ధురంధర్2పై వివేక్ రివ్యూ.. ప్రశంసలతో పాటూ హెచ్చరిక కూడా!
ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి, ధురంధర్: ది రివెంజ్ సినిమాపై చేసిన తాజా వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.
By: Sravani Lakshmi Srungarapu | 31 March 2026 12:21 PM ISTప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి, ధురంధర్: ది రివెంజ్ సినిమాపై చేసిన తాజా వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ఒక డైరెక్టర్, మరో డైరెక్టర్ పనిని ఇంతగా ప్రశంసించడం అరుదైన విషయమే. ముఖ్యంగా ఆదిత్య ధర్ రూపొందించిన ఈ సినిమాను ఆయన కొత్త బెంచ్‌మార్క్ గా అభివర్ణించడం, ఈ ప్రాజెక్ట్ స్థాయిని మరింత ఎలివేట్ చేసింది. ఈ కామెంట్స్ కేవలం వ్యక్తిగత అభిప్రాయాలుగా కాకుండా, ఇండస్ట్రీలో ఒక స్ట్రాంగ్ సిగ్నల్‌గా కూడా పరిగణించబడుతున్నాయి.
కథలా కాకుండా సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌గా..
డైరెక్టర్ ఆదిత్యధర్ విజన్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచిందని వివేక్ పేర్కొన్నారు. కథను కేవలం చెప్పడం కాకుండా, ఒక పూర్తి సినిమాటిక్ అనుభవంగా ప్రేక్షకులకు అందించడం ధురంధర్2 ప్రత్యేకతగా కనిపిస్తోందని, భారీ స్కేల్, ఎమోషనల్ డెప్త్, విజువల్ ప్రెజెంటేషన్ అన్నీ కలిసి ఈ సినిమాను ప్రత్యేక స్థాయికి తీసుకెళ్లాయని వివేక్ భావిస్తున్నారు.
ఆదిత్యధర్ కు వివేక్ హెచ్చరిక
టెక్నికల్ యాంగిల్ లో కూడా ధురంధర్2 ప్రత్యేక గుర్తింపు సాధించింది. సినిమాటోగ్రఫీ మరియు ప్రొడక్షన్ డిజైన్ మధ్య కనిపించిన సమన్వయం కథనాన్ని మరింత ప్రభావవంతంగా మార్చింది. విజువల్స్ కేవలం అందంగా ఉండటమే కాకుండగా, కథను ముందుకు నడిపించే కీలక పాత్రను పోషించాయి. ఈ నేపథ్యంలో టెక్నికల్ టీమ్ కృషి స్పష్టంగా ప్రతిఫలించింది. అయితే ప్రశంసల మధ్యలోనే వివేక్ అగ్నిహోత్రి ఇచ్చిన హెచ్చరిక కూడా గమనార్హం. సక్సెస్ వచ్చిన తర్వాత కూడా సిస్టమ్‌తో సమతుల్యతను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ఆయన వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి. ఇది కొత్తగా ఎదుగుతున్న దర్శకులకు ఒక ముఖ్యమైన మెసేజ్‌గా భావించవచ్చు.
ఇద్దరూ కలిసి పనిచేస్తారా?
వివేక్ అగ్నిహోత్రి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వేగంగా వైరలయ్యాయి. పలువురు నెటిజన్లు వివేక్ అభిప్రాయాలను సమర్థించగా, మరికొందరు ఈ అంశంపై చర్చను ప్రారంభించారు. అభిమానులు, సినీ విశ్లేషకులు ఈ డిస్కషన్‌లో భాగమవ్వడం గమనార్హం. ఇక వివేక్ అగ్నిహోత్రి, ఆదిత్యధర్ కలిసి వర్క్ చేసే అవకాశాలపై కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సామాజిక, దేశభక్తి నేపథ్యాలతో కథలు చెప్పడంలో ఇద్దరికీ ప్రత్యేక శైలి ఉండటంతో, ఈ కాంబినేషన్ ఆసక్తికరంగా ఉండొచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
గతంలో ఆదిత్య ధర్ ఇండస్ట్రీ ఈవెంట్స్‌లో ఎదుర్కొన్న కొన్ని సమస్యలు కూడా ఇప్పుడు మళ్లీ చర్చకు వస్తున్నాయి. ఈ నేపథ్యం వల్లే వివేక్ ఇచ్చిన సూచనకు మరింత ప్రాముఖ్యత ఏర్పడిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, వివేక్ అగ్నిహోత్రి కెరీర్ దిశపై కూడా చర్చ కొనసాగుతోంది. ఆయన తరచుగా ఒకే తరహా థీమ్‌లను అనుసరిస్తున్నారనే విమర్శల మధ్య, కొత్త కథన శైలులను అన్వేషించాల్సిన అవసరం ఉందని కొందరు సూచిస్తున్నారు.
