Begin typing your search above and press return to search.

తారక్ తో పరిటాల మూవీ.. కొడాలి నానిని చంపేస్తామని బెదిరించారా?

దివంగత నేత పరిటాల రవి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మాజీ మంత్రి కొడాలి నాని మధ్య జరిగిన ఆసక్తికరమైన సంఘటనను దర్శకుడు వీవీ వినాయక్ వెలుగులోకి తీసుకొచ్చారు.

By:  M Prashanth   |   14 April 2026 9:10 AM IST
తారక్ తో పరిటాల మూవీ.. కొడాలి నానిని చంపేస్తామని బెదిరించారా?
X

దివంగత నేత పరిటాల రవి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మాజీ మంత్రి కొడాలి నాని మధ్య జరిగిన ఆసక్తికరమైన సంఘటనను దర్శకుడు వీవీ వినాయక్ వెలుగులోకి తీసుకొచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన రివీల్ చేయగా.. ఇప్పుడు ఆ విషయం టాలీవుడ్‌ తో పాటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో అనేక మంది నెటిజన్లు డిస్కస్ చేసుకుంటున్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో వినాయక్.. తారక్ కెరీర్ ప్రారంభ దశలో జరిగిన ఒక కీలక సంఘటన రివీల్ చేశారు. ఆ సమయంలో పరిటాల రవి తన తండ్రి జీవిత చరిత్ర ఆధారంగా చేసుకుని శ్రీ రాములయ్య సినిమాను నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ఆ పాత్రకు తారక్ అయితే న్యాయం చేయగలడని భావించారేమో. దీంతో కొడాలి నానిని సంప్రదించినట్లు వినాయక్ వెల్లడించారు.

ఆ సమయంలో తారక్ కెరీర్ ప్లానింగ్ పూర్తిగా వేరే దిశలో ఉండటంతో, ఆ ప్రాజెక్ట్‌ వద్దని నాని స్పష్టం చేసినట్లు తెలిపారు. తారక్ కోసం మంచి కథ, సరైన దర్శకుడు, తగిన బడ్జెట్ ఉండాలనే విషయంలో నాని కఠినంగా ఉన్నారని వినాయక్ చెప్పారు. "మనకు నచ్చిన కథ, నచ్చిన డైరెక్టర్ ఉన్నప్పుడు మాత్రమే సినిమా చేయాలి. ఎవరి ఒత్తిడి వచ్చినా సరే, కెరీర్ విషయంలో రాజీ పడకూడదు" అనే ధోరణితో నాని వ్యవహరించారని వినాయక్ పేర్కొన్నారు.

అదే సమయంలో వినాయక్ మరో కీలక విషయాన్ని ప్రస్తావించారు. ఆ ప్రాజెక్టు విషయంలో విభేదాలు రావడంతో, పరిటాల రవి కొడాలి నానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట. చంపేస్తామని బెదిరింపులు వచ్చినట్లు వినాయక్ వెల్లడించారు. అందులో నిజమెంతో తెలియకపోయినా, కొడాలి నాని ఎదుర్కొన్న ఒత్తిడి మాత్రం నిజమేనని ఆయన తెలిపారు.

అలాంటి పరిస్థితుల్లో కొడాలి నాని వెనక్కి తగ్గకుండా, తారక్ కెరీర్ ను దృష్టిలో పెట్టుకుని కఠిన నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. "నానిది మొండి స్వభావం. తారక్ మీద ఆయనకు ఉన్న నమ్మకం, ప్రేమ చాలా గొప్పది. ప్రాణ భయం ఉన్నా తారక్ కెరీర్ కోసం రిస్క్ తీసుకున్నారు" అంటూ పరోక్షంగా వ్యాఖ్యానించారు. చివరికి ఆ శ్రీ రాములయ్య సినిమా మోహన్ బాబు లీడ్ రోల్ లో.. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

తారక్ చేయాల్సిన పాత్ర మోహన్ బాబు చేయడం, సినిమా విజయం సాధించడం అప్పట్లో చర్చకు దారి తీసింది. ఇక తారక్ కెరీర్ విషయానికి వస్తే, ఆ సమయంలో ఆయన స్టూడెంట్ నెం.1, ఆది సినిమాలతో స్టార్ హీరోగా ఎదుగుతున్న స్టేజ్ లో ఉన్నారు. అందుకే ఆయన కెరీర్‌ కు సరిపోయే ప్రాజెక్టులను మాత్రమే ఎంపిక చేయాలని నాని భావించారని తెలుస్తోంది. ఏదేమైనా అప్పటి సంఘటనను వినాయక్ రివీల్ చేయగా.. కొందరు కొడాలి నాని తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తుంటే, మరికొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.