బాహుబలి నిర్మాతలు.. మళ్లీ ఆ రేంజ్ సినిమా ఎందుకు రాలేదు?
కానీ, ఆశ్చర్యకరంగా, 'బాహుబలి 2' విడుదలై ఏడేళ్లు దాటినా, ఆర్కా మీడియా నుంచి మళ్లీ ఆ స్థాయి భారీ చిత్రం రాలేదు. ఎందుకు?.
By: M Prashanth | 23 Oct 2025 4:00 PM IST'బాహుబలి'.. ఈ పేరు వింటేనే ఇండియన్ సినిమా గర్వంతో తలెత్తుకుంటుంది. తెలుగు సినిమా స్టామినాను ప్రపంచానికి పరిచయం చేసి, పాన్ ఇండియా అనే పదానికి అసలైన అర్థాన్ని చెప్పిన సినిమా అది. ఈ అద్భుతాన్ని తెరకెక్కించిన రాజమౌళి ఎంత పెద్ద హీరో అయ్యాడో, దాన్ని నిర్మించిన 'ఆర్కా మీడియా వర్క్స్' సంస్థ కూడా అంతే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని పేర్లు దేశవ్యాప్తంగా మార్మోగిపోయాయి.
'బాహుబలి' తర్వాత, ఆర్కా మీడియా నుంచి మరో భారీ, అంతకుమించిన ప్రాజెక్ట్ వస్తుందని అందరూ ఊహించారు. ఆ రేంజ్ విజయం తర్వాత, వాళ్ల దగ్గర వనరులకు, పలుకుబడికి కొదవే లేదు. 1700 కోట్లకు పైగా కలెక్షన్స్ రావడంతో వారి ఆదాయం మరింత పెరిగింది. దీంతో ఏ స్టార్ హీరోతో అయినా, ఏ దర్శకుడితో అయినా సినిమా చేసే స్థాయికి వాళ్లు చేరుకున్నారు.
కానీ, ఆశ్చర్యకరంగా, 'బాహుబలి 2' విడుదలై ఏడేళ్లు దాటినా, ఆర్కా మీడియా నుంచి మళ్లీ ఆ స్థాయి భారీ చిత్రం రాలేదు. ఎందుకు?. దీని వెనుక చాలా కారణాలు ఉండొచ్చు. 'బాహుబలి' లాంటి ఒక ఎపిక్‌ను సృష్టించడం అనేది మాటలు కాదు. అది కేవలం డబ్బుతో ముడిపడిన విషయం కాదు. ఐదేళ్లకు పైగా సమయం, వందలాది మంది కష్టం, ఊహకందని రిస్క్.. ఇవన్నీ ఉంటాయి.
అలాంటి ఒక ప్రాజెక్ట్‌ను విజయవంతంగా పూర్తి చేశాక, మళ్లీ వెంటనే అలాంటి సాహసానికి పూనుకోవడం అంత సులభం కాదు. ఆ ప్రెజర్, ఆ అంచనాలను అందుకోవడం చాలా కష్టం. బహుశా, ఆ ఒత్తిడి నుంచి బయటపడి, కాస్త భిన్నమైన దారిలో వెళ్లాలని వారు నిర్ణయించుకుని ఉండొచ్చు. నిజానికి, ఆర్కా మీడియా 'బాహుబలి' తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోలేదు. వాళ్లు సినిమాలు, సిరీస్‌లు నిర్మిస్తూనే ఉన్నారు. కాకపోతే, వాటి స్కేల్ వేరు. 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' వంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలను, 'పరంపర' లాంటి వెబ్ సిరీస్‌లను నిర్మించారు.
దీన్నిబట్టి చూస్తే, వాళ్ల ఫోకస్ కేవలం భారీ బడ్జెట్ సినిమాలపైనే కాకుండా, మంచి కథలపైకి, విభిన్నమైన కంటెంట్‌పైకి మళ్లిందని అర్థమవుతోంది. 'బాహుబలి' తర్వాత పాన్ ఇండియా మార్కెట్ స్వరూపమే మారిపోయింది. పోటీ విపరీతంగా పెరిగింది, రిస్క్ కూడా అదే స్థాయిలో ఉంది. కేవలం భారీ బడ్జెట్ పెట్టినంత మాత్రాన సినిమాలు ఆడటం లేదు. సరైన కథ, కంటెంట్ ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. బహుశా, 'బాహుబలి'ని మించే కథ, దానికి తగ్గ విజన్ దొరికే వరకు వేచి చూడాలని ఆర్కా మీడియా భావిస్తోందేమో. 'బాహుబలి'ని మించిన సినిమా తీయాలనే ఒత్తిడి కూడా వారిపై ఉండి ఉంటుంది.
మొత్తం మీద, పాన్ ఇండియా రూట్‌కు ట్రాక్ వేసిన ఆర్కా మీడియా, ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తోంది. వారి తదుపరి భారీ ప్రాజెక్ట్ ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ, వాళ్లు ప్రస్తుతం ఎంచుకున్న మార్గం కూడా తక్కువదేమీ కాదు. మంచి కథలను ప్రేక్షకులకు అందించాలనే వారి తపన కొనసాగుతూనే ఉంది. బహుశా, సరైన సమయం వచ్చినప్పుడు, 'బాహుబలి'ని మించిన అద్భుతంతో వాళ్లు మళ్లీ మన ముందుకు రావచ్చు. ఇక బాహుబలి రెండు భాగాలను కలిపి ఎపిక్ గా రీ రిజిల్ చేయనున్న విషయం తెలిసిందే.
