Begin typing your search above and press return to search.

బాలీవుడ్‌లో ఖాన్‌ల త్రయానికి రీప్లేస్‌మెంట్? సరికొత్త ఈక్వేష‌న్‌పై చ‌ర్చ‌!

బాలీవుడ్ అనగానే దశాబ్దాలుగా మనకు గుర్తొచ్చే పేర్లు `షారుఖ్ ఖాన్- సల్మాన్ ఖాన్ - అమీర్ ఖాన్`.

By:  Sivaji Kontham   |   6 April 2026 10:18 AM IST
బాలీవుడ్‌లో ఖాన్‌ల త్రయానికి రీప్లేస్‌మెంట్? సరికొత్త ఈక్వేష‌న్‌పై చ‌ర్చ‌!
X

బాలీవుడ్ అనగానే దశాబ్దాలుగా మనకు గుర్తొచ్చే పేర్లు `షారుఖ్ ఖాన్- సల్మాన్ ఖాన్ - అమీర్ ఖాన్`. భారతీయ సినిమా బాక్సాఫీస్‌ను ఏలిన ఈ ఖాన్‌ల త్రయానికి ప్రత్యామ్నాయం ఎవరు అనే చర్చ గత కొంతకాలంగా సాగుతోంది. 1000 కోట్ల బెంచ్ మార్క్ వసూళ్లను సాధించగలిగే సత్తా ఉండి.. స్థిరమైన పాన్ ఇండియా విజయాలను అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకోగలిగే హీరోలే ఈ స్థానాన్ని భర్తీ చేయగలరని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ నుంచి ఆ దిశగా అడుగులు వేస్తూ రణబీర్ కపూర్, రణవీర్ సింగ్ , విక్కీ కౌశల్ రేసులో నిలుస్తున్నారు.

ఇటీవలి కాలంలో భాషా పరమైన సరిహద్దులు చెరిగిపోవడంతో దక్షిణాది స్టార్ హీరోలైన ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి వారు పాన్ ఇండియా స్థాయిలో 1000 కోట్ల వసూళ్ల స్టామినాను ప్రదర్శిస్తున్నారు. రాజ‌మౌళి సినిమాతో మ‌హేష్ కూడా రేసులోకి దూసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నుంచి అటువంటి గ్యారెంటీ ఇచ్చే స్టార్లు లేరా? అనే ప్రశ్నకు ``రణబీర్ క‌పూర్, రణవీర్ సింగ్, విక్కీ కౌశల్`` సమాధానంగా కనిపిస్తున్నారని విశ్లేషిస్తున్నారు. అయితే ఖాన్‌ల త్రయం లాగా దశాబ్దాల పాటు అదే క్రేజ్.. బాక్సాఫీస్ వేవ్‌ను కొనసాగించడం వీరికి ఉన్న అసలైన సవాలు. కేవలం భారీ వసూళ్లే కాకుండా.. ప్రజల్లో ఉండే ఆదరాభిమానాలు, అంతర్జాతీయ గుర్తింపు కూడా స్టార్‌డమ్‌కు గీటురాయిగా నిలుస్తాయి.

రణబీర్ కపూర్ ఇప్పటికే `యానిమల్` చిత్రంతో 1000 కోట్ల వసూళ్ల దరికి చేరి తన సత్తా చాటారు. ఈ సినిమా 900 కోట్లు పైగా వ‌సూలు చేసింది. అంత‌కుముందే రణబీర్ భారతదేశంలోని అత్యుత్తమ నటులలో ఒకరని స్వయంగా రాజమౌళి ప్రశంసించడం విశేషం. ప్రస్తుతం సుమారు 4000 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న `రామాయణం` ఫ్రాంచైజీతో రణబీర్ అంతర్జాతీయ స్థాయిలో సంచలనాలు సృష్టించబోతున్నారని అభిమానులు ఆశిస్తున్నారు. ఖాన్‌ల త్రయాన్ని రీప్లేస్ చేయగల సత్తా ఉన్న హీరోలలో రణబీర్ అగ్రస్థానంలో నిలుస్తున్నారు.

మరోవైపు వైవిధ్యమైన పాత్రలతో మెప్పించే రణవీర్ సింగ్ తన కెరీర్‌లో అత్యుత్తమ దశలో ఉన్నారు. `ధురంధర్`, `ధురంధర్ 2` వంటి చిత్రాలతో సంచలన విజయాలను అందుకున్న రణవీర్, బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల క్లబ్‌ను సుస్థిరం చేసుకునే దిశగా దూసుకుపోతున్నారు. అత‌డి ఎనర్జీ, నటన.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ చూస్తుంటే ఖాన్‌ల స్థానాన్ని భర్తీ చేసే అన్ని అర్హతలు అత‌డికి ఉన్నాయని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భవిష్యత్తులో రణవీర్ మరిన్ని భారీ విజయాలతో తన స్టార్‌డమ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

వీరితో పాటు `యూరి`, `చావా` వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విక్కీ కౌశల్ కూడా ఈ రేసులో ఉన్నారు. `చావా` చిత్రంతో 1000 కోట్ల క్లబ్ వరకు వచ్చిన విక్కీ భ‌విష్య‌త్ లో ఆ మైలురాయిని చేరుకుంటారని అభిమానులు భావిస్తున్నారు. `చావా` లైఫ్ ర‌న్ లో 800కోట్లు వసూలు చేసింది. అయితే ఖాన్‌ల త్రయానికి సరైన రీప్లేస్‌మెంట్‌గా మారాలంటే విక్కీ ఇంకా కఠోరంగా శ్రమించాల్సి ఉంటుంది. కేవలం నటనకే పరిమితం కాకుండా.. మాస్ ఆడియన్స్‌లో తిరుగులేని ఇమేజ్‌ను సొంతం చేసుకున్నప్పుడే ఈ ముగ్గురు స్టార్లు బాలీవుడ్‌లో ఖాన్‌ల యుగానికి వారసులుగా నిలబడగలరు.