హ్యాట్రిక్.. అయినా తప్పని నిరాశ!
ఇదిలా ఉండగా ఒక హీరో ఏడాది మొత్తం ఏకంగా నాలుగు చిత్రాలు చేశారు. అందులో మూడు చిత్రాలు వరుసగా హ్యాట్రిక్ విజయాన్ని సాధించాయి.
By: Madhu Reddy | 27 Dec 2025 5:00 PM ISTసాధారణంగా ఒక హీరో ఏడాదికి ఒక సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తే.. మరో హీరో ఏకంగా మూడు నాలుగు చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు . ఇంకొంతమంది హీరోలు ఏడాదైనా లేదా రెండు సంవత్సరాలైనా ఒక్క సినిమాను కూడా రిలీజ్ చేయకుండా అభిమానులను నిరాశ పరుస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా ఒక హీరో ఏడాది మొత్తం ఏకంగా నాలుగు చిత్రాలు చేశారు. అందులో మూడు చిత్రాలు వరుసగా హ్యాట్రిక్ విజయాన్ని సాధించాయి. దీంతో నాలుగో సినిమాపై ఊహించని అంచనాలు ఏర్పడ్డాయి. పైగా 120 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించి, ఆ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. కానీ ఆ సినిమా ఫలితం ఏడాది మొత్తం సాధించిన విజయాన్ని ఒక్కసారిగా కుప్ప కూల్చింది అంటూ అభిమానులు సైతం నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
ఆ హీరో ఎవరో కాదు.. ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్.. మాలీవుడ్ హీరో అయినప్పటికీ భాషతో సంబంధం లేకుండా వరుస చిత్రాలలో నటించి పాన్ ఇండియా హీరోగా పేరు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా వందల సంఖ్యలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన ఈయన.. ఈ ఏడాది L2 ఎంపురాన్, తుడరుం, హృదయపూర్వం అంటూ వరుసగా మూడు చిత్రాలు చేసి మూడు చిత్రాలతో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అంతేకాదు ఈ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు మోహన్ లాల్.
అటు L2 ఎంపురాన్, తుడరుం చిత్రాలు మాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచాయి. అలాగే హృదయపూర్వం మంచి కలెక్షన్స్ వసూలు చేసి హిట్ స్టేటస్ ను సొంతం చేసుకుంది. అయితే మూడు సినిమాలు సక్సెస్ సాధించడంతో ఆయన నాలుగవ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అలా ఏకంగా 120 కోట్లు బడ్జెట్ తో పునర్జన్మ అనే కాన్సెప్ట్ తో ద్విభాషా ఫాంటసీ డ్రామాగా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వృషభ. భారీ అంచనాల మధ్య హై బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి రోజు కేవలం రూ. 70 లక్షలు మాత్రమే వసూలు చేసి అభిమానులను నిరాశపరిచింది.
ముఖ్యంగా మోహన్ లాల్ నటన ప్రేక్షకులను మెప్పించినా.. కథపరంగా సినిమా పెద్దగా ఆకట్టుకోలేదనే వార్తలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హ్యాట్రిక్ స్టేటస్ అందుకున్నప్పటికీ ఈ ఏడాది ఫ్లాప్ తో ముగియడంతో అటు మోహన్ లాల్ తో పాటు అభిమానులు కూడా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఏడాది మొత్తం ఎంత కష్టపడి విజయం సాధించినా.. చివరి క్షణంలో ఒక్క ఫ్లాప్ తో ఆ సంతోషం మొత్తం పోయిందని కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
ఇకపోతే ఈ ఏడాది ప్రేక్షకులను నిరాశపరిచిన జాబితాలోకి మోహన్ లాల్ చేరిపోయారు. ఇక ఈయనతో పాటు చాలామంది హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచారు అనే చెప్పాలి. అసలు విషయంలోకి వెళ్తే.. లోకేష్ కనగరాజు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా భారీ అంచనాల మధ్య విడుదల చేసిన చిత్రం కూలీ. భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా ఆగస్టు 14న విడుదల అయ్యి మిశ్రమ స్పందనను సొంతం చేసుకుంది.
అలాగే ఎన్టీఆర్ తొలిసారి బాలీవుడ్ రంగప్రవేశం చేస్తూ చేసిన సినిమా వార్ 2. ఇందులో హృతిక్ రోషన్ హీరోగా నటించారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా కూడా ఆగస్టు 14న విడుదలై డిజాస్టర్ గా నిలిచింది.
అలాగే ఈ ఏడాది ఆరంభంలో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. మాస్ మహారాజా రవితేజ కూడా మాస్ జాతర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకున్నారు.ఇలా మరి కొంతమంది హీరోలు ఎన్నో ఆశలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ ను మూటగట్టుకున్నారు. మొత్తానికి అయితే ఈ హీరోలకు ఈ ఏడాది కలిసి రాలేదని చెప్పవచ్చు.
