Begin typing your search above and press return to search.

విశ్వంభర విషయంలో త్రిష ఏం చేయనుంది?

యమలోకం నుంచి సత్యలోకం వరకు మొత్తం 14 లోకాలు సినిమాలో చూపించనున్న నేపథ్యంలో గ్రాఫిక్ వర్క్స్‌ కు భారీ స్థాయిలో ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది.

By:  M Prashanth   |   11 May 2026 8:00 PM IST
విశ్వంభర విషయంలో త్రిష ఏం చేయనుంది?
X

మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్ లో దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభరపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఆ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా.. అవని పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల త్రిష బర్త్ డే సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ అందుకుంది. చేతిలో దీపాలతో దేవకన్యలా కనిపించిన త్రిష లుక్ అభిమానులను ఆకట్టుకుంది.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆ సినిమా విడుదల మాత్రం వీఎఫ్ఎక్స్ పనులు కారణంగా లేట్ అవుతూ వస్తోంది. ముఖ్యంగా టీజర్ విడుదలైన తర్వాత గ్రాఫిక్స్ క్వాలిటీపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరగడంతో మేకర్స్ మరింత జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. అందుకే మరో ఇంటర్నేషనల్ కంపెనీకి పనులు అప్పగించినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

యమలోకం నుంచి సత్యలోకం వరకు మొత్తం 14 లోకాలు సినిమాలో చూపించనున్న నేపథ్యంలో గ్రాఫిక్ వర్క్స్‌ కు భారీ స్థాయిలో ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. కేవలం సీజీఐ, వీఎఫ్ఎక్స్ పనులు కోసమే దాదాపు రూ.75 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌ గా మారింది మాత్రం త్రిష ప్రమోషన్స్ వ్యవహారమే.

సినిమా రిలీజ్ చాలా లేట్ అవ్వడం వల్ల భారీ ప్రమోషన్స్ చేయాల్సిన అవసరం మేకర్స్ ముందు ఉంది. అయితే త్రిష ఆ ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొంటుందా లేదా అన్న దానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకు ప్రధాన కారణం ఆమె నటించిన తమిళ చిత్రం కరుప్పు ప్రమోషన్స్‌ కు దూరంగా ఉండటమే. ఆ సినిమా ఈవెంట్లలో కూడా త్రిష కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో అనేక రకాల చర్చలు మొదలయ్యాయి.

కొంతమంది మాత్రం కరుప్పు టీమ్‌ తో త్రిషకు చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినందుకే ఆమె దూరంగా ఉందని అంటున్నారు. అయితే అదే పరిస్థితి విశ్వంభర విషయంలో ఉంటుందని చెప్పలేమని సినీ ప్రియులు కామెంట్లు పెడుతున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ సినిమా కావడంతో త్రిష పెద్ద ఎత్తున ప్రమోషన్స్‌ లో పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. మరోవైపు మీడియా ముందుకు వస్తే వ్యక్తిగత విషయాలపై ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉండటంతో ఆమె జాగ్రత్తగా వ్యవహరిస్తోందనే ప్రచారం జరుగుతోంది.

సినిమా కథ విషయానికి వస్తే.. యుద్ధాలు, మారణహోమాలకు విసిగిపోయిన ప్రజలను ఓ వీరుడు ఎలా రక్షించాడు? హీరోయిన్ కోసం వేరే లోకానికి వెళ్లిన హీరోకు ఎదురైన సవాళ్లు ఏమిటి? చివరకు ఆమెను ఎలా తీసుకొచ్చాడు? అన్న అంశాల చుట్టూ కథ తిరుగుతుందని సమాచారం. టీజర్‌ ను బట్టి చూస్తే చిరంజీవి పవర్‌ ఫుల్ వారియర్ పాత్రలో కనిపించనున్నట్లు అర్థమవుతోంది.

ఇక చిత్రంలో ఆషికా రంగనాథ్ మరో హీరోయిన్‌ గా నటిస్తుండగా, కునాల్ కపూర్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే మౌనీ రాయ్ స్పెషల్ సాంగ్‌ లో మెరవనున్నారు. ఆస్కార్ విజేత కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అన్ని పనులు పూర్తయ్యాక ఫైనల్ కాపీని చిరంజీవి చూసిన తర్వాతే రిలీజ్ డేట్‌ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం జులై 10 విడుదల తేదీగా ప్రచారం జరుగుతున్నా.. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.