Begin typing your search above and press return to search.

రాకెట్లు కాల్చడం సంస్కృతి కాదు!

బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఇంట్లో దీపావళి రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ టపాసు రాకెట్ బాల్కనీలోని సోఫాపై పడటంతో మంటలు చెలరేగాయి. పెంపుడు కుక్కలు అరవడంతో కుటుంబ సభ్యులు అప్రమత్తమై ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన వివేక్, తర్వాత తన సోషల్ మీడియా పోస్టును తొలగించి, ఎవరి మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని వివరణ ఇచ్చారు.

By:  Srikanth Kontham   |   10 Nov 2026 12:25 PM IST
రాకెట్లు కాల్చడం సంస్కృతి కాదు!
X

బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి నివాసంలో దీపావళి వేడుకల వేళ ఊహించని అగ్నిప్రమాదం సంభవించిన ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. దీపావళి రాత్రి కాల్చిన ఓ టపాసు రాకెట్ నేరుగా ఆయన ఇంటి బాల్కనీలోకి దూసుకురావ‌డంతో అక్కడ పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటన నుంచి అగ్ని హోత్రి కుటుంబం తృటిలో త‌ప్పించుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. వివేక్ అగ్ని హోత్రి బాల్కనీలో ఉంచిన సోఫాపైకి బ‌య‌ట నుంచి రాకెట్ దూసుకురావ‌డంతో ఒక్కసారిగా మంటలు చెల‌రేగాయి. ఆ స‌మ‌యంలో ఇంట్లో పెంపుడు కుక్కలు సమయానికి గమనించి పెద్ద‌గా అరవడంతో కుటుంబ సభ్యులు అప్రమత్తమయ్యారని వివేక్ అగ్నిహోత్రి తెలిపారు.

అలాగే సోఫా ఫైర్-రెసిస్టెంట్ ఫ్యాబ్రిక్‌తో తయారై ఉండటంతో మంటలు వేగంగా ఇంట్లోకి వ్యాపించలేదని..లేదంటే ఊహించని పెద్ద ప్రమాదం జ‌రిగేద‌ని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా అగ్నిహోత్రి ఘ‌ట‌న‌కు కార‌ణ‌మైన వారిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. దీపావళి పండుగ సంబరాల పేరుతో ఇతరుల ప్రాణాలను, ఆస్తులను ప్రమాదంలో పడేయడం సరికాదని హితవు పలికారు. `ఎవరైనా పండుగలను ఉత్సాహంగా జరుపుకుంటారు. కానీ దారితప్పే రాకెట్లు కాల్చడం మన సాంస్కృతిక గర్వకారణం కాదు. అవి కేవలం ప్రమాదకరమైన మంటల ముప్పు మాత్రమే. అమాయకుల ప్రాణాలను పణంగా పెట్టడానికి మన గొప్ప సంస్కృతి ఎప్పుడూ అనుమతించదు` అంటూ ముంబై మేయర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

`ప్రజలకు విజ్ఞప్తులు చేస్తే సరిపోదు. బాణాసంచా నిబంధనలను ఉల్లంఘించే వారిపై భద్రతా చర్యలను అమలు చేయని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వివేక్ డిమాండ్ చేశారు. అయితే ఈ వ్యాఖ్య‌లు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. వివేక్ ఈ వ్యాఖ్య‌ల‌ను ఉద్దేశ పూర్వ‌కంగానే చేసిన‌ట్లు ఉంద‌ని నెటి జ‌నులు పోస్టులు పెట్టారు. దీపావ‌ళి రోజున ఇలాంటి చిన్న చిన్న ఘ‌ట‌న‌లు స‌హ‌జ‌మ‌ని వాటిని ప‌ట్టుకుని రాద్దాంతం చేయ‌డం స‌రికాద‌ని హిత‌వు ప‌లికారు. దీంతో కాసేప‌టికి వివేక్ ఆ పోస్టును డిలీట్ చేసారు.

దీంతో ఆయ‌న మ‌రోసారి సోష‌ల్ మీడియాలోకి వ‌చ్చి వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసారు. `నా మునుపటి ట్వీట్‌ను తొలగిస్తున్నాను. ఎవరి మనోభావాలను దెబ్బతీయడం నా ఉద్దేశం కాదు. ఆ స‌మ‌యంలో నాకు తోచింది చెప్పాను. ఎవ‌ర్నీ కావాల‌ని టార్గెట్ చేసి వ్యాఖ్యానించ‌లేద‌`న్నారు. ఇక వివేక్ అగ్నిహోత్రి సినిమాల విష‌యానికి వ‌స్తే? `బెంగాల్ ఫైల్స్` త‌ర్వాత మ‌రో సినిమా ప్ర‌క‌టించ‌లేదు. బెంగాల్ ఫైల్స్ గ‌త ఏడాది రిలీజ్ అయింది. కానీ దీనికి ప్రేక్ష‌కుల నుంచి పెద్ద‌గా స్పంద‌న రాలేదు. దీంతో త‌దుప‌రి హిట్ కంటెంట్ తోనే రావాల‌ని క‌థ‌పై క‌స‌ర‌త్తు చేస్తున్నారు.