ప్రభుత్వమే కేసులు పెడుతోంది.. ఏం చేస్తారో చేస్కోండి.. డైరెక్టర్ సవాల్!
''నీ నట్టింటి కొస్తా.. నా సినిమా ట్రైలర్‌ని రిలీజ్ చేస్తాను.. ఏం చేస్తారో చూస్తాను!'' అని సవాల్ విసిరారు ప్రముఖ దర్శకనిర్మాత వివేక్ అగ్నిహోత్రి.
By: Sivaji Kontham | 8 Aug 2025 5:00 PM IST''నీ నట్టింటి కొస్తా.. నా సినిమా ట్రైలర్‌ని రిలీజ్ చేస్తాను.. ఏం చేస్తారో చూస్తాను!'' అని సవాల్ విసిరారు ప్రముఖ దర్శకనిర్మాత వివేక్ అగ్నిహోత్రి. కశ్మీర్ ఫైల్స్, వ్యాక్సిన్ వార్ లాంటి ప్రయోగాత్మక చిత్రాలతో ప్రజల మనసుల్ని గెలుచుకున్న రియలిస్టిక్ కథల దర్శకుడు, జాతీయ అవార్డ్ గ్రహీత అగ్నిహోత్రి ఇప్పుడు మరోసారి నిజ ఘటనల ఆధారంగా రూపొందించిన `బెంగాల్ ఫైల్స్` చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేస్తున్నారు. బెంగాల్ మతకల్లోలయపై ఆయన తెరకెక్కించిన సినిమా కొంతకాలంగా వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ప్రజల్లో అల్లర్లు సృష్టించేందుకే ఈ సినిమాని తీసాడంటూ డజన్ల కొద్దీ కేసులు అతడిపై నమోదయ్యాయి. ఊపిరాడనివ్వనన్ని కేసులు ఫైల్ చేయడంతో ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
మణిరత్నం 'బొంబాయి' తరహా గొడవలు:
ఇంతకుముందు బెంగాల్ ఫైల్స్ టీజర్ విడుదలై దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ సినిమాలో భావోద్వేగ కథనం, సంభాషణలు అట్టుడికించాయి. మరోసారి మణిరత్నం బొంబాయి తరహాలో గొడవలకు కారణమయ్యే సినిమా తీస్తున్నాడా? అన్న చర్చ కూడా వేడెక్కించింది. తనపై కేసులు నమోదవుతున్న వేళ అతడు భయపడకుండా ట్రైలర్ లాంచ్ కి రెడీ అవుతున్నాడు.
సవాల్ కి ప్రతి సవాల్:
ఎవరు ఏం చేసినా, ఎలాంటి రాజకీయ కుట్రలు చేసినా కానీ నేరుగా పశ్చిమ బెంగాళ్ కి వచ్చి అక్కడ పబ్లిక్‌లో తన సినిమా ట్రైలర్ ని లాంచ్ చేస్తానని అగ్నిహోత్రి తాజాగా శపథం చేసారు. ఒక రకంగా అతడు ప్రస్తుత బెంగాళ్ ప్రభుత్వాన్ని సవాల్ చేసాడు. తనపై కేసులు భనాయించి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నా, సినిమా రిలీజ్ కానివ్వకుండా అడ్డుకుంటున్నా అతడు విసిరిన ఛాలెంజ్ ఇప్పుడు చర్చగా మారింది. అగ్నిహోత్రి నేరుగా స్థానిక తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ప్రభుత్వాన్ని సవాల్ చేసిన తీరు అట్టుడికిస్తోంది.
అమెరికా నుంచి నేరుగా కౌంటర్ ఎటాక్:
ది బెంగాల్ ఫైల్స్ బోల్డ్ స్టోరి, రియలిస్టిక్ కథనంతో ప్రజల భావోద్వేగాలను టచ్ చేయబోతోంది. దీని ప్రభావం తీవ్రమైన రాజకీయ వ్యతిరేకతకు దారి తీసింది. తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) నాయకులు సినిమా కంటెంట్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వివేక్ రంజన్ అగ్నిహోత్రిపై పలుచోట్ల ఎఫ్ఐఆర్‌లు దాఖలయ్యాయి. పోలీసులు అతడి కోసం వెతుకుతున్నారు. అయితే ఈ సమయంలో ఆయన అమెరికాలో తన సినిమాని ప్రమోట్ చేస్తూ బిజీగా ఉన్నారు. అక్కడి నుంచే అతడు సవాల్ విసిరారు. టిఎంసీ నాయకుల తీరుతెన్నులను అతడు ఎండగట్టాడు.
కొందరి స్వార్థపూరిత ప్రయోజనాల కోసం..
అమెరికాలో తాజా ప్రచార వేదికపై టిఎంసి నాయకులపై వివేక్ అగ్నిహోత్రి ఎదురుదాడికి దిగారు. తాను తెరకెక్కించిన బెంగాల్ ఫైల్స్ ఎన్నో చీకటి కోణాలను బయటపెడుతుందని, మన దేశ చరిత్రలో దాగి ఉన్న చీకటి అధ్యాయలను వెలికి తీస్తుందని అగ్నిహోత్రి అన్నారు. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం వీటిని కప్పిపుచ్చారని కూడా విమర్శించారు. నేను అమెరికాలో ఉన్న సమయంలో పశ్చిమ బెంగాల్ పాలక పార్టీ, వారి సభ్యులు వేర్వేరు నగరాల్లో వేర్వేరు పోలీస్ స్టేషన్లలో నాపై ఎఫ్.ఐ.ఆర్ లు నమోదు చేయడం వ్యూహాత్మకమని అన్నారు. అయితే తాను రాజకీయ ఒత్తిళ్లకు లొంగనని అగ్నిహోత్రి వ్యాఖ్యానించారు.
చట్టాలు కోర్టులపై నమ్మకం ఉంది:
నేను మౌనంగా ఉన్నాను. భారతీయ న్యాయవ్యవస్థై నాకు నమ్మక ఉంది. కోల్ కతా హైకోర్టుపై నాకు నమ్మకం ఉంది. ఒక సృజనాత్మకత గొంతు నులిమేయలేరని అగ్నిహోత్రి వ్యాఖ్యానించారు. చట్టపరమైన అణచి వేత నుంచి బయటపడానని కూడా సవాల్ విసిరారు. పోలీసు కేసులతో నీరుగార్చడం వల్ల నేను ప్రమోషన్స్ పై దృష్టి పెట్టలేనని భావించి ఇలా చేస్తున్నారు. ఈ వ్యూహాన్ని చాలా కాలంగా అనుసరిస్తున్నారు. చరిత్రలోని ఒక చీకటి ఘట్టం ప్రజాక్షేత్రంలోకి రాకూడదని ఎందుకు అనుకుంటున్నారు? అని కూడా ప్రశ్నించారు. వీళ్లంతా నాకు వ్యతిరేకులా? సినిమాకి వ్యతిరేకులా? సత్యానికి వ్యతిరేకులా? అని కూడా ఆయన నిలదీసే ప్రయత్నం చేసారు.
