Begin typing your search above and press return to search.

వెండితెర నుండి ఓటీటీ వరకు అద్భుత ప్రయాణం!

ఆ పాత్రలో వివేక్ చూపిన పరిణితి, సహజత్వం ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని కల్పించింది. దీంతో వివేక్ మ‌ళ్లీ వెండి తెర వెపు యూ టర్న్ తీసుకున్నారు.

By:  Srikanth Kontham   |   13 July 2026 7:00 PM IST
వెండితెర నుండి ఓటీటీ వరకు అద్భుత ప్రయాణం!
X

1991లో సుభాష్ ఘాయ్ దర్శకత్వంలో తెర‌కెక్కిన `సౌదాగర్` చిత్రం తో వివేక్ ముష్రాన్ బాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. దిలీప్ కుమార్, రాజ్ కుమార్ వంటి దిగ్గజ నటుల మ‌ధ్య వివేక్ తనదైన శైలిలో న‌టించి ప్రేక్షకులను అలరించారు. ఆ చిత్రంలోని `ఇలు ఇలు`పాట అప్ప‌టి యువతను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఆ పాట‌ వివేక్‌ను రాత్రికి రాత్రే స్టార్‌ను చేసింది. 21 ఏళ్ల వయసులోనే వివేక్ ముష్రాన్ సాధించిన విజయం అప్పట్లో ఇండ‌స్ట్రీలో ఎంతో చర్చనీయాంశమైంది. అయితే `సౌదాగర్` తర్వాత వివేక్ న‌టించిన‌ సినిమాలేవి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.

`ఫస్ట్ లవ్ లెటర్`, `రామ్ జానే` (షారుఖ్ ఖాన్‌తో కలిసి నటించారు), `సాత్వాన్ ఆస్మాన్` వంటి చిత్రాల్లో నటించినప్పటికీ తొలి చిత్రం తెచ్చిపెట్టిన క్రేజ్‌ను మళ్ళీ అందుకోలేకపోయారు. ఈ నేప‌థ్యంలో అవకాశాలు తగ్గుతున్న తరుణంలో? వివేక్ ధైర్యంగా టెలివిజన్ వైపు అడుగులు వేశారు. ఇదే వివేక్ కెరీర్‌లో కీల‌క‌మైన‌ మలుపుగా మారింది. పిల్లల కోసం రూపొందించిన `సోన్ పరి` సీరియల్‌లో రోహిత్ పాత్రలో వివేక్ నటన ప్రతి ఇంటికి చేరువ‌ చేసింది. తన కుమార్తెను ఎంతో ప్రేమతో పెంచే తండ్రి పాత్రలో ఆయన ఒదిగిపోయారు.

ఆ పాత్రలో వివేక్ చూపిన పరిణితి, సహజత్వం ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని కల్పించింది. దీంతో వివేక్ మ‌ళ్లీ వెండి తెర వెపు యూ టర్న్ తీసుకున్నారు. కొంత కాలం త‌ర్వాత‌ ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో తెర‌కెక్కిన `తమాషా` , `వీరే ది వెడ్డింగ్` వంటి చిత్రాల్లో వివేక్ పోషించిన‌ పాత్రలు ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి. అప్ప‌టి నుంచి మ‌ళ్లీ వెండి తెర‌పై విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ నటనలోని వైవిధ్యాన్ని చాటుకుంటున్నారు.

అలాగే ఓటీటీ కాలంలోనూ వివేక్ ముష్రాన్ రెండో ఇన్నింగ్స్‌ను ఎంతో విజయవంతంగా కొనసాగిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ `మై`, సోనీలివ్ `డాక్టర్ అరోరా`, కోర్టు డ్రామా కామెడీ `మామ్లా లీగల్ హై` వంటి వెబ్ సిరీస్‌లలో అద్భుతమైన నటన ప్రదర్శించారు. తన వయసుకు, అనుభవానికి తగ్గట్టుగా వైవిధ్యమైన పాత్రల్లో న‌టిస్తూ బుల్లి తె ర ప్రేక్షకుల్లోనూ త‌న‌దైన ముద్ర వేసారు.

చివ‌రిగా గ‌త ఏడాది రిలీజ్ అయిన‌ ఏవియేషన్ కామెడీ సిరీస్ `జ్యాదా మత్ ఉడ్` లో సతీష్ ఖురానా పాత్రలో కనిపించి ఉనికిని చాటుకున్నారు. ఒకప్పటి చాక్లెట్ బాయ్ నుండి నేటి పరిణతి చెందిన నటుడి వరకు వివేక్ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. వెండితెర, టెలివిజన్, ఓటిటి ఇలా ఏ మాధ్యమమైనా తనదైన నటనతో నిలబడగలగడం వివేక్ ప్రత్యేకతగా చాటారు. వివేక్ ముష్రాన్ షారుక్ ఖాన్ కి మంచి స్నేహితుడు. కెరీర్ ఆరంభ‌లో మొద‌లైన ప‌రిచ‌యం కాల‌క్ర‌మంలో ఇద్ద‌ర్నీ మంచి స్నేహితులుగా మార్చింది. ఇద్ద‌రు క‌లిసి ప‌నిచేసింది కొన్ని సినిమాల‌కే అయినా? వారి స్నేహం మాత్రం ఇప్ప‌టికీ చెక్కు చెద‌ర‌లేదు.