ఆకస్మిక ప్రకటన దేనికోసం?
అయితే ఫెడరేషన్ డిమాండ్ కు తలొంచేది లేదని ప్రకటిస్తూ.. ఫిలింఛాంబర్ తాజాగా ఒక నోట్ ని రిలీజ్ చేయగా అది ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.
By: Sivaji Kontham | 5 Aug 2025 9:43 AM IST30శాతం భత్యం పెంచాలంటూ ఫెడరేషన్ (సినీకార్మిక సమాఖ్య) మెరుపు సమ్మె నిర్వహిస్తుండడంతో చాలా సినిమాల షూటింగులు ట్రబుల్స్ లో పడిన సంగతి తెలిసిందే. ప్రతి మూడేళ్ల కోసారి వేతనాలను సవరించాలనే నియమాన్ని కాదని నిర్మాతలు తాత్సారం చేస్తున్నారని ఫెడరేషన్ ఆరోపిస్తోంది. మెట్రో నగరంలో పెరిగిన వ్యయాల దృష్ట్యా వేతన పెంపును తక్షణం అమలు చేయాల్సిందేనని ఫెడరేషన్ నిర్మాతలను డిమాండ్ చేసింది.
ఆకస్మిక ప్రకటన దేనికోసం?
అయితే ఫెడరేషన్ డిమాండ్ కు తలొంచేది లేదని ప్రకటిస్తూ.. ఫిలింఛాంబర్ తాజాగా ఒక నోట్ ని రిలీజ్ చేయగా అది ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. నోట్ ప్రకారం.. లేబర్ యూనియన్ చట్టాల ప్రకారం.. నిర్మాతలకు తమ పని వారిని స్వేచ్ఛగా నియమించుకునే హక్కు ఉందని నోట్ లో రాసారు. నైపుణ్యం ఉన్నవారు అసోసియేషన్లలో లేకపోయినా తాము పని కల్పిస్తామని, ఇలాంటి ప్రతిభావంతులు ఇరు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఉన్నారని అకస్మాత్తుగా ప్రకటించడం చర్చనీయాంశమైంది. కార్మిక సంఘాల్లో సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే పని కల్పించాలనే రూలేమీ లేదని కూడా ఛాంబర్ రిలీజ్ చేసిన నోట్ పేర్కొంది.
హైదరాబాద్ అంత కాస్ట్ లీ కాదు:
అంతేకాదు, ముంబై సహా ఇతర మెట్రో నగరాల్లో తీరుగా హైదరాబాద్ మెట్రోలో అధిక జీవన వ్యయం అవ్వదని కూడా ఫిలింఛాంబర్ నోట్ డిక్లేర్ చేసింది. కార్మికులకు ఇప్పటికే జీవించడానికి సరిపడే వేతనాలను తెలుగు నిర్మాతలు చెల్లిస్తున్నారని ఈ నోట్ లో పేర్కొనడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో బోలెడంత ప్రతిభ ఉంది. సరియైన ప్రతిభావంతులకు అవకాశం కల్పించేందుకు ఫిలింఛాంబర్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని కూడా ఎన్నడూ లేని విధంగా ప్రకటించడం సరికొత్త చర్చకు తెర తీసింది. అలాగే ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు, రకరకాల వాటా దారులు ఉండే వారందరి గొంతుకను ఛాంబర్ వినిపిస్తోందని కూడా వెల్లడించారు.
సినిమా భవిష్యత్‌కు ప్రగతిశీల అడుగు: అశ్వనిదత్
అయితే ఫిలింఛాంబర్ తీసుకున్న నిర్ణయానికి మద్ధతు పలుకుతూ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ, ఐదు దశాబ్ధాల సుదీర్ఘ చరిత్ర కలిగిన వైజయంతి మూవీస్ నిర్మాణ సంస్థ తాజాగా ఎక్స్ ఖాతాలో ఒక సందేశాన్ని రాసింది. ``తెలుగు సినిమా భవిష్యత్తును మెరుగుపరుచుకునేందుకు ఒక ప్రగతిశీల అడుగు ఇది. మేము కొత్త ప్రతిభకు ద్వారాలు తెరుస్తున్నాం. నైపుణ్యం కలిగిన కార్మికులను మన సినీ పరిశ్రమలోకి స్వాగతిస్తున్నాం`` అని రాసారు. దీనిని బట్టి ఇకపైనా దిగువ స్థాయి సాంకేతిక నిపుణులకు పెద్ద అవకాశాలుంటాయని భావించాలి. వైజయంతి బ్యానర్ లో కొత్త ఆర్టిస్టులు, వివిధ శాఖల్లో అంతో ఇంతో ప్రతిభ ఉన్న వారికి అవకాశాలు ఉంటాయని అనుకోవచ్చు. అయితే సినిమా 24 శాఖల్లో వృత్తి నిపుణుల స్థానంలో కొత్త వారితో ఎలా భర్తీ చేస్తారు? అన్నది వేచి చూడాలి. ఇలాంటి ఉద్యమాల సమయంలో అయినా కొత్త ప్రతిభకు గుర్తింపుతో పాటు, అవకాశాలు ఇవ్వాలని దిగ్గజ నిర్మాతలు భావించడం ఒకరకంగా ప్రోత్సహించదగినదే.
