Begin typing your search above and press return to search.

విశ్వంభ‌ర‌- వృష‌క‌ర్మ‌.. రెండు సినిమాల‌కు ఒకటే స‌మ‌స్య‌!

ఈ మధ్య కాలంలో భారతీయ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ (VFX) కు ప్రాధాన్యత విపరీతంగా పెరిగింది.

By:  Sivaji Kontham   |   17 Aug 2026 9:28 AM IST
విశ్వంభ‌ర‌- వృష‌క‌ర్మ‌.. రెండు సినిమాల‌కు ఒకటే స‌మ‌స్య‌!
X

ఈ మధ్య కాలంలో భారతీయ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ (VFX) కు ప్రాధాన్యత విపరీతంగా పెరిగింది. కథా బలం ఎంత ఉన్నా, ప్రేక్షకుడిని వేరే లోకంలోకి తీసుకెళ్లాలంటే క్వాలిటీ వీఎఫ్ఎక్స్ అత్యంత కీలకంగా మారింది. అయితే ఇదే గ్రాఫిక్స్ పని ప్రస్తుతం భారీ ప్రాజెక్టుల విడుదల తేదీలను ప్రభావితం చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న `విశ్వంభర` చిత్రం విడుదల ఆలస్యానికి నాణ్యమైన వీఎఫ్ఎక్స్ పనులే ప్రధాన కారణమనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. అనుకున్న సమయానికి విజువల్స్ క్వాలిటీ సాధించలేకపోవడం వల్ల అవుట్‌పుట్‌లో ఎలాంటి కాంప్రమైజ్ కాకూడదని మేకర్స్ రీ-వర్క్ చేయడం ఈ జాప్యానికి దారితీసింది.

ఇప్పుడు ఇదే కారణం అక్కినేని నాగచైతన్య హీరోగా వస్తున్న `వృషకర్మ` సినిమాకు కూడా వర్తిస్తోందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అత్యున్నత స్థాయి వీఎఫ్ఎక్స్ అవుట్‌పుట్ కోసమే ఈ చిత్రం నిర్మాణం ఆలస్యమవుతోందని.. అందుకే విడుదల తేదీపై స్పష్టత రావడంలో ఆలస్యమైందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా దసరా కానుక‌గా అక్టోబర్ నెలలోనే థియేటర్లలోకి వచ్చేస్తున్నామని చిత్ర దర్శకుడు క్లారిటీ ఇవ్వడంతో నాగచైతన్య అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వీఎఫ్ఎక్స్ ఆలస్యమైనప్పటికీ దసరా నాటికి పక్కాగా పూర్తి చేసి బాక్సాఫీస్ బరిలో నిలుపుతామని బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.

ఈ రెండు సినిమాల కథాంశాలు, కాన్సెప్టులు వేటికవే ఎంతో ప్రత్యేకమైనవి. చిరంజీవి `విశ్వంభర` ఒక సోషియో-ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతోంది. పురాణాలు, పవిత్ర శక్తులు, లోకాంతర ప్రయాణాలు వంటి అంశాలను ముడిపెడుతూ ఫాంటసీ ప్రపంచంలో నడిచే కథ ఇది. మరోవైపు నాగచైతన్య నటిస్తున్న `వృషకర్మ` మిస్టీరియస్ అడ్వెంచరస్ ధ్రిల్లర్ శైలిలో ఉంటుంది. ఒక రకమైన పురావస్తు శోధన, బ‌య‌ట‌ప‌డ‌ని నిధులు లేదా రహస్యాల వేట చుట్టూ దీని కాన్సెప్ట్ తిరుగుతుందని సమాచారం. రెండూ కూడా మైథాలజీ, ఫాంటసీ ఎలిమెంట్స్‌తో విజువల్ వండర్స్‌గా ఆడియెన్స్‌ను అలరించడానికి సిద్ధమవుతున్నాయి.

విజువల్స్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయాల్సిన అవసరం ఉన్నందున... ఈ రెండు చిత్రాల నిర్మాతలు వీఎఫ్ఎక్స్ కోసం భారీ బడ్జెట్‌లను కేటాయించారు. `విశ్వంభర` బడ్జెట్‌లో మూడో వంతు కేవలం గ్రాఫిక్స్ - పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కోసమే వెచ్చిస్తున్నట్లు సమాచారం. హాలీవుడ్ స్థాయి విజువల్స్ కోసం అంతర్జాతీయ స్థాయి VFX స్టూడియోలతో పనిచేస్తున్నారు. `వృషకర్మ` విషయంలోనూ టెక్నికల్ అవుట్‌పుట్ రాజీపడకుండా ఉండటానికి బడ్జెట్‌ను భారీగా సవరించి ప్రపంచస్థాయి వీఎఫ్ఎక్స్ కంపెనీలకు బాధ్యతలు అప్పగించారు. భారీ ప్రాజెక్టులలో నాణ్యత కోసమే ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారు.

ప్రస్తుత పాన్-ఇండియా ట్రెండ్‌లో కేవలం హడావుడిగా విడుదల చేయడం కంటే నాణ్యమైన సీజీఐ (CGI), వీఎఫ్ఎక్స్‌తో ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని ఇవ్వడమే అత్యంత ముఖ్యం. అందుకే కొద్దిగా ఆలస్యమైనా పర్వాలేదు కానీ తెరపై గ్రాఫిక్స్ లోపాలు కనిపించకూడదని విశ్వంభర, వృషకర్మ మేకర్స్ భావిస్తున్నారు. ఏది ఏమైనా.. దసరాకు `వృషకర్మ` రానుండ‌గా..`విశ్వంభర` డేట్ కూడా కాస్త అటూ ఇటూగా ప్ర‌క‌టిస్తార‌ని అంద‌రూ ఎగ్జ‌యిటింగ్ గా వేచి చూస్త‌న్నారు. టాలీవుడ్‌లో ఈ రెండు చిత్రాలపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.