Begin typing your search above and press return to search.

'రామాయ‌ణం' లో ఒబెరాయ్ రోల్ ప్రాముఖ్య‌త‌?

దర్శకుడు నితీష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పౌరాణిక దృశ్య కావ్యం 'రామాయణం' చిత్రంపై ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

By:  Sivaji Kontham   |   31 July 2026 8:00 PM IST
రామాయ‌ణం లో ఒబెరాయ్ రోల్ ప్రాముఖ్య‌త‌?
X

దర్శకుడు నితీష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పౌరాణిక దృశ్య కావ్యం 'రామాయణం' చిత్రంపై ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో..`రక్త చరిత్ర` ఫేమ్ వివేక్ ఓబెరాయ్ ఎలాంటి పాత్ర‌లో న‌టిస్తున్నారు? అనే చ‌ర్చ ఆస‌క్తిని క‌లిగిస్తోంది. ట్రైల‌ర్ విడుద‌లైన‌ప్ప‌టి నుంచి అందులో ఒక బ‌ల‌మైన స్ఫుర‌ద్రూపం అందరి దృష్టిని ఆక‌ర్షించింది. అది వివేక్ ఒబెరాయ్. అత‌డు ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క‌ చిత్రంలో ఒక కీలకమైన, శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నారు. `రామాయణ` ఇతిహాసంలో ఎంతో విశిష్టత కలిగిన విద్యుజ్జిహ్వ అనే రాక్షస యోధుడి పాత్రలో ఆయన కనిపించనుండటం సినీ అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

పౌరాణిక మూలాల ప్రకారం... విద్యుజ్జిహ్వ కాలకేయ లేదా దానవ వంశానికి చెందిన అత్యంత పరాక్రమవంతుడైన రాక్షస వీరుడు. అంతేకాకుండా ఈ పాత్ర రావణాసురుడికి అత్యంత దగ్పరి బంధుత్వం కలిగి ఉంటుంది. రావణుడి చెల్లెలైన శూర్పణఖ భర్తే ఈ విద్యుజ్జిహ్వ. విద్యుజ్జిహ్వ అంటే `మెరుపు లాంటి నాలుక` అని అర్థం. యుద్ధరంగంలో కత్తిని మెరుపు వేగంతో తిప్పడంలో మాయా శక్తులు ఉపయోగించడంలో ఒక రూపం నుంచి ఇంకో రూపానికి మార‌డంలో ఈ మాయావి అయిన రాక్ష‌సుడు అత్యంత సిద్ధహస్తుడు.

అయితే శూర్పణఖను వివాహం చేసుకున్నప్పటికీ విద్యుజ్జిహ్వకు రావణాసురుడికి మధ్య సత్సంబంధాలు ఉండేవి కావు. ఇద్దరి మధ్య అధికారం, ఆధిపత్య పోరు తీవ్రంగా ఉండేది. రావణాసురుడు తన దిగ్విజయ యాత్రలో భాగంగా దానవుల రాజ్యాన్ని జయించడానికి వెళ్లినప్పుడు విద్యుజ్జిహ్వ లొంగిపోవడానికి నిరాకరించి ఎదురుతిరుగుతాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య జరిగిన ఘోర యుద్ధంలో విద్యుజ్జిహ్వ ఓడిపోయి రావణాసురుడి చేతిలోనే దారుణంగా హతమవుతాడు.

విద్యుజ్జిహ్వ మరణమే రామాయణంలో ఒకానొక అతిపెద్ద మలుపుకు ప్రధాన కారణమవుతుంది. సొంత భర్తను అన్నయైన రావణుడే చంపడంతో శూర్పణఖ మనసులో పగ, ప్రతీకార జ్వాలలు రగులుతాయి. ఆ పగ తీర్చుకోవడానికే శూర్పణఖ పంచవటి వద్ద శ్రీరాముడు, లక్ష్మణులతో వివాదానికి దిగి తదనంతర కాలంలో సీతాపహరణానికి .. లంకా దహనానికి పరోక్షంగా కారణమవుతుంది. ఈ రకంగా విద్యుజ్జిహ్వ పాత్ర రామాయణ కథా గమనంలో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ చిత్రంలో రావణాసురుడిగా కన్నడ రాకింగ్ స్టార్ 'యష్' నటిస్తుండగా, విద్యుజ్జిహ్వగా వివేక్ ఓబెరాయ్ నటిస్తున్నారు. వీరిద్దరి మధ్య వచ్చే తీవ్రమైన ఫేసాఫ్‌ ఘట్టాలు.. యుద్ధ సన్నివేశాలు వెండితెరపై ప్రేక్షకులకు గొప్ప విజువల్ ట్రీట్‌గా నిలవనున్నాయి. రావణుడి అంతర్గత శత్రుత్వాన్ని... శూర్పణఖ పగతో ఉన్న‌ మూలాలను చూపించడంలో వివేక్ ఓబెరాయ్ పాత్ర నితీష్ తివారీ రామాయణంలో కీలకమైనదిగా మారనుంది. ట్రైల‌ర్ లో ఖ‌డ్గ‌ధారియై ర‌ణ‌భూమిలో ఒక బ్లింక్ లాగా క‌నిపించాడు ఒబెరాయ్. అత‌డి పాత్ర ఎలా ఉండ‌బోతోందో వేచి చూడాలి. ఈ ఏడాది దీపావ‌ళికి మొద‌టి భాగం, వ‌చ్చే ఏడాది దీపావ‌ళికి రెండో భాగం విడుద‌ల కానున్నాయి.