Begin typing your search above and press return to search.

అన్న బ్యాక్‌గ్రౌండ్ వద్దు.. స్వశక్తితోనే ఎంట్రీ!

సినిమా రంగంలోకి అడుగుపెట్టే కొత్త నటుడికి ఒకేసారి స్క్రీన్ పై హీరోగా మెరిసిపోవాలనే ఆరాటం సహజం.

By:  Srikanth Kontham   |   24 Sept 2026 8:00 AM IST
అన్న బ్యాక్‌గ్రౌండ్ వద్దు.. స్వశక్తితోనే ఎంట్రీ!
X

సినిమా రంగంలోకి అడుగుపెట్టే కొత్త నటుడికి ఒకేసారి స్క్రీన్ పై హీరోగా మెరిసిపోవాలనే ఆరాటం సహజం. అయితే పరిశ్రమలోకి అడుగుపెడుతున్న కొత్త ముఖం వివేక్ దండు మాత్రం అందుకు పూర్తి భిన్నమైన ఆలోచనా ధోరణితో క‌నిపిస్తున్నాడు. తొందరపడి హీరో అవ్వ‌డం కంటే? ముందుగా మంచి నటుడిగా తనని తాను నిరూపించుకోవడమే ప్రాథమిక లక్ష్యమని చెబుతున్నాడు. స్టార్‌డమ్ వెనుక పరిగెత్తకుండా, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకోవాలనే వివేక్ పరిణతి చెందిన వైఖరి ఆస‌క్తిక‌రం.

వివేక్ సోదరుడు కార్తీక్ దండు టాలీవుడ్‌లో `విరూపాక్ష`, నాగచైతన్యతో తెర‌కెక్కిస్తోన్న `వృషకర్మ` వంటి చిత్రాలతో విజయవంతమైన దర్శకుడిగా గుర్తింపు పొందారు. దర్శకుడి తమ్ముడిగా సినిమా అవకాశాలు సులువుగా లభిస్తాయని అనుకున్నా? వివేక్ మాత్రం ఆ మార్గాన్ని ఎంచుకోలేదు. సోదరుడు దర్శకుడిగా నిలదొక్కుకోవడానికి పడిన కష్టాలను, ఆయన పట్టుదలను దగ్గరి నుంచి చూసిన వివేక్ పరిశ్రమలో నిలదొక్కుకోవడం ఎంత సవాలుతో కూడుకున్నదో గ్రహించారు.

`నా పేరును గానీ నా గుర్తింపును గానీ ఎక్కడా ఉపయోగించవద్దు. స్వశక్తితో వర్క్‌షాప్‌లు చేసి నటన నేర్చుకో అని అన్న ఇచ్చిన సలహాను వివేక్ శిరసావహిస్తున్నాడు. నటుడిగా మారడానికి ఆసక్తి ఉంటే సరిపోదని భావించిన వివేక్, తనను తాను సంపూర్ణంగా సిద్ధం చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే ఆయన `నటరాంగ్ థియేటర్లో` చేరి నటనలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు. కొన్ని నాటకాల్లో నటించి ప్రత్యక్ష ప్రదర్శనలు ఇవ్వడం ద్వారా నటనపై ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నాడు. నాటకరంగ అనుభవం తనలోని భయాన్ని పోగొట్టి, పాత్రల్లో ఒదిగిపోయేలా తీర్చిదిద్దిందని కెమెరా ముందుకు రాకముందే నటనలోని మెళకువలను నేర్చుకోవడానికి థియేటర్ ఆర్ట్ ఎంతో ఉపయోగపడిందని వెల్లడించారు.

మొదటి సినిమాతోనే ఐదుగురు రౌడీలను కొట్టే కమర్షియల్ మాస్ హీరోగా కనిపించడం ప్రేక్షకులకు సహజంగా అనిపించదని వివేక్ అభిప్రాయ‌ప‌డ్డాడు . ఇప్పటివరకు 50కి పైగా కథలు విన్న ఆయన కేవలం నటనా సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం ఉన్న మూడు నాలుగు కథలను మాత్రమే ఎంపిక చేసుకున్నాడు. `పరిశ్రమలో ఒక నటుడిగా నిలదొక్కుకోవాలనుకుంటున్నాను. హీరోగా సక్సెస్ అయితే కథానాయకుడిగా కొనసాగుతాను. లేదంటే చిన్న పాత్రలోనైనా నటించడానికి సిద్ధమే కానీ పరిశ్రమను వదిలి వెళ్లను` అని చెప్పడం వివేక్ నటన పట్ల ఉన్న అంకితభావాన్ని తెలియజేస్తోంది.

తన తొలి చిత్రంగా సి.హెచ్. రవికిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్` అనే 1990ల గ్రామీణ నేపథ్యంలో సాగే వినోదాత్మక చిత్రాన్ని వివేక్ ఎంచుకున్నారు. ఈ సినిమాలో ఆయన చిరంజీవి అభిమానుల సంఘం అధ్యక్షుడు రాజు పాత్రలో నటిస్తుండగా, సంగీర్తన విపిన్ బాలకృష్ణ అభిమానుల సంఘం అధ్యక్షురాలిగా కనిపిస్తారు. ఇది కేవలం అభిమానుల కథ మాత్రమే కాదని 90ల కాలంలో ఉన్న ఫ్యాన్ కల్చర్‌పై ఎలాంటి వివాదాలు లేకుండా ఆరోగ్యకరమైన రీతిలో తెరకెక్కించిన చక్కటి విలేజ్ సెటైరికల్ ఎంటర్‌టైనర్ అని తెలిపారు.