ఆ రోజు నా జీవితాన్ని మార్చేసింది.. సల్మాన్‌తో బ్యాటిల్‌పై ఒబెరాయ్!
అంతేకాదు.. తనను ఆ సమావేశం తరవాత అనూహ్యంగా బాలీవుడ్ నిషేధించిందని కూడా ఆవేదన చెందాడు. అప్పటికే కమిటైన చాలా ప్రాజెక్టుల నుంచి నిర్మాతలు తొలగించారు.
By: Sivaji Kontham | 28 Sept 2025 9:15 AM ISTదాదాపు రెండు దశాబ్ధాల క్రితం నాటి గొడవ ఇది. బాలీవుడ్ కి చెందిన ఇద్దరు ప్రముఖ కథానాయకుల మధ్య లవ్ & వార్ గురించి చాలా చర్చ జరిగింది. ఆ ఇద్దరు కథానాయకులు ఎవరు? అంటే.. సల్మాన్ ఖాన్- వివేక్ ఒబెరాయ్. ఐశ్వర్యారాయ్ సల్మాన్ ఖాన్ వేధింపులను, వెర్రి వ్యామోహాలను తట్టుకోలేక అతడికి బ్రేకప్ చెప్పేసిందని కథనాలు వచ్చిన తర్వాత రెండోసారి వివేక్ ఒబెరాయ్ తో ప్రేమలో పడిందన్న పుకార్లు వైరల్ అయ్యాయి. అదే క్రమంలో సల్మాన్ ఖాన్ నేరుగా ఒబెరాయ్ ని బెదిరించాడని మీడియాలో కథనాలొచ్చాయి.
తనకు ఎదురైన బెదిరింపుల ఫర్వం గురించి వివేక్ ఒబెరాయ్ మీడియా సమావేశంలో బహిరంగంగా ఆవేదన వ్యక్తపరిచాడు. తనను తన చెల్లిని, తల్లిదండ్రులను బెదిరించారని ఒబెరాయ్ ఆ సమావేశంలో చెప్పుకొచ్చారు. తనను బెదిరించినందుకు కాదు.. తన తల్లిదండ్రులు కుటుంబం ఆవేదన చెందడం తనను బాధించిందని అన్నాడు.
అంతేకాదు.. తనను ఆ సమావేశం తరవాత అనూహ్యంగా బాలీవుడ్ నిషేధించిందని కూడా ఆవేదన చెందాడు. అప్పటికే కమిటైన చాలా ప్రాజెక్టుల నుంచి నిర్మాతలు తొలగించారు. అవకాశాలు రాకుండా చేసారని కూడా ఆరోపించాడు. ఆరోజు తన జీవితాన్ని మార్చేసిన రోజు. ఆ తర్వాత అతడు పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లాడు. తన తల్లి వద్దకు వెళ్లి నాకే ఎందుకిలా జరిగింది? అని విలపించాడు. మీడియా ఎదుట బహిరంగంగా సల్మాన్ గురించి ధైర్యంగా మాట్లాడిన ఒబెరాయ్ జీవితం ఆ తర్వాత చాలా మలుపులు తిరిగింది. అతడు పరిశ్రమలో పూర్తిగా ఒంటరి అయ్యాడు. సంవత్సరాల పాటు కెరీర్ కోసం పోరాడాల్సి వచ్చింది. సల్మాన్ - ఒబెరాయ్ బ్యాటిల్ బాలీవుడ్ లో అత్యంత చర్చనీయాంశమైన వివాదాలలో ఒకటిగా మారింది.
ఈ వివాదం కెరీర్‌ను దెబ్బతీయడమే కాదు.. వ్యక్తిగత జీవితాన్ని కూడా కుదిపేసింది. తాను నిరాశలోకి వెళ్లిపోయానని ఒబెరాయ్ అన్నారు. వ్యక్తిగత జీవితం గందరగోళంలో పడింది. నిరాశతో నా తల్లి ముందు ఏడ్చాను..నాకే ఎందుకు ఇలా అని అడిగాను. నేను అవార్డులు గెలుచుకుని పేరు ప్రతిష్ఠలను ఆస్వాధించినా మంచి జరగలేదని కూడా అమ్మ నాకు గుర్తు చేసింది అని తెలిపాడు.
అయితే ఒబెరాయ్ కి శత్రువులు ఉన్నా కానీ, షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా (2007), ప్రిన్స్ (2010), క్రిష్ 3 (2013) వంటి చిత్రాలలో అవకాశాలు అందుకున్నాడు. టాలీవుడ్‌లో రక్త చరిత్ర సినిమాలో పరిటాల రవి పాత్రను పోషించాడు. కానీ కెరీర్ ప్రారంభ ఊపు తిరిగి రాలేదు. కాలక్రమేణా అతడు వ్యాపార రంగం వైపు మళ్లాడు. దుబాయ్‌లో 1200 కోట్లకు పైగా విలువైన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని నిర్మించాడు.
నా గతం గురించి తలచుకుని నవ్వుకుంటానని ఒబెరాయ్ అంటాడు. అన్నిటినీ మర్చిపోయానని కూడా ఇప్పుడు చెబుతుంటాడు. వివేక్ ఒబెరాయ్, రితేష్ దేశ్‌ముఖ్, అఫ్తాబ్ శివ్‌దాసానితో కలిసి `మస్తీ 4`తో తిరిగి తెరపై కనిపిస్తాడు. ఈ కామెడీ ఎంటర్ టైనర్ నవంబర్ లో విడుదల కానుంది.
