"ఆపరేషన్ సింధూర్" పై సినిమా.. దర్శకుడు ఎవరంటే?
సాధారణంగా వివేక్ అగ్నిహోత్రి సినిమా అంటేనే ఏదో ఒక లోతైన నిజాన్ని బయటపెడతారనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంటుంది.
By: Madhu Reddy | 19 Feb 2026 5:00 AM ISTవాస్తవ సంఘటనలను వెండితెరపై ఆవిష్కరించడంలో వివేక్ అగ్నిహోత్రి స్టైలే వేరు. ది కశ్మీర్ ఫైల్స్, ది తాష్కెంట్ ఫైల్స్ వంటి చిత్రాలతో ప్రకంపనలు సృష్టించిన ఆయన, ఇప్పుడు భారత సైన్యం పరాక్రమాన్ని చాటిచెప్పే 'ఆపరేషన్ సింధూర్' నేపథ్యంతో సినిమా తీయబోతున్నారు. ప్రముఖ నిర్మాత భూషణ్ కుమార్‌తో కలిసి వివేక్ చేయబోతున్న ఈ భారీ ప్రాజెక్ట్ ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఉగ్రవాద స్థావరాలపై మన సైన్యం చేసిన మెరుపు దాడులను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నారు. వివరాలలోకి వెళితే..
వాస్తవ ఘటనలకు వివేక్ మార్క్.. టీ-సిరీస్‌తో క్రేజీ కాంబో:
సాధారణంగా వివేక్ అగ్నిహోత్రి సినిమా అంటేనే ఏదో ఒక లోతైన నిజాన్ని బయటపెడతారనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంటుంది. ఈసారి ఆయన టార్గెట్ 'ఆపరేషన్ సిందూర్'. గతేడాది పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత సైన్యం చేపట్టిన వీరోచిత పోరాటమే ఈ సినిమా కథాంశం. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం బాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థ 'టీ-సిరీస్' అధినేత భూషణ్ కుమార్‌తో వివేక్ చర్చలు జరిపారు. ఇప్పటికే వీరిద్దరి మధ్య సంప్రదింపులు పూర్తయ్యాయని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలను మన సైన్యం ఎలా ధ్వంసం చేసిందనే ఉత్కంఠభరిత సన్నివేశాలు ఈ సినిమాలో హైలైట్‌గా నిలవనున్నాయి.
టైటిల్ కోసం టఫ్ ఫైట్:
'ఆపరేషన్ సింధూర్ ' అనే టైటిల్ ఇప్పుడు ఫిలిం చాంబర్‌లో హాట్ కేకులా మారిపోయింది. ఈ పేరు కోసం ఏకంగా 15 నిర్మాణ సంస్థలు పోటీ పడటం విశేషం. ఇప్పటికే దర్శకుడు ఉత్తమ్ నితిన్ ఇదే పేరుతో ఒక సినిమాను అనౌన్స్ చేసి పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అయితే భూషణ్ కుమార్ కూడా ఈ టైటిల్ రేసులో ఉండటంతో, వివేక్ అగ్నిహోత్రి సినిమాకు ఇదే పేరు పెడతారా లేక 'ది ఆపరేషన్ సిందూర్ ఫైల్స్' వంటి కొత్త పేరుతో వస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక నటీనటుల ఎంపికపై ఇంకా క్లారిటీ లేకపోయినా, వివేక్ సినిమాల్లో ఉండే నేచురాలిటీ కోసం బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఈ ప్రాజెక్టులో భాగం కావాలని ఆశపడుతున్నారట.
దేశభక్తిని తట్టిలేపే మరో విజువల్ వండర్:
దేశభక్తిని, వాస్తవాలను ఇష్టపడే సినీ ప్రియులకు ఈ సినిమా ఒక గొప్ప అనుభూతిని ఇవ్వడం ఖాయం. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహిస్తున్నారు అంటే అది కేవలం సినిమా మాత్రమే కాదు, ఒక పరిశోధనాత్మక డాక్యుమెంటరీలా ఉంటుందని అందరికీ తెలిసిందే.ఇక భూషణ్ కుమార్ నిర్మాణ విలువలు తోడైతే ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్లో ప్రభంజనం సృష్టించడం ఖాయం. భారత సైన్యం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ఈ 'ఆపరేషన్' వెండితెరపై ఎప్పుడు మొదలవుతుందో అని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
