ఔరా! అసలు ఒక మనిషే కాదు.. AI మోడల్ సంపాదన నెలకు లక్ష!
కానీ వృతిక పటేల్ అసలు ఒక మనిషే కాదు.. ఆమె కేవలం ఏఐ ద్వారా సృష్టించిన ఒక వర్చువల్ మోడల్.
By: Sivaji Kontham | 22 April 2026 4:00 AM ISTకృత్రిమ మేధ (AI) సాంకేతికత ప్రపంచాన్ని ఏ విధంగా మారుస్తోందో చెప్పడానికి `వృతిక పటేల్` ఒక నిలువెత్తు నిదర్శనం. సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లూయెన్సర్ అంటే ఒక మనిషి అయి ఉండాలని.. నిరంతరం ఫోటో షూట్స్ చేయాలని మనం భావిస్తాం. కానీ వృతిక పటేల్ అసలు ఒక మనిషే కాదు.. ఆమె కేవలం ఏఐ ద్వారా సృష్టించిన ఒక వర్చువల్ మోడల్. అయినా కానీ.. ఇన్‌స్టాగ్రామ్‌లో వేలాది మంది ఫాలోవర్లను సంపాదించుకోవడమే కాకుండా.. నెలకు లక్ష రూపాయలకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
వృతిక పటేల్ ఒక సాధారణ భారతీయ యువతిలాగే కనిపిస్తుంది. ఈ ఏఐ బొమ్మ కట్టుబొట్టు..ధరించే దుస్తులు..ప్రవర్తన అన్నీ మన సంస్కృతిని ప్రతిబింబించేలా ఏఐ ద్వారా అత్యంత సహజంగా డిజైన్ చేయడం ఆశ్చర్యపరుస్తుంది. ఈ వర్చువల్ ఇన్‌ఫ్లూయెన్సర్ వివిధ బ్రాండ్ల ప్రమోషన్స్, ఫ్యాషన్ షూట్స్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఆదాయాన్ని గడిస్తోంది. నిజమైన మనుషుల కంటే వేగంగా.. సమర్థవంతంగా కంటెంట్‌ను సృష్టించగలగడం ఈ ఏఐ మోడల్స్ కు ఉన్న అతిపెద్ద సానుకూలత.
నేటి డిజిటల్ మార్కెటింగ్‌లో బ్రాండ్లు కూడా వర్చువల్ ఇన్‌ఫ్లూయెన్సర్ల వైపు మొగ్గు చూపుతున్నాయి. నిజమైన సెలబ్రిటీలతో పని చేసేటప్పుడు ఉండే డేట్స్ సమస్యలు, భారీ ఖర్చులు, ప్రయాణ ఇబ్బందులు ఏవీ ఏఐ మోడల్స్ విషయంలో ఉండవు. కావలసిన సమయంలో కావలసిన నేపథ్యంతో అత్యున్నత నాణ్యత కలిగిన ఫోటోలు, వీడియోలను కేవలం కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ద్వారానే సృష్టించవచ్చు. వృతిక పటేల్ సక్సెస్ ఇప్పుడు ఇతర కంటెంట్ క్రియేటర్లకు కొత్త సవాళ్లను విసురుతోంది.
అయితే ఈ ఏఐ ఇన్‌ఫ్లూయెన్సర్ల పెరుగుదల వల్ల భవిష్యత్తులో నిజమైన మోడల్స్, ఫోటోగ్రాఫర్ల ఉపాధి దెబ్బతినే అవకాశం ఉందనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. సాంకేతికత అభివృద్ధి చెందే కొద్దీ వర్చువల్ ప్రపంచానికి.. వాస్తవ ప్రపంచానికి మధ్య ఉన్న గీత చెరిగిపోతోంది. వృతిక పటేల్ కేవలం ప్రారంభం మాత్రమేనని.. భవిష్యత్ లో ఇలాంటి ఏఐ ఆధారిత కంటెంట్ క్రియేటర్ల హవా మరింత పెరగనుందని టెక్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
వృతిక పటేల్ ఉదాహరణ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న భారీ మార్పులను సూచిస్తోంది. ఈరోజుల్లో ప్రతిరోజూ వందలాదిగా ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడుతున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గురించి వార్తలు వస్తుంటే, ఇక్కడ ఒక ఏఐ బొమ్మ నెలకు లక్ష సంపాదిచడం నిజంగా ఆశ్చర్యకరమైనదే. అయితే సాంకేతికంగా ఏఐ లో ఉత్తమమైన నాలెజ్ ఉన్నవారికి ఇది సాధ్యమేనని నిరూపణ అవుతోంది. క్రియేటివిటీకి టెక్నాలజీ తోడైతే సరికొత్త ఆదాయ మార్గాలు సృష్టించవచ్చని ఈ ఏఐ బొమ్మ నిరూపించింది. ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికలపై కేవలం వినోదం కోసమే కాకుండా.. వ్యాపార ప్రయోజనాల కోసం కూడా ఏఐని ఎలా సమర్థవంతంగా వాడుకోవచ్చో ఈ వర్చువల్ మోడల్ ప్రస్థానం తెలియజేస్తోంది. భవిష్యత్తులో ఈ రంగం ఇంకా ఎన్ని వింతలను చూపిస్తుందో వేచి చూడాలి.
