Begin typing your search above and press return to search.

వయసుకు తగిన పాత్రలతో రెట్టింపు ఇమేజ్‌!

న‌వ‌త‌రం హీరోలతో పోటీ పడి డ్యాన్సులు, ఫైట్లు చేయడం కంటే వయసుకు తగిన గాంభీర్యాన్ని ప్రదర్శించడం వల్ల స్టార్ ఇమేజ్ మరింత హుందాగా మారుతుందన్న‌ది కాద‌న‌లేని నిజం.

By:  Srikanth Kontham   |   11 April 2026 11:00 AM IST
వయసుకు తగిన పాత్రలతో రెట్టింపు ఇమేజ్‌!
X

నటుడు - స్టార్ మధ్య సన్నని గీత ఉంటుంది. ఒక అగ్ర హీరో తన వయసుకు తగినట్లుగా తండ్రి పాత్రలను లేదా పెద్దరికం ఉన్న పాత్రలను ఎంచుకున్నప్పుడు ఆయనలోని నటుడు మరో మెట్టు పైకి ఎదుగుతాడు. రజనీకాంత్ `కబాలి`లో పోషించిన పాత్ర ఏ రేంజ్ లో పండిందో తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి కూడా బాబి సినిమాలో ఓ టీనేజ్ అమ్మాయికి తండ్రి పాత్ర‌తో అల‌రించ‌బోతున్నారు. ఇలాంటి పాత్రలతో వారి ఇమేజ్ ఎంత మాత్రం తగ్గదు.

న‌వ‌త‌రం హీరోలతో పోటీ పడి డ్యాన్సులు, ఫైట్లు చేయడం కంటే వయసుకు తగిన గాంభీర్యాన్ని ప్రదర్శించడం వల్ల స్టార్ ఇమేజ్ మరింత హుందాగా మారుతుందన్న‌ది కాద‌న‌లేని నిజం.

వయసు పెరిగినా ఇంకా కాలేజీ కుర్రాడిలా కనిపిస్తే? ప్రేక్షకులకు అది కొన్నిసార్లు అసహజంగా అనిపిస్తుంది. దానికి భిన్నంగా ఒక టీనేజ్ అమ్మాయికి తండ్రిగానో లేదా ఒక వ్యవస్థను నడిపించే పెద్దగానో కనిపించినప్పుడు ఆ పాత్రలో ఉండే లోతు ప్రేక్షకులకు కొత్త అనుభ‌వాన్ని అందిస్తుంది. పైగా గ్రేస్ ఫుల్ ఏజింగ్ అనే కొత్త ట్రెండ్‌కు వారు బాట వేసిన‌ట్లు అవుతుంది. ప్ర‌స్తుతం ప్రేక్షకుల మనస్తత్వం కూడా మారింది. కథలో బలం ఉంటే తమ అభిమాన హీరో ఏ పాత్ర వేసినా ఆదరిస్తున్నారు. తండ్రి-కూతుళ్ల సెంటిమెంట్ లేదా తండ్రి-కొడుకుల మధ్య ఉండే సంఘర్షణలు వెండితెరపై ఎప్పుడూ వర్కవుట్ అయ్యే అంశాలు.

అగ్ర హీరోలు ఇలాంటి పాత్రలు చేసినప్పుడు ఆ సినిమాకు ఉండే ఎమోషనల్ కనెక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. ఇది సినిమా బాక్సాఫీస్ వసూళ్లపై సానుకూల ప్రభావం చూపుతుంది. పెద్ద త‌ర‌హా పాత్ర‌లు అనేవి వారి సెకండ్ ఇన్నింగ్స్‌ను మరింత పటిష్టం చేస్తున్నాయి. యువ హీరోలతో పోలిస్తే అగ్ర హీరోల అనుభవం వారి న‌ట‌న‌లోనే కనిపిస్తుంది. పెద్దరికం ఉన్న పాత్రలు పోషించడం వల్ల వారి నటనలోని వైవిధ్యం బయటకు వస్తుంది. అమితాబ్ బచ్చన్ వంటి నటులు తమ వయసుకు తగిన పాత్రలు ఎంచుకోవడం వల్లే నేటికీ అత్యంత బిజీ నటులుగా కొనసాగుతున్నారు.

దక్షిణాది హీరోలు కూడా అదే బాటను పూర్తి స్థాయిలో పడితే హీరోలుగానే కాక‌ లెజెండరీ యాక్టర్స్ గా చరిత్రలో నిలిచిపోతారు. ఇది వారిని యువ హీరోలతో పోల్చలేని ఒక ప్రత్యేకమైన స్థాయిలో నిలబెడుతుంది. అగ్ర హీరోలు వయసుకు తగిన పాత్రలు ఎంచుకోవడం అనేది వారి ఇమేజ్‌కు అదనపు బలం. ఇది వారిని కేవలం గ్లామర్ స్టార్స్ గా కాకుండా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ స్టార్స్ గా మారుస్తుంది. యువ హీరోలకు ఉండే వేగం కంటే పెద్దరికంలో ఉండే నిలకడ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. వయసును గౌరవిస్తూ ప్రేక్షకులను మెప్పించగలిగే నటుడికి ఎప్ప‌టికీ తిరుగుండదు.