విశ్వంభర vs కాకా.. మళ్ళీ ఏంటీ తికమక?
ఇలాంటి ప్రచారం గతంలో వచ్చినప్పుడు వెంటనే వివరణ ఇచ్చారు. ఈసారి మాత్రం ఇప్పటివరకు ఎవరూ స్పందించలేదు.
By: M Prashanth | 1 Nov 2026 10:32 AM ISTచిరంజీవి సినిమాల రిలీజ్ విషయంలో మళ్లీ పాత సందేహమే మొదలైంది. ఒక సినిమా కోసం సంక్రాంతి తేదీ ప్రకటించారు. అది మారదని నిర్మాతలు మరోసారి చెప్పాల్సి వచ్చింది. అయినా ఇప్పుడు ఇంకో సినిమా అదే పండగకు వస్తుందంటున్నారు. పైగా చిరంజీవి కూడా అంగీకరించారనే టాక్ వినిపిస్తోంది. ఇలాంటి ప్రచారం గతంలో వచ్చినప్పుడు వెంటనే వివరణ ఇచ్చారు. ఈసారి మాత్రం ఇప్పటివరకు ఎవరూ స్పందించలేదు.
'విశ్వంభర'ను 2027 సంక్రాంతికి తీసుకురావడానికి చిరంజీవి ఓకే చెప్పారనే టాక్ వినిపిస్తోంది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీ హక్కులు తీసుకుందని, సంక్రాంతికే విడుదల చేయాలని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. నవంబర్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని అంటున్నారు. అయితే యూవీ క్రియేషన్స్ నుంచి ఇప్పటివరకు రిలీజ్ డేట్పై ఎలాంటి ప్రకటన రాలేదు.
ఇదే సమయంలో బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కాకా'కు జనవరి 13వ తేదీ ఖరారైంది. సెప్టెంబర్లో 'విశ్వంభర' సంక్రాంతికి వస్తుందనే వార్తలు వచ్చినప్పుడు 'కాకా' నిర్మాతలు విడుదల వాయిదా పడదని స్పష్టం చేశారు. బాబీ కూడా తేదీ మారదన్నారు. చిరంజీవి సైతం ఆ సినిమా సంక్రాంతికి వస్తుందని చెప్పారు. సెప్టెంబర్ చివర్లో 'కాకా' మొదటి భాగం షూటింగ్ పూర్తయిందని, రెండో భాగంలోనూ కొంత పని జరిగిందని చిరంజీవి వెల్లడించారు.
'విశ్వంభర' మొదట 2025 సంక్రాంతికి రావాల్సింది. ఆ తర్వాత గ్రాఫిక్స్ పనుల కారణంగా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై యూవీ క్రియేషన్స్ చాలా కాలంగా పనిచేస్తోంది. గతంలో ఓ పాట కూడా విడుదల చేశారు. కానీ సినిమా తేదీ ఫిక్స్ కాకపోవడంతో తర్వాత ప్రచారం కొనసాగలేదు. ఇప్పుడు గ్రాఫిక్స్ పనులు పూర్తయ్యాయని వార్తలు వస్తున్నా, విడుదల తేదీ మాత్రం ప్రకటించలేదు. థియేట్రికల్ బిజినెస్ కూడా ఇంకా ఖరారు కావాల్సి ఉందని టాక్ వినిపిస్తోంది.
అక్టోబర్లో మాత్రం 'విశ్వంభర'ను మార్చిలో విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు మరో టాక్ వచ్చింది. రాజమౌళి 'వారణాసి' ఏప్రిల్లో రానుండటంతో దానికి ముందే విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు. నెల తిరగకముందే సంక్రాంతి పేరు మళ్లీ వినిపిస్తోంది. ఒకే హీరో నటించిన రెండు పెద్ద సినిమాలు రోజుల వ్యవధిలో వస్తే థియేటర్ల కేటాయింపు, ప్రచారం విషయంలో ఇబ్బందులు ఉండొచ్చు. అందువల్ల ఒక సినిమా తేదీ మారకుండా ఈ ప్లాన్ అమలు కావడం కష్టమే.
మరోవైపు 'కాకా' టీమ్ సంక్రాంతి విడుదలకు తగ్గట్లుగా షూటింగ్ కొనసాగిస్తోంది. ఆ సినిమా నుంచి తొలి పాటను త్వరలో విడుదల చేస్తామని కూడా నిర్మాతలు ప్రకటించారు. 'విశ్వంభర'లో త్రిష నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నవంబర్లో విడుదల తేదీ ప్రకటిస్తారన్న టాక్ కు క్లారిటీ రావాలంటే యూవీ క్రియేషన్స్ రంగంలోకి దిగాల్సిందే.
