చిరంజీవి 'విశ్వంభర'పై మెగా ప్రకటన? మెగాఫ్యాన్స్ ఎదురుచూపులు ఫలించే రోజు!
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక సోషియో-ఫాంటసీ చిత్రం `విశ్వంభర` ఇటీవల కాలంలో బాగా ఆలస్యమవుతున్న పెద్ద సినిమాల్లో ఒకటిగా వార్తల్లో నిలుస్తోంది.
By: Sivaji Kontham | 11 Aug 2026 3:05 PM ISTమెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక సోషియో-ఫాంటసీ చిత్రం `విశ్వంభర` ఇటీవల కాలంలో బాగా ఆలస్యమవుతున్న పెద్ద సినిమాల్లో ఒకటిగా వార్తల్లో నిలుస్తోంది. నిజానికి ఈ భారీ చిత్రాన్ని మొదట జనవరి 2025లోనే విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. అయితే రకరకాల సాంకేతిక కారణాలు సహా ప్రొడక్షన్ డిలే కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని 16 అక్టోబర్ 2026న విడుదల చేస్తారా? లేక సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేఏస్తున్నారా? అనేదానిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.
ఇదిలా ఉండగా.. వరుణ్ తేజ్ నటించిన `కొరియన్ కనకరాజు` మూవీ సక్సెస్ మీట్‌కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ వేడుకలో మెగాస్టార్ తన `విశ్వంభర` ప్రాజెక్ట్‌కు సంబంధించి ఏమైనా క్రేజీ అప్‌డేట్ ఇస్తారేమోనని అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిరంజీవి నోటి నుంచి వచ్చే చిన్న ప్రస్తావనైనా సరే ప్రస్తుతం ఈ సినిమాపై తగ్గిన బజ్ ని మళ్లీ పెంచి.. కొత్త ఊపును తీసుకువస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఒకవేళ అనుకున్న సమయానికి సినిమా వస్తే మెగా అభిమానులకు అది అతిపెద్ద పండగలాంటి వార్తే అవుతుంది.
విశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్న ఈ సోషియో-ఫాంటసీ డ్రామాలో చిరంజీవి సరసన త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తుండగా.. ఆషికా రంగనాథ్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తారు. ఇక బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ ప్రతి నాయకుడి (విలన్) పాత్రను పోషిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతాన్ని అందిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
వసూళ్ల సునామీతో కనకరాజు రూ.50 కోట్ల క్లబ్ వైపు పరుగులు
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ `కొరియన్ కనకరాజు` థియేటర్లలో బాక్సాఫీస్ వద్ద విజృంభిస్తోంది. ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా తొలిరోజు నుంచే విమర్శకులు, ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ దక్కించుకుంది. అనంతపురం జిల్లా పెనుగొండ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథకి, ఓ కొరియన్ ఆత్మ ప్రవేశించే వినూత్న అంశాన్ని జోడించి ఫుల్ లెంగ్త్ కామెడీతో రూపొందించడం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించింది. రాయలసీమ మాస్ పాత్రలో వరుణ్ తేజ్ కామెడీ టైమింగ్, నటనతో పాటు కిష్టప్ప పాత్రలో సత్య అందించిన నవ్వుల పువ్వులు ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.
ఇక బాక్సాఫీస్ కలెక్షన్ల విషయానికి వస్తే.. `కొరియన్ కనకరాజు` ప్రీమియర్స్ నుంచే భారీ వసూళ్లతో తన సత్తా చాటింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 10.2 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ చిత్రం రెండవ రోజు నాటికి రూ. 23.6 కోట్లకు చేరింది. వీకెండ్‌లో ముఖ్యంగా ఆదివారం నాటి హౌస్‌ఫుల్ షోలతో కలెక్షన్లు మరింతగా పుంజుకోవడంతో ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి గ్లోబల్ వైడ్‌గా ఏకంగా రూ. 37.4 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ బాక్సాఫీస్ దగ్గర మొదటి వీకెండ్‌లోనే బ్రేక్ ఈవెన్ సాధించి డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. వీక్ డేస్‌లోనూ థియేటర్ల వద్ద ఇదే జోరు కొనసాగుతుండటంతో ఈ చిత్రం సునాయసంగా రూ. 50 కోట్ల క్లబ్ వైపు దూసుకుపోతోంది.
