ఎగ్జిబిటర్లు నా సినిమాని ఆపుతున్నారు.. దర్శకుడి ఆవేదన
నిజ కథలతో సినిమాలు తెరకెక్కించే వివాదాస్పద దర్శకుడిగా పాపులరయ్యారు వివేక్ అగ్నిహోత్రి.
By: Sivaji Kontham | 2 Sept 2025 7:12 PM ISTనిజ కథలతో సినిమాలు తెరకెక్కించే వివాదాస్పద దర్శకుడిగా పాపులరయ్యారు వివేక్ అగ్నిహోత్రి. ది తాష్కెంట్ ఫైల్స్, ది కశ్మీర్ ఫైల్స్ చిత్రాల విజయంలో వివాదాలు ప్రధాన భూమికను పోషించాయి. అతడు హిందువులపై దురాగతాలను వెండితెరపై ఆవిష్కరిస్తుండడంతో సర్వత్రా దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రొపగండా సినిమాలు తీస్తున్నాడని అతడిని టార్గెట్ చేస్తున్న ఒక వర్గం ఉంది.
ఇప్పుడు 'ది బెంగాళ్ ఫైల్స్' చిత్రాన్ని వివాదాస్పద కలకత్తా మరణకాండ, ముస్లింలీగ్ ఉద్యమం నేపథ్యంలో సాహసోపేతంగా తెరకెక్కించారు అగ్నిహోత్రి. పశ్చిమ బెంగాళ్ లో ఈ సినిమా రిలీజ్ ని అడ్డుకునేందుకు అధికార తృణమూల్ కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని వివేక్ అగ్నిహోత్రి పలుమార్లు ఆరోపించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా తనను హెచ్చరించారని కూడా గుర్తు చేసుకున్నారు. మరో రెండు రోజుల్లో మూవీ థియేటర్లలోకి విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్నా.. ఇంకా సీబీఎఫ్ సి నుంచి క్లియరెన్స్ రాకపోవడం ఆశ్చర్యపరుస్తోంది.
అయితే తన సినిమాని రిలీజ్ కానివ్వకుండా థియేటర్ యజమానులపై ఒత్తిడి తెస్తున్నారని, కొందరు రాజకీయ నాయకులు కుట్రలు పన్నారని వివేక్ అగ్నిహోత్రి ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగులు సాగుతున్నాయి. రెండు రోజుల క్రితం సీబీఎఫ్‌సి సర్టిఫికేషన్ జరగకుండా కుట్ర చేస్తున్నారని ఆవేదన చెందారు అగ్నిహోత్రి. ఈరోజు ప్రత్యేకించి బెంగాళ్ సీఎం మమతాబెనర్జీని అభ్యర్థిస్తూ, తన సినిమా రిలీజ్ ని ఆపవద్దంటూ వేడుకున్నారు. థియేటర్ యజమానులకు వార్నింగులు వెళుతున్నాయని అగ్నిహోత్రి ఆరోపిస్తున్నారు.
ఇంతకుముందు తాను అమెరికాలో సినిమా ప్రచారం నిర్వహిస్తుండగా, తనపై వరుసగా ఇండియాలో ఎఫ్.ఐ.ఆర్ లు ఫైల్ చేసారని, నాపై రెండు రోజులకు ఒక ఎఫ్.ఐ.ఆర్ నమోదైందని కూడా అగ్నిహోత్రి పేర్కొన్నారు. తనకు బెదిరింపులు కూడా ఎదురయ్యాయని అగ్నిహోత్రా ఆందోళనను వ్యక్తం చేసారు. రాజకీయ అల్లర్లు పెరుగుతాయని భయపెట్టడంతో థియేటర్ యజమానులు చివరి నిమిషంలో తన సినిమాని రిలీజ్ చేయలేమని చెబుతున్నారని అగ్నిహోత్రి తెలిపారు. అయితే 1946లో డైరెక్ట్ యాక్షన్ డే , కలకత్తా అల్లర్ల నేపథ్యంలో సినిమాని తీయడం ద్వారా అగ్నిహోత్రి రాజకీయంగా కల్లోలానికి కారణమవుతున్నారని ప్రత్యర్థులు ప్రత్యారోపణలు చేస్తున్నారు. ది బెంగాళ్ ఫైల్స్ చిత్రంలో మిథున్ చక్రవర్తి, శాశ్వత ఛటర్జీ, అనుపమ్ ఖేర్, ప్రియాంషు ఛటర్జీ, దర్శన్ కుమార్ తదితరులు నటించారు. ఈనెల 5న సినిమా థియేటర్లలో విడుదల కావాల్సి ఉండగా ఇంకా సస్పెన్స్ నెలకొంది.
