Begin typing your search above and press return to search.

మాస్ సంచ‌ల‌నం మ‌ళ్లీ మాస్ హిట్ కొట్టేలా!

రెండు ద‌శాబ్దాల కెరీర్ లో చేసిన‌వి త‌క్కువ సినిమాలే అయినా? మాస్ ప‌ల్స్ ప‌ట్టుకుని చేసిన సినిమాలు కావ‌డంతో తెలుగు ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ కొన్ని పేజీలు రాసుకున్నారు.

By:  Srikanth Kontham   |   9 Oct 2025 7:00 PM IST
మాస్ సంచ‌ల‌నం మ‌ళ్లీ మాస్ హిట్ కొట్టేలా!
X

ఒక‌ప్ప‌టి మాస్ సెన్షేష‌న్ వి.వి.వినాయ‌క్ ఇచ్చిన విజ‌యాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. 'ఆది' ,'దిల్', 'ఠాగూర్', 'బ‌న్నీ', 'ల‌క్ష్మి', 'యోగి, 'కృష్ణ‌', 'అదుర్స్', 'బ‌ద్రీనాధ్','నాయ‌క్' లాంటి ఎన్నో మాస్ విజ‌యాలు ఇండ‌స్ట్రీకి ఇచ్చారు. మాస్ సినిమా తీయాల్సి వ‌స్తే అది వినాయ‌క్ మాత్ర‌మే తీయాలి అన్నంత ఫేమ‌స్ అయ్యారు. అలా డైరెక్ట‌ర్ గా ఓ వెలుగు వెలిగారు. రెండు ద‌శాబ్దాల కెరీర్ లో చేసిన‌వి త‌క్కువ సినిమాలే అయినా? మాస్ ప‌ల్స్ ప‌ట్టుకుని చేసిన సినిమాలు కావ‌డంతో తెలుగు ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ కొన్ని పేజీలు రాసుకున్నారు. అలా వినాయ‌క్ తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఎప్ప‌టికీ గుర్తిండే పేరు.

అలాంటి డైరెక్ట‌ర్ కొంత‌కాలంగా వైఫ‌ల్యాల్లో ఉన్నారు. ప‌రాజ‌యాలు-గ్యాప్ తీసుకోవ‌డం వంటివి వినాయ‌క్ ని ఇండ‌స్ట్రీకి మ‌రింత దూరం చేసాయి. `ఖైదీ నెంబ‌ర్ 150` విజ‌యం త‌ర్వాత వినాయ‌క్ కెరీర్ ముందుకు సాగ‌లేదు. అటుపై చేసిన 'ఇంటిలిజెంట్', 'ఛ‌త్ర‌ప‌తి' బాలీవుడ్ రీమేక్ చిత్రాలు రెండు డిజాస్ట‌రే. అప్ప‌టి నుంచి వినాయ‌క్ సినిమాలు చేయ‌లేదు. మ‌ధ్య‌లో న‌టుడిగా ప్ర‌యాణం మొద‌లు పెట్టే ప్ర‌య‌త్నం చేసి విర‌మించు కున్నారు. ఆయ‌న మ్యాక‌ప్ వేసుకోవ‌డంతో ఇక‌పై న‌టుడిగా కొన‌సాగుతాడ‌ని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఆలోచ‌న విర‌మించుకున్నారు.

అప్ప‌టి నుంచి వినాయ‌క్ పేరు కూడా ఇండ‌స్ట్రీలో వినిపించ‌లేదు. దీంతో ఆయ‌న రిటైర్మెంట్ తీసుకున్న‌ట్లేన‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ వినాయ‌క్ ఇంకా రిటైర్మెంట్ ఆలోచ‌న‌లో లేరని తెలుస్తోంది. మంచి కంబ్యాక్ చిత్రం కోసం ఎదురు చూస్తున్న‌ట్లే తాజా సంకేతాల్ని బ‌ట్టి తెలుస్తోంది. తాజాగా వినాయ‌క్ ...మ‌ళ్లీ విక్ట‌రీ వెంక‌టేష్ ని లైన్ లో పెడుతున‌ప్న‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌లే వెంకీకి స్క్రిప్ట్ వినిపించారుట‌. దీనిపై వినాయ‌క్ కూడా సానుకూలంగా స్పందించిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఇది వినాయ‌క్ మార్క్ మాస్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఉంటూనే ఓ కొత్త పాయింట్ రాసిన క‌థ‌గా వినిపిస్తోంది.

ఈ క‌థ‌ను సిద్దం చేసింది వ‌క్కంతం వంశీ అని తెలుస్తోంది. సురేష్ బాబు- నల్లమలపు బుజ్జి సంయుక్తంగా చిత్రాన్ని నిర్మించ‌డానికి ముందకొస్తున్న‌ట్లు స‌మాచారం. మ‌రి ఈ క‌థ‌ను వంశీ ఏ పాయింట్ బేస్ మీద రాసాడు? అన్న‌ది తెలియాలి. వంశీ క‌థ‌లు ఈ మ‌ధ్య కాలంలో పెద్ద‌గా సక్సెస్ అవ్వ‌డం లేదు. రెగ్యుల‌ర్ కంటెంట్ గా బాక్సాఫీస్ వ‌ద్ద తేలిపోతున్నాయి. వంశీ ఇటీవ‌లే నితిన్ హీరోగా `ఎక్స్ ట్రా ఆర్డిన‌రీ` అనే ఓ సినిమా చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ `నా పేరు సూర్య` త‌ర్వాత వంశీకి ద‌ర్శ‌కుడిగా మ‌రో వైఫ్యాల‌న్ని ఈ చిత్రం తీసుకుంది.