్వర్డ్' మోడ్ లోకి వెళ్లిపోయింది. థియేటర్లో కూర్చున్నా సరే, చేతిలో రిమోట్ ఉన్నట్లుగా సీన్ ని స్కిప్ చేయాలనిపిస్తోంది. ఇది సినిమా అనే కళకు చాలా ప్రమాదకరం.
దీనివల్ల భవిష్యత్తులో కేవలం యాక్షన్ సినిమాలు, థ్రిల్లర్ సినిమాలు మాత్రమే సర్వైవ్ అయ్యే పరిస్థితి రావొచ్చు. డ్రామా, సెంటిమెంట్ మీద నడిచే కథలకు ఆదరణ తగ్గే ప్రమాదం ఉంది. ఇప్పటికే చాలామంది మేకర్స్ ఈ భయంతో ఎమోషనల్ సీన్స్ ను ఎడిటింగ్ లో లేపేస్తున్నారు. ఫలితంగా సినిమాలు వస్తున్నాయి, పోతున్నాయి కానీ గుండెకు హత్తుకునేవి రావడం లేదు. ఒక సోల్ లేని శరీరాల్లా తయారవుతున్నాయి.
ఈ సమస్యకు పరిష్కారం రెండు వైపులా ఉండాలి. దర్శకులు కూడా పాత పద్ధతిలో కాకుండా, నేటి తరం వేగానికి తగ్గట్టుగా స్క్రీన్ ప్లే రాసుకోవాలి. కథ చెప్పే విధానంలో వేగం పెంచాలి. అలాగని ఎమోషన్ ని చంపేయకూడదు. అదే సమయంలో ప్రేక్షకులు కూడా సినిమాను ఒక 30 సెకన్ల రీల్ లా కాకుండా, ఒక పూర్తి స్థాయి కథగా చూడటం అలవాటు చేసుకోవాలి, కానీ అది జరిగే పని కాదు.
చివరగా చెప్పాలంటే, 'ల్యాగ్' అనేది ఎప్పుడూ సినిమాలో ఉండదు.. అది చూసేవారి మనసులో, వారికున్న మూడ్ లో ఉంటుంది. మనకు నచ్చిన పని చేస్తున్నప్పుడు గంటలైనా నిమిషాల్లా గడిచిపోతాయి. నచ్చని పనిలో నిమిషం కూడా యుగంలా అనిపిస్తుంది. సినిమా కథలో లీనమైతే ల్యాగ్ కనిపించదు. లీనం కానప్పుడే ఈ పదాలన్నీ బయటకు వస్తాయి. సో, మారాల్సింది కేవలం మేకింగ్ మాత్రమే కాదు, మన వ్యూయింగ్ ఎక్స్ పీరియన్స్ కూడా. మరి రాబోయే రోజుల్లో సినిమా ప్రపంచంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడాలి.
