Begin typing your search above and press return to search.

అద్దంలో ఉన్నది నేనేనా?: 50 ఏళ్ల వయసు మేకోవర్‌పై నటి వామికా గబ్బి!

షూటింగ్ సమయంలో మేకప్ వేసుకున్న తర్వాత అద్దంలో తనను తాను చూసుకున్న అనుభవాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

By:  Srikanth Kontham   |   27 Oct 2026 3:05 PM IST
అద్దంలో ఉన్నది నేనేనా?: 50 ఏళ్ల వయసు మేకోవర్‌పై నటి వామికా గబ్బి!
X

బాలీవుడ్ నటి వామికా గబ్బి విభిన్నమైన పాత్రలతో నటిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. తాజాగా అమ్మ‌డు నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ లీగల్ డ్రామా చిత్రం `ప్రహార్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఉజ్వల్ నికమ్`. ఈ చిత్రంలో వామిక పాత్ర మేకోవర్ ఆశ్చర్యపరుస్తోంది. ముప్పై ఏళ్ల వయసులో ఉన్న అమ్మ‌డు ఈ చిత్రంలో ఏకంగా 50 ఏళ్ల వయసున్న జ్యోతి నికమ్ అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ వయసు పాత్ర కోసం మేకర్స్ ప్రత్యేకంగా ఉపయోగించిన ఏజింగ్ ప్రోస్తెటిక్స్ ఎంతగానో ఆశ్చర్యపరిచాయని వామికా తెలిపారు.

షూటింగ్ సమయంలో మేకప్ వేసుకున్న తర్వాత అద్దంలో తనను తాను చూసుకున్న అనుభవాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ముఖంలో వస్తున్న వృద్ధాప్యపు ఛాయలను చూసి మొదట్లో తనను తాను అద్దంలో పోల్చుకోలేకపోయానన‌న్నారు. తొలిసారి ప్రోస్తెటిక్స్ మేకప్ పూర్తయిన తర్వాత అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడు చూస్తూనే ఉండిపోయాను. అది నేనే అని నాకు తెలిసినా? అద్దంలో కనిపిస్తున్న వ్యక్తిని మాత్రం నేను వెంటనే గుర్తించలేకపోయానని వామికా గబ్బి తెలిపారు.

అయితే ఈ మేకప్ ప్రాసెస్ ఎంతో ఆసక్తిని కలిగించిందని.. ప్రతిరోజూ మేకప్ కుర్చీలో కూర్చుని తన ముఖం నెమ్మదిగా మారుతుండడాన్ని గమనించడం ఓ అద్భుతమైన అనుభవమని పేర్కొన్నారు. నటిగా నటనా పరిధిని మరింత విస్తరించుకోవడానికి ఈ పాత్ర తనకు సరికొత్త వేదికను అందించిందని అభిప్రా యపడ్డారు. మేకప్ పూర్తయిన తర్వాత రూపురేఖలు పూర్తిగా మారిపోవడంతో కొన్నిసార్లు షూటింగ్ సమయంలో ఎలా కనిపిస్తున్నాననే విషయాన్నే పూర్తిగా మరచిపోయానని తెలిపారు.

సెట్‌లో ఎవరైనా తనకు ఫోటో చూపించినప్పుడే తన మార్పును తానే ఆశ్చర్యంగా చూసుకునేదాన్నని వెల్లడించారు. అవినాష్ అరుణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దినేష్ విజన్ మాడాక్ ఫిల్మ్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. 1993 బాంబే పేలుళ్లు, 2008 ముంబై దాడి వంటి ఉగ్రవాద ఘటనలకు సంబంధించిన చారిత్రక న్యాయ పోరాటాల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ పాత్రను కేంద్రంగా చేసుకుని తెరకెక్కుతోంది. ఈ లీగల్ డ్రామాలో రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. వామికా గబ్బితో పాటు లలిత్ ప్రభాకర్, జైదీప్ అహ్లావత్, సికందర్ ఖేర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

మొత్తానికి ఒక నటిగా గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా వయసు మీరిన పాత్రలను ఎంచుకుంటూ వామికా గబ్బి ప్రదర్శిస్తున్న అంకితభావం ప్రశంసలు అందుకుంటోంది. నటన మాత్రమే కాకుండా పాత్ర కోసం బాహ్య రూపాన్ని మార్చుకునేందుకు పడుతున్న శ్ర‌మ‌ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. మ‌రి `ప్రహార్` చిత్రంలో వామిక నటన ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.