Begin typing your search above and press return to search.

ఆ ఫీలింగ్ వస్తేనే గెలిచినట్టు.. పార్ట్ 2 లపై కార్తీక్ దండు హింట్!

'వృషకర్మ' సినిమా 'విరూపాక్ష'కు పూర్తి భిన్నమైన హారర్ జానర్‌లో ఉంటుందని దర్శకుడు కార్తీక్ దండు తెలిపారు. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులకు అన్‌సెటిల్డ్ ఫీలింగ్ కలగడమే తన లక్ష్యమన్నారు. తమ టీమ్ మూడున్నరేళ్లు కష్టపడి ఈ సినిమాను రూపొందించిందని, అన్ని సినిమాలకు సీక్వెల్స్ ఉంటాయని హింట్ ఇచ్చారు. నాగచైతన్య, మీనాక్షి చౌదరి నటించిన ఈ చిత్రం డిసెంబర్ 4న విడుదల కానుంది.

By:  M Prashanth   |   28 Nov 2026 1:37 PM IST
ఆ ఫీలింగ్ వస్తేనే గెలిచినట్టు.. పార్ట్ 2 లపై కార్తీక్ దండు హింట్!
X

'విరూపాక్ష' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు కార్తీక్ దండు నుంచి వస్తున్న సినిమా కావడంతో 'వృషకర్మ'పై మొదటి నుంచీ భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఆ హైప్ మరింత పెరిగింది. లేటెస్ట్ గా జరిగిన 'వృషకర్మ' గ్రాండ్ మీడియా మీట్ లో కార్తీక్ దండు మాట్లాడిన మాటలు, సినిమా జానర్ గురించి ఇచ్చిన క్లారిటీ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. అలాగే సినిమాల వెనుక ఉన్న అసలు ఆలోచనను ఆయన ఓపెన్ గా బయటపెట్టారు.

చాలామంది 'వృషకర్మ'ను కూడా 'విరూపాక్ష' తరహా సినిమాగానే ఊహించుకుంటున్నారు. అయితే ఆ రెండు సినిమాలకు మధ్య ఉన్న తేడాను కార్తీక్ దండు క్లియర్ గా వివరించారు. విరూపాక్ష ఒక రకమైన హారర్ అయితే, వృషకర్మ పూర్తిగా మరో రకమైన హారర్ అని చెప్పారు. హారర్ జానర్ లోనే ఎన్నో సబ్ జానర్స్ ఉన్నాయని, వాటన్నింటినీ ఒక్కొక్కటిగా ప్రేక్షకులకు పరిచయం చేస్తానని అన్నారు.

అంతేకాదు, ఈ సినిమా చూస్తున్నంత సేపు ఆడియన్స్ కు ఒక రకమైన అన్ ఈజీ, అన్ సెటిల్డ్ ఫీలింగ్ కలుగుతుందని, ఆ అనుభూతి కలిగితేనే తాను దర్శకుడిగా సక్సెస్ అయినట్టని కొత్త థియరీ చెప్పారు. ఇదే వేదికపై తన సినిమాల సీక్వెల్స్ గురించి కూడా కార్తీక్ దండు ఆసక్తికర హింట్ ఇచ్చారు. అన్ని సినిమాలకు పార్ట్ 2 లు కచ్చితంగా వస్తాయని, ఎవరూ కంగారుపడొద్దని అభిమానులకు భరోసా ఇచ్చారు.

ఇక 'వృషకర్మ' కోసం తమ టీమ్ మూడున్నరేళ్ల పాటు రక్తం, చెమట ధారబోసి పనిచేసిందని చెప్పారు. మల్టీ లేయర్డ్, నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే తో సాగే ఈ కథ థియేటర్లలో ప్రేక్షకులకు మంచి అడ్రినలిన్ రష్ ఇస్తుందని, ఇది కచ్చితంగా బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ మూవీ అని స్పష్టం చేశారు. హీరో నాగచైతన్య ఈ ప్రాజెక్ట్ పై పెట్టుకున్న నమ్మకాన్ని కూడా దర్శకుడు గుర్తుచేసుకున్నారు.

మొదట పూర్తి కథ విని సినిమా చేయాలని ఫిక్స్ అయిన తర్వాత, ఇందులో తన హీరో ఇమేజ్ ను పక్కన పెడితే, ఇండియా గర్వించదగ్గ ఒక సినిమా చేయబోతున్నామన్న పాజిటివ్ ఫీలింగ్ కలుగుతోందని చైతన్య అన్నారట. ఆ మాటలే తమకు మరింత బాధ్యతను పెంచాయని కార్తీక్ తెలిపారు.

ఈ ఈవెంట్ లో యాంకర్ అడిగిన ఒక సరదా ప్రశ్నకు నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఇచ్చిన పంచ్ హైలైట్ గా నిలిచింది.

మీ సినిమాల్లో ఎప్పుడూ హారర్ తప్ప రొమాంటిక్ లవ్, రోజ్ ఫ్లవర్స్ లాంటివి ఉండవా అని అడగగా, ఒకవేళ కార్తీక్ అలాంటివి తీసినా తాము సినిమాలో ఉంచకుండా కట్ చేస్తామని ప్రసాద్ నవ్వుతూ అన్నారు. గత సినిమాలోనూ ఒక పాట షూట్ చేసి పక్కన పెట్టేశామని ఆయన చెప్పడంతో, కంటెంట్ విషయంలో వీరిద్దరూ ఎంత కఠినంగా ఉంటారో అర్థమైంది.

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి బాపినీడు సమర్పకులుగా, ఇషాన్ సక్సేనా సహ నిర్మాతగా వ్యవహరించారు. నాగచైతన్య సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా, జయరామ్, స్పర్ష్ శ్రీవాస్తవ, సత్య కీలక పాత్రలు పోషించారు. అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించిన 'వృషకర్మ' డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. కార్తీక్ దండు చెప్పిన ఆ 'అన్ సెటిల్డ్' హారర్ ఎక్స్ పీరియన్స్ బాక్సాఫీస్ దగ్గర ఏ స్థాయిలో వర్కవుట్ అవుతుందో చూడాలి.