Begin typing your search above and press return to search.

క్యాన్స‌ర్ పిల్ల‌ల‌ కోసం పారితోషికం ఇచ్చేసిన హీరో

న‌ట‌న త‌న అభిరుచి.. కానీ ఎప్పుడూ జీవితంలో ఎద‌గ‌డానికి త‌న‌కు ప్లాన్ బి ఉంటుంద‌ని చెప్పాడు వివేక్ ఒబెరాయ్.

By:  Sivaji Kontham   |   29 Oct 2025 8:00 PM IST
క్యాన్స‌ర్ పిల్ల‌ల‌ కోసం పారితోషికం ఇచ్చేసిన హీరో
X

న‌ట‌న త‌న అభిరుచి.. కానీ ఎప్పుడూ జీవితంలో ఎద‌గ‌డానికి త‌న‌కు ప్లాన్ బి ఉంటుంద‌ని చెప్పాడు వివేక్ ఒబెరాయ్. చాలా చిన్న వ‌య‌సులోనే తండ్రి నుంచి జీవిత పాఠాల‌ను నేర్చుకున్న ఒబెరాయ్, సంపాదించ‌డం ఎలా? మార్కెట్ పై ప‌ట్టు సంపాదించ‌డ‌మెలా? అనే విష‌యాల‌ను తెలుసుకున్నాడు. త‌న ఇంట‌ర్ వ‌య‌సు వ‌చ్చేప్ప‌టికే ఒబెరాయ్ గొప్ప ఆర్జ‌కుడిగా ఎదిగాడు. చిన్న‌ప్పుడు ఇంటింటికి తిరిగి వ‌స్తువుల‌ను అమ్మ‌డంలో నైపుణ్యం సంపాదించాడు. ఇప్పుడు అత‌డు వంద‌ల కోట్ల సంస్థానాల‌కు వ్య‌వ‌స్థాప‌కుడు.

ఒబెరాయ్ ప్ర‌స్తుతం నితీష్ తివారీ `రామాయ‌ణం`లో విభీష‌ణుడి పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఇటీవ‌ల రామాయ‌ణం ప్రాజెక్ట్ గురించి చాలా విష‌యాల‌ను బ‌హిర్గ‌తం చేస్తున్న ఒబెరాయ్ ఇది అంత‌ర్జాతీయ స్థాయిలో ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షిస్తుంద‌ని వ్యాఖ్యానించాడు. నితీష్ తివారీ ఈ చిత్రాన్ని హాలీవుడ్ స్టాండార్డ్స్ కి త‌గ్గ‌కుండా తెరకెక్కిస్తున్నారని తెలిపారు.

ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క‌ చిత్రంలో విభీష‌ణుడిగా న‌టిస్తున్నందుకు గ‌ర్వంగా ఉంద‌న్న ఒబెరాయ్ త‌న పారితోషికం మొత్తం క్యాన్స‌ర్ తో పోరాడుతున్న పిల్ల‌ల‌ చికిత్స కోసం ఇచ్చేస్తున్నాన‌ని ప్ర‌క‌టించాడు. ఈ విష‌యాన్ని నిర్మాత న‌మిత్ మ‌ల్హోత్రాకు ఇదివ‌ర‌కే చెప్పాన‌ని ఒబెరాయ్ తెలిపారు. అత‌డు ఒక గొప్ప సంపాద‌కుడు, మ‌న‌సున్న హీరో అని మ‌రోసారి నిరూపించాడు.

``నాకు ఒక్క పైసా కూడా వద్దు.. నేను నమ్మే సేవా కార్య‌క్ర‌మం.. క్యాన్సర్ ఉన్న పిల్లలకు విరాళం ఇవ్వాలనుకుంటున్నాను అని నిర్మాత‌ నమిత్‌తో చెప్పాను`` అని వివేక్ అన్నారు. ఈ సినిమాను పెద్ద స్థాయిలో తెర‌కెక్కిస్తున్నారు. వారి ఆశయం న‌చ్చింది. అందుకే ఈ టీమ్ కు మద్దతు ఇవ్వాలనుకున్నాన‌ని తెలిపారు. న‌మిత్ బృందం చేస్తున్న పని ఎంతో గొప్ప‌ది.. ఇది భారతీయ సినిమాను ప్రపంచ వేదికపైకి తీసుకువెళుతుందని భావిస్తున్నాను.. కాబట్టి వారికి మ‌ద్ధ‌తిచ్చాన‌ని`` అన్నారు.

రావణుడి సోదరుడు విభీషణుడి పాత్ర పోషించాను.. సరిహద్దులను దాటుతూ భారతదేశ సాంస్కృతిక మూలాలను, పురాణాల‌ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా సెల‌బ్రేట్ చేసే ప్రాజెక్ట్‌లో భాగం కావడం గర్వంగా ఉందని ఒబెరాయ్ అన్నారు. రామాయణం హాలీవుడ్ ఇతిహాసాలకు భారతదేశం నుంచి ఒక ధీటైన‌ సమాధానం. టీమ్ ఈ చిత్రాన్ని ప్రపంచం మెచ్చ‌ద‌గిన ఫీస్ట్ గా మార్చాలని నిశ్చయించుకుందని వివేక్ ఒబెరాయ్ అన్నారు.

రామాయణంలో శ్రీ‌రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దుబే, మండోదరిగా కాజల్ అగర్వాల్, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ కూడా నటించారు.

పార్ట్ వన్ టాకీ పూర్తి చేసుకుని ఎడిటింగ్ ప‌నుల్లో ఉంది. ఈ ఇతిహాస చిత్రానికి ప్రాణం పోసేందుకు 300 రోజులపాటు ప‌లు వీఎఫ్ఎక్స్ టీమ్‌లు శ్ర‌మించ‌నున్నాయి. రామాయణం పార్ట్-1 దీపావళి 2026న విడుదల కానుంది. ఆ తర్వాత పార్ట్ 2 దీపావళి 2028న విడుదల కానుంది. ఇది భారతీయ తెర‌పై మునుపెన్న‌డూ చూడనంత భారీత‌నంతో విజువ‌ల్ ఫీస్ట్ గా తెర‌కెక్కుతోంది.