2050లో 'షారుఖ్ ఖాన్ ఎవరు?' అని అడగొచ్చు
`రక్త చరిత్ర` చిత్రంతో టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు వివేక్ ఒబెరాయ్. పరిటాల రవి పాత్రలో అతడి నటనకు మంచి పేరొచ్చింది.
By: Sivaji Kontham | 2 Jan 2026 4:00 AM IST`రక్త చరిత్ర` చిత్రంతో టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు వివేక్ ఒబెరాయ్. పరిటాల రవి పాత్రలో అతడి నటనకు మంచి పేరొచ్చింది. ఆ తర్వాత తళా అజిత్ వివేగం సినిమాలో విలన్ గాను నటించాడు. అయితే అతడు కెరీర్ ఆరంభంలోనే ఐశ్వర్యారాయ్ తో డేటింగ్ లో ఉన్నప్పుడు నిరంతరం మీడియా హెడ్ లైన్స్ లోకి వచ్చాడు. అతడు ఐష్ తో డేటింగ్ కారణంగా సల్మాన్ నుంచి బెదిరింపులను ఎదుర్కొన్నానని చెప్పాడు. అలాగే కెరీర్ పరంగా తనపై కుట్రలు జరిగాయని కూడా బహిరంగంగా వెల్లడించాడు. తాను డిప్రెషన్ లోకి వెళ్లానని కూడా అంగీకరించాడు. సక్సెస్ ఉండీ అవకాశాల్లేకుండా పోయాయని తెలిపాడు.
అది గతం అనుకుంటే, గత ఏడాది ఒబెరాయ్ జీవితంలో తీపి చేదు గుళికలు ఉన్నాయి. వివేక్ ఒబెరాయ్ సంపదల గురించి, వివాదాల గురించి గత ఏడాది చాలా చర్చ సాగింది. అతడు సినిమా రంగం కంటే వ్యాపార రంగంలో పెట్టుబడులతో నిరంతరం మీడియా హెడ్ లైన్స్ లో కొచ్చాడు. దాదాపు 1200 కోట్ల నికర ఆస్తులున్న ఒబెరాయ్ వ్యాపారాల నుంచే మెజారిటీ భాగం సంపాదించాడు.. కానీ సినిమాల నుంచి సంపాదన తక్కువ. నటన కేవలం అభిరుచి మాత్రమేనని అతడు అంగీకరించాడు.
ఈ ఏడాదిలో అతడు కొన్ని వివాదాలతోను అంటకాగాడు. అయితే అతడిని ఎక్కువగా వెంటాడిన వివాదం ఒకటి ఉంది. అది ఏమిటి? అంటే... 2050 నాటికి ప్రజలు `షారూఖ్ ఖాన్ ఎవరు?` అని ప్రశ్నిస్తారని ఒబెరాయ్ వ్యాఖ్యానించారు. జనరేషన్ మార్పుతో ఇలాంటి పరిస్థితి వస్తుందని అన్నారు. రాజ్ కపూర్ ఎవరో రణబీర్ కపూర్ ఫ్యాన్స్ లో జెన్ జెడ్ ని ప్రశ్నిస్తే ఎవరూ చెప్పలేరని కూడా అన్నాడు. నేను ఆయనను సినిమా దేవుడు! అని అంటాను. కానీ భవిష్యత్ తరానికి ఆయన ఎవరో తెలియరు. నటులు పాత బడే కొద్దీ ప్రజలు మర్చిపోతారని వివేక్ ఒబెరాయ్ అన్నారు.
ఈ ఏడాది తన చుట్టూ ఉన్న వివాదాలు తనను తాను చూసి నవ్వుకునేలా చేశాయని వివేక్ చెప్పారు. నేను కొన్ని రిస్కులు తీసుకున్నాను.. ఊహించని విధంగా విజయాలను సాధించాను! అని ఆయన అన్నారు.
ఈ సంవత్సరం తనకు సహనాన్ని నేర్పిందని వివేక్ తెలిపారు. కెరీర్ ప్రారంభంలో తన చుట్టూ ఉన్న వివాదాలు చాలా కలవరపరిచేవి..కానీ ఇప్పుడు ఎక్కువగా ప్రభావితం కాలేదని అన్నారు. ఇదంతా ఈ పరిశ్రమలో నాకు అత్యంత కష్టమైన పాఠాన్ని నేర్పింది.. నేను కొన్ని వివాదాల్లో చిక్కుకున్నాను.. అవి నన్ను చూసి నవ్వుకునేలా చేశాయి.. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం ఇవే విషయాలు నన్ను చాలా కలవరపరిచేది! అని ఆయన అన్నారు.
1960వ దశకంలో నటించిన ఏ నటుడి సినిమా గురించి అయినా.. ఈ రోజు ఎవరినైనా అడిగితే ఎవరూ పట్టించుకోరు. ఎలాగైనా మీరు చరిత్రలో కలిసిపోతారు. 2050లో ప్రజలు `షారుఖ్ ఖాన్ ఎవరు?` అని అడగొచ్చు అని అన్నారు. ఒబెరాయ్ మారుతున్న జనరేషన్ గురించి నిజాయితీగా మాట్లాడారు.
