Begin typing your search above and press return to search.

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

ఐశ్వర్యారాయ్‌తో ప్రేమ వ్యవహారం, ఓ అగ్ర హీరోతో వివాదం తన కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపాయని నటుడు వివేక్ ఒబెరాయ్ తాజా ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో సినిమాలు కోల్పోవడంతో పాటు మాఫియా బెదిరింపులు కూడా ఎదుర్కొన్నట్లు తెలిపారు. ప్రస్తుతం వ్యాపారవేత్తగానూ రాణిస్తున్న ఆయన, ‘స్పిరిట్‌’లో ప్రభాస్‌తో తలపడనున్నారు. ‘రామాయణం’ కోసం ఇచ్చిన రూ.6 కోట్ల పారితోషికాన్ని తిరిగి ఇచ్చేశారు.

By:  Sivaji Kontham   |   8 Nov 2026 8:00 PM IST
మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!
X

ఆర్జీవీ `ర‌క్త చ‌రిత్ర‌`లో ప‌రిటాల ర‌వి పాత్ర‌లో న‌టించి మెప్పించాడు వివేక్ ఒబెరాయ్. అత‌డు ఉత్త‌రాది నుంచి ద‌క్షిణాదికి వ‌చ్చి సినిమాలు చేయ‌డం ప్రారంభించాడు. `ర‌క్త చ‌రిత్ర‌`లో క్రేజీ రోల్ పోషించిన‌ త‌ర్వాత త‌ళా అజిత్ `వివేగం`(వివేకం)లో విల‌న్ పాత్ర‌లో న‌టించి మెప్పించాడు. అత‌డికి సౌత్ లో కూడా భారీ ఫాలోయింగ్ పెరిగింది. అంత‌కంటే ముందే ఒబెరాయ్ హృతిక్ రోష‌న్ `క్రిష్ 3`లో ప‌వ‌ర్ ఫుల్ విల‌న్ పాత్ర‌లో న‌టించి మెప్పించిన సంగ‌తి తెలిసిందే.

ఖాన్ ల త్ర‌యం, క‌పూర్ లు, బ‌చ్చ‌న్ లు ఏల్తున్న ప‌రిశ్ర‌మ‌లో అత‌డు కూడా హీరోగా రాణించాడు. అప్ప‌ట్లోనే ఎంతో క్రేజ్ ఉన్న ఐశ్వ‌ర్యారాయ్ తో ప్రేమాయ‌ణం సాగించ‌డం అత‌డికి అన్ని విధాలా పెద్ద సెట్ బ్యాక్ అయింది. ఐశ్వ‌ర్య‌రాయ్ తో ల‌వ్ కార‌ణంగా అత‌డు ఒక అగ్ర హీరోతో బ‌హిరంగంగా ఘ‌ర్ష‌ణ‌కు దిగాల్సి వ‌చ్చింది. అత‌డితో వివాదం కార‌ణంగా ఒకానొక ద‌శ‌లో మీడియా ఎదుట‌కు వ‌చ్చి బ‌హిరంగంగా విమ‌ర్శ‌లు చేసాడు. ఇది త‌న జీవితంలో చేసిన అతి పెద్ద త‌ప్పిదం అని గ్ర‌హించ‌డానికి ఎక్కువ స‌మ‌యం ప‌ట్ట‌లేదు. ఆ ఘ‌ట‌న త‌ర్వాత‌ అత్యంత వేగంగా అత‌డి కెరీర్ గ్రాఫ్ జీరోకి ప‌డిపోయింది.

ఆ ఒక్క ఘ‌ట‌న అత‌డి జీవితాన్నే మార్చేసింది. ప‌రిశ్ర‌మ‌లో ఒక వ‌ర్గం అత‌డిని అణ‌చివేయ‌డం ప్రారంభించింది. అదే క్ర‌మంలో అప్ప‌టికే ఒప్పందాలు చేసుకున్న చాలా సినిమాల నుంచి నిష్క్ర‌మించాల్సి వ‌చ్చింది. తీసుకున్న అడ్వాన్సులు కూడా వెన‌క్కి వెళ్లిపోయాయి. ఇదొక్క‌టే కాదు.. అప్ప‌ట్లో ముంబైని ఏల్తున్న ప‌వ‌ర్ ఫుల్ మాఫియా నుంచి కూడా త‌న‌కు బెదిరింపులు ఎదుర‌య్యాయ‌ని ఒబెరాయ్ తాజా ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. అన్నివైపుల నుంచి అత‌డు అష్ఠ దిగ్భంధ‌నానికి గుర‌య్యాడు. ఈ ప‌రిస్థితుల‌న్నిటిపైనా ప‌లు ఇంట‌ర్వ్యూలలో వెల్ల‌డించిన ఒబెరాయ్ తాజా ఇంట‌ర్వ్యూలోను మ‌రోసారి గుర్తు చేసుకున్నాడు. అయితే ఇలాంటి ఎన్నో ప్ర‌తికూల శ‌క్తులు త‌నను తొక్కేస్తున్నా.. నిల‌క‌డైన ఆదాయం ఆర్జించేలా ఒక కార్పొరెట్ వ్య‌వ‌స్థ‌నే న‌డిపిస్తున్న వ్యాపార దిగ్గ‌జంగాను ఒబెరాయ్ పేరు తెచ్చుకున్నారు. నేడు వంద‌ల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని అత‌డు న‌డిపిస్తున్నాడంటే త‌న‌కు ఉన్న గ‌ట్స్, ముందు చూపు కార‌ణంగానే!

ఇటీవ‌లే `రామాయ‌ణం` చిత్రంలో శూర్ప‌ణ‌ఖ భ‌ర్త విద్యుత్ జిహ్వ పాత్ర‌లో న‌టించాడు. ఈ పాత్ర‌లో అత‌డి న‌ట‌న‌కు మంచి పేరొచ్చింది. త‌దుప‌రి సందీప్ రెడ్డి వంగా- ప్ర‌భాస్ కాంబినేష‌న్ లో రూపొందుతున్న `స్పిరిట్`లోను ఒబెరాయ్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఈ స‌మ‌యంలో అత‌డు ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ త‌న కెరీర్ జ‌ర్నీ గురించి ఇలాంటి ఎన్నో విష‌యాల‌ను ముచ్చ‌టించాడు. అంతేకాదు రామాయ‌ణ పార్ట్ 1 లో త‌న పాత్ర కోసం న‌మిత్ మ‌ల్హోత్రా ఆఫ‌ర్ చేసిన 6 కోట్ల పారితోషికాన్ని కూడా వెన‌క్కి ఇచ్చేసాడు. న‌మిత్ ప్ర‌య‌త్నానికి బాస‌ట‌గా నిలిచాడు. నిర్మాత‌గా న‌మిత్ య‌జ్ఞం చేసాడ‌ని ఇలాంటి ప్రాజెక్టుకు అంద‌రూ స‌హ‌క‌రించాల‌ని త‌న మంచి మ‌న‌సును చాటుకున్నాడు ఒబెరాయ్. త‌దుప‌రి `స్పిరిట్` చిత్రంలో ప్ర‌భాస్ ని ఢీకొట్టే పాత్ర‌తో ఒబెరాయ్ అభిమానుల‌ను అల‌రించేందుకు సిద్ధ‌మ‌వుతుండ‌టం విశేషం.