మరో సంచలనానికి రెడీ అవుతోన్న 2018!
కేరళ వయనాడ్ కొండ చరియల ఘటనకు ఏడాది పూర్తయింది. గత ఏడాది జూలైలో జరిగిన ప్రకృతి ప్రకో పం దేశ వ్యాప్తంగా సంచలనమైన ఘటన.
By: Srikanth Kontham | 7 Aug 2025 7:00 AM ISTకేరళ వయనాడ్ కొండ చరియల ఘటనకు ఏడాది పూర్తయింది. గత ఏడాది జూలైలో జరిగిన ప్రకృతి ప్రకో పం దేశ వ్యాప్తంగా సంచలనమైన ఘటన. వరదలో వందలాది ఇళ్లు కొట్టుకుపోయాయి. వందలాది మంది మృత్యువాత పడ్డారు. బంక మట్టిలో కూరుకుపోయిన మృతదేహాలు. సగం ప్రాణాలతో కొట్టిమిట్టాడిన జీవు లెంతో మంది. బ్రతుకు జీవుడా అంటూ నిరాశ్రయులైన వారు మరికొంత మంది. మరెంతో మంది ఆచూకీ గల్లంతు. దేవతలు నడయాడిన భూమి మృతుల దిబ్బగా మారిన రోజులవి. అటుపై రెస్క్క్యూ ఆపరేషన్.
కొంకణ్ వాసుల జీవితాల్లో ఇదో టెర్రర్:
అక్కడా అడుగడుగునా అవరోధాలు. కొంకణ్ తీరానికి ఇలాంటి విలయాలు కొత్తేం కాదు. కానీ వయనాడ్ ఘటన మాత్రం అంతకు మించి. కొంకణ్ వాసుల జీవితాల్లో అతి పెద్ద టెర్రర్ ఇది. ఆ ఘటన నుంచి కోలుకోవడానికి కొన్ని నెలల సమయం పట్టింది. తాజాగా ఇప్పుడీ విలయం వెండి తెరకెక్కడానికి రెడీ అవుతోంది. నాలుగు నెలలుగా జాడ్ అంథనీ జోసెఫ్ ఇదే రీసెర్చ్ పనిలో పడ్డట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఘటన తర్వాత అక్కడే జీవనం:
బాధిత కుటుంబాలను కలిసి జాడ్ అండ్ కో కథకు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది. వయనాడ్ ఘటన తర్వాత ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించింది. చాలా మందికి పునరావాసం కల్పించింది. అయినా కొన్ని కుటుంబాలు ఇంకా అక్కడే జీవిస్తున్నాయి. పుట్టిన గడ్డతో పేగు బంధం తెంచుకోలేని కుటుంబాలు బ్రతుకు జీవుడా అంటూ అక్కడే జీవనం సాగిస్తున్నారు. ఆ కుటుంబాలను జాడ్ అంథోనీ టీమ్ కలిసి అవసరమైన సమాచారం సేకరిస్తున్నారు. కొన్ని నెలలుగా జరుగుతోన్న ప్రోసస్ ఇది.
టాలీవుడ్ లోనూ బ్లాక్ బస్టర్:
మరి ఈ సేకరణకు ఎంత సమయం కేటాయించారు? అన్నది తెలియాలి. ఇలాంటి ప్రకృతి విపత్తులపై జూడ్ ఆంథనీ జోసెఫ్ కు సినిమాలకు కొత్తేం కాదు. రెండేళ్ల క్రితం 2018లో సంభవించిన కేరళ వరదల నేపథ్యంలో `2018` అనే చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా మలయాళం సహా తెలుగు లోనూ మంచి విజయం సాధించింది. 20 కోట్ల బడ్జెట్ లో నిర్మించిన సినిమా 170 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత మళ్లీ జూడ్ అంథనీ జోసెప్ మరో కొత్త సినిమా ప్రకటించలేదు. తాజాగా మళ్లీ ప్రకృతి ప్రకోపాన్నే తన కథా వస్తువుగా మలుచుకుని ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. 2018 చిత్రానికి పని చేసిన రచయితల బృందమే ఈ చిత్రానికి పని చేస్తోంది.
