వినాయక్ ను ముందుకి నడిపించిన దైవం
టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ డైరెక్టర్‌గా అగ్రస్థానంలో నిలిచిన వి.వి. వినాయక్ పేరు ఇప్పటికీ ప్రత్యేకంగా వినిపిస్తూనే ఉంటుంది.
By: Sravani Lakshmi Srungarapu | 24 March 2026 11:31 PM ISTటాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ డైరెక్టర్‌గా అగ్రస్థానంలో నిలిచిన వి.వి. వినాయక్ పేరు ఇప్పటికీ ప్రత్యేకంగా వినిపిస్తూనే ఉంటుంది. కమర్షియల్ సినిమాలకు కొత్త స్టైల్ తీసుకువచ్చిన ఆయన, టాప్ హీరోలతో కలిసి వరుస బ్లాక్‌బస్టర్లు అందుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించారు. అయితే, కెమెరా వెనుక మాత్రమే కాకుండా కెమెరా ముందూ తన టాలెంట్‌ను చూపించాలని ప్రయత్నించిన వినాయక్, నటుడిగా కూడా ప్రేక్షకులను మెప్పించారు.
ఈ క్రమంలో ఆయన నటించిన సినిమా శీనయ్య. ఈ సినిమా కోసం వినాయక్ తన శరీరాకృతిలో పెద్ద మార్పు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. పాత్రకు తగ్గట్టుగా సన్నగా కనిపించేందుకు లైపోసక్షన్ చేయించుకోవడం వరకు వెళ్లారు. కానీ ఆ నిర్ణయం ఆయన జీవితంలో ఊహించని సమస్యలకు దారితీసింది. లైపోసక్షన్ సమయంలో ఆయన శరీరంలోని ఇంటర్నల్ స్ట్రెయిన్స్‌లో సమస్య తలెత్తి, ఆ తర్వాత ఆయన తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు.
ఏం తిన్నా వెంటనే మోషన్‌కు వెళ్లాల్సి రావడం తద్వారా శరీరం బలహీనపడటం వంటి సమస్యలు వినాయక్‌ను వెంటాడాయి. ఈ సమస్యల అసలు కారణం ఏమిటో అర్థం కాక, వైద్యులు ఎన్నో టెస్టులు చేసి, ఆఖరికి ఒక మేజర్ సర్జరీ చేయాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. ఈ కఠినమైన దశలో వినాయక్ తీవ్ర మానసిక ఒత్తిడిని కూడా ఎదుర్కొన్నారు. అయితే వైద్య చికిత్సతో పాటు ఆయనను నిలబెట్టింది ఒక నమ్మకమని, అదే దైవ విశ్వాసమని వినాయక్ రీసెంట్ గా ఓ సందర్భంలో బయటపెట్టారు.
ఈ సందర్భంలో తనకు సర్జరీ చేసిన డా. సత్యనారాయణ అనే వ్యక్తి అతని లైఫ్ లో కీలక పాత్ర పోషించినట్టు వినాయక్ తెలిపారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలిగిన ఆయన ప్రభావంతో వినాయక్ ఒక మాతాజీపై విశ్వాసం పెంచుకున్నారు. ఆ సమయంలోనే తాను ఓ మాతాజీని నమ్మడం మొదలుపెట్టానని, మనసులో ఉన్నది చెప్పుకుని ప్రార్థన చేయడం వల్ల తనకు ఓ ధైర్యం వచ్చిందని, అది కేవలం ఆచారం కాదు, నమ్మకమని వినాయక్ వెల్లడించారు. అతని మాటల్లో ఆ విశ్వాసం తనకు మానసిక బలాన్ని ఇచ్చిందనే భావన స్పష్టంగా కనిపిస్తుంది. ఆల్రెడీ ఆరోగ్య సమస్యల నుంచి పూర్తిగా కోలుకుని సాధారణ జీవితానికి తిరిగి వచ్చిన వినాయక్, ఆ కాలాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే అది తనకు ఒక పెద్ద పరీక్షగా అనిపిస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఆ సమయంలో టాలీవుడ్ మొత్తం ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థించిందని గుర్తుచేసుకుంటున్నారు. ఈ సంఘటన ఆయన జీవితంలో ఒక మలుపు మాత్రమే కాకుండా, నమ్మకం ఎంతటి శక్తివంతమో చెప్పే ఉదాహరణగా నిలిచింది. కెరీర్‌లో ఎన్నో విజయాలు సాధించిన వినాయక్‌కు, వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఈ కష్టకాలం ఒక కొత్త దృక్పథాన్ని ఇచ్చిందని చెప్పాలి.
