చిత్ర యూనిట్ పై ముఖ్యమంత్రి దాడి సైతం!
సంచలన చిత్రాల దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి మరోసారి పశ్చిమ బెంగాల్ రాజకీయాలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
By: Srikanth Kontham | 6 May 2026 5:00 PM ISTసంచలన చిత్రాల దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి మరోసారి పశ్చిమ బెంగాల్ రాజకీయాలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో `ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా విడుదల తర్వాత బెంగాల్ ప్రభుత్వం తనను తీవ్రంగా ఇబ్బంది పెట్టిందని ఆరోపించారు. మమతా బెనర్జీ తనను బెంగాల్‌లో కాలు కూడా పెట్టనివ్వలేదని, తన సినిమాల ప్రదర్శనను అడ్డుకోవడమే కాకుండా చిత్ర యూనిట్‌ను అనేక రకాలుగా వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా తాను రూపొందించిన `బెంగాల్ ఫైల్స్` సినిమా విషయంలో మమత ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరించిందని వివేక్ పేర్కొన్నారు.
బెంగాల్‌లో జరిగిన కొన్ని హింసాత్మక సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాలని ఆయన భావించగా అధికార యంత్రాంగం దానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టించిందని తెలిపారు. ఈ క్రమంలో చిత్ర యూనిట్‌పై దాడులు కూడా జరిగాయని తమ భద్రతకు ముప్పు వాటిల్లిందని సంచలన విషయాలను బయటపెట్టారు. మమతా బెనర్జీ ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన గొంతు నొక్కే ప్రయత్నం చేశారని దీనివల్ల తాను వృత్తిపరంగా , వ్యక్తిగతంగా చాలా కోల్పోయానని వివేక్ అగ్నిహోత్రి అన్నారు. ఒక దర్శకుడిగా తన భావ ప్రకటనా స్వేచ్ఛను హరించారన్నారు.
బెంగాల్‌లో షూటింగ్ చేయడానికి కూడా అనుమతులు నిరాకరించారని మండిపడ్డారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల వల్ల ఒక కళాకారుడు ఇంతటి వివక్షకు గురికావడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుత రాజకీయ సమీకరణలు మారడం , అక్కడ మమతా బెనర్జీ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయిన నేపథ్యంలో వివేక్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. గతంలో భయం నీడలో ఉన్న తాము ఇప్పుడు బెంగాల్‌లో గర్వంగా తలెత్తుకుని తిరగొచ్చని వ్యాఖ్యానించారు. అణిచివేత ఎంతో కాలం సాగదని, నిజాలను దాచలేమని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఇప్పుడు బెంగాల్ ప్రజలకు వాస్తవాలను తన సినిమాల ద్వారా వివరించే అవకాశం దక్కిందని భావిస్తున్నారు. తానలా మరొకరు ఇబ్బంది పడకూడదన్న కారణంగానే ఈ విషయాల్ని మీడియాతో పంచుకుంటున్నానన్నారు. వివేక్ అగ్నిహోత్రి చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. సినిమా - రాజకీయాల మధ్య ఉండే వైరుధ్యంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సినిమా షూటింగ్‌లను లేదా యూనిట్‌ను అడ్డుకోవడం సరైనది కాదని ఓ వర్గం వాదిస్తుంటే? శాంతిభద్రతల దృష్ట్యా కొన్ని నిర్ణయాలు తప్పవని మరొక వర్గం సమర్థిస్తోంది.
