సినిమాపై రాజకీయాలు వద్దు: వి.ఎన్. ఆదిత్య
కోన వెంకట్ ఆహ్వానంతో వేదికపైకి వచ్చిన సీనియర్ డైరెక్టర్ వి.ఎన్. ఆదిత్య సినిమా విశేషాలతో పాటు ఇండస్ట్రీ సమస్యలపై చేసిన ఘాటు వ్యాఖ్యలు హైలెట్ అయ్యాయి.
By: M Prashanth | 6 Sept 2026 8:44 AM ISTటాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు కెరీర్‌లో రాబోతున్న మోస్ట్ ప్రామిసింగ్ పీరియడ్ ఎంటర్‌టైనర్ కామ్రేడ్ కళ్యాణ్. జానకిరామ్ మారెళ్ల డైరెక్షన్‌లో కోన వెంకట్ సమర్పణలో వెంకట కృష్ణ కర్నాటి, సీత కర్నాటి నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 9న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఆర్‌కే సినీప్లెక్స్‌లో నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌కు టాలీవుడ్ ప్రముఖులు కూడా వచ్చారు.
కోన వెంకట్ ఆహ్వానంతో వేదికపైకి వచ్చిన సీనియర్ డైరెక్టర్ వి.ఎన్. ఆదిత్య సినిమా విశేషాలతో పాటు ఇండస్ట్రీ సమస్యలపై చేసిన ఘాటు వ్యాఖ్యలు హైలెట్ అయ్యాయి. కోన వెంకట్ ఈవెంట్స్ నిర్వహించే స్టైల్ గురించి మాట్లాడుతూ వి.ఎన్. ఆదిత్య సరదాగా మాట్లాడారు. కోన వెంకట్ ఏ చిన్న ఈవెంట్ చేసినా దాన్ని ఒక గ్రాండ్ సెలబ్రేషన్ లాగా మారుస్తారని, కేవలం టీజర్ లాంచ్‌ను కూడా ఒక పెద్ద సక్సెస్ మీట్ తరహాలో ఇంతమంది గెస్టులను పిలిచి ఘనంగా ప్లాన్ చేశారని ప్రశంసించారు.
సాధారణంగా పుస్తకం కవర్‌ను చూసి లోపల ఏముందో జడ్జ్ చేయకూడదన్న సామెతను గుర్తు చేస్తూ, ఈ సినిమాకు కూడా అది కరెక్ట్‌గా సరిపోతుందని పేర్కొన్నారు. కామ్రేడ్ కళ్యాణ్ అనే పేరు వినగానే ఆర్.నారాయణమూర్తి తీసే సీరియస్ ఎర్రజెండా విప్లవ సినిమా అని ఎవరూ ఫిక్స్ కావద్దని అన్నారు. ఇది కోన వెంకట్ మార్క్ రెడీ, ఢీ, దూకుడు తరహాలోనే శ్రీ విష్ణు బ్లాక్‌బస్టర్ సామజవరగమన లాంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని చెప్పారు.
అన్ని వర్గాల ప్రేక్షకులు కుటుంబ సమేతంగా థియేటర్లకు వెళ్లి ఎంజాయ్ చేసేలా మా ఇంటి బంగారం తరహాలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో రూపొందిందని భరోసా ఇచ్చారు. ఇదే వేదిక నుంచి తెలుగు సినిమా ఎదుర్కొంటున్న సెన్సార్ ఇబ్బందులపై ఆయన వివరణ ఇచ్చారు. గత రెండు మూడు నెలలుగా సినిమాలు బాగా ఆడుతున్నప్పటికీ, దాదాపు ప్రతి తెలుగు ప్రాజెక్ట్ సెన్సార్ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతూ నిర్మాతలను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ఎలాంటి అశ్లీలత సమాజంలోకి వెళ్లకుండా ఎవరూ ఆపలేకపోతున్నారని, కానీ కేవలం థియేటర్ సినిమాపై మాత్రమే నిబంధనలతో ఉచ్చు బిగిస్తున్నారని మండిపడ్డారు. మాలపిల్ల కాలం నుంచి నేటి కామ్రేడ్ కళ్యాణ్ వరకు సినిమా మీదే ఆంక్షలు తప్ప సమాజంలో జరిగే అరాచకాలను ఎవరూ అరికట్టలేకపోయారని అసహనం వ్యక్తం చేశారు.
శ్రీ విష్ణు ట్రాక్ రికార్డు చూస్తే ఆయన సినిమాలకు సెన్సార్ బోర్డే అవసరం లేనంత నీట్‌గా ఉంటాయని, కోన వెంకట్ చిత్రాలు కూడా కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే వస్తాయని గుర్తు చేశారు. వేలాది మంది టెక్నీషియన్లు, కళాకారుల జీవితం సినిమాపైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు. ప్రభుత్వాలు, సెన్సార్ పెద్దలు ఇండస్ట్రీతో కూర్చుని మాట్లాడి విధివిధానాలు ఖరారు చేయాలి తప్ప ఇబ్బందులు పెట్టకూడదని డిమాండ్ చేశారు.
సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వెళ్లి సక్సెస్ అయ్యారు గానీ ఒక్క రాజకీయ నాయకుడు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కాలేదని, దయచేసి సినిమాపై రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు. కామ్రేడ్ కళ్యాణ్ ఇంకా సెన్సార్ దశకు రాలేదని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ చిత్రం రిలీజ్ కావాలని ఆకాంక్షించారు. సమాజాన్ని నవ్వించడంతో పాటు ఆలోచింపజేసే శక్తి ఒక్క సినిమాకే ఉందని చెబుతూ, చిత్ర యూనిట్‌కు, దర్శకుడు జానకిరామ్‌కు, ప్రొడ్యూసర్ కిట్టు కర్నాటికి ఆల్ ది బెస్ట్ చెబుతూ తన స్పీచ్‌ను ముగించారు.
