విశ్వంభర మ్యూజిక్ టీమ్‌లో ఊహించని ట్విస్ట్ - అసలు కారణమేంటి?
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ చుట్టూ ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
By: M Prashanth | 5 May 2026 12:53 PM ISTమెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ చుట్టూ ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. భారీ బడ్జెట్, హై రేంజ్ విజువల్స్ తో రూపొందుతున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి సినిమాలకు ఆయన ఇచ్చే నేపథ్య సంగీతం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఫిదా చేసింది. అలాంటి దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్‌లో ఉండటం సినిమాకు పెద్ద ఎసెట్ అని అందరూ భావించారు.
అయితే లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ప్రకారం, ఈ సినిమా మ్యూజిక్ టీమ్‌లో ఒక కీలక మార్పు జరిగినట్లు తెలుస్తోంది. అసలు విషయం ఏంటంటే, విశ్వంభర నేపథ్య సంగీత బాధ్యతల నుంచి కీరవాణి తప్పుకున్నారని, ఆయన స్థానంలో యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌర టీమ్‌లోకి వచ్చారనే వార్త ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది. హనుమాన్, మిరాయ్ వంటి చిత్రాలకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన హరి గౌర, ఇప్పటికే విశ్వంభర ఆర్‌ఆర్ పనులను కూడా మొదలుపెట్టారట.
అయితే పాటల బాధ్యత మాత్రం కీరవాణి వద్దే ఉంటుందని సమాచారం. ఈ మార్పుపై ఇంకా అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉన్నప్పటికీ, ఒక బిగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఉండగా మళ్ళీ వేరొకరికి ఈ బాధ్యతలు అప్పగించడం వెనుక ఉన్న కారణాలపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సినిమా విడుదల తేదీ పలుమార్లు వాయిదా పడటం కూడా ఈ మార్పుకు ఒక కారణం కావచ్చని తెలుస్తోంది. గ్రాఫిక్స్ పనులు ఫినిష్ అయితేనే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పక్కాగా సెట్ అవుతుంది.
విజువల్ ఎఫెక్ట్స్ పనుల వల్ల సినిమా ఆలస్యం కావడంతో, కీరవాణి ఇప్పటికే రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న ‘వారణాసి’ ప్రాజెక్ట్ పనుల్లోకి షిఫ్ట్ అయినట్లు తెలుస్తోంది. ఆ సినిమా పనుల ఒత్తిడి వల్ల విశ్వంభరకు తగినంత సమయం కేటాయించలేక, ఈ బాధ్యతలను హరి గౌరకు అప్పగించేలా మేకర్స్ నిర్ణయం తీసుకున్నారని టాక్.
నిజానికి విశ్వంభర లాంటి సోషియో ఫాంటసీ చిత్రాలకు నేపథ్య సంగీతం చాలా ముఖ్యం.
భీంబిసార వంటి సినిమాల్లో విజువల్స్ కి తగ్గట్టుగా మ్యూజిక్ తో మేజిక్ చేసిన దర్శకుడు వశిష్ట, ఈసారి కూడా అదే రేంజ్ అవుట్ పుట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘రామ రామ’ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఆర్‌ఆర్ విషయంలో హరి గౌర లాంటి యంగ్ టాలెంట్‌ను తీసుకోవడం వల్ల సినిమాకు కొత్తదనం వస్తుందని టీమ్ నమ్ముతోంది. అయితే కీరవాణి లాంటి సీనియర్ టెక్నీషియన్ పక్కకు తప్పుకోవడం మెగా అభిమానుల్లో కొంత చర్చకు దారితీస్తోంది.
జూలై 10న విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి గత నెలలో ఏదైనా క్లారిటీ వస్తుందని అందరూ ఆశించారు. రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చినా ఇంకా డౌట్స్ తీరలేదు. ఇక ఈ మ్యూజిక్ డైరెక్టర్ మార్పు వ్యవహారం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గ్రాఫిక్స్ వర్క్ తో పాటు మ్యూజిక్ కూడా పర్ఫెక్ట్ గా కుదిరితేనే విశ్వంభర ఆశించిన ఫలితాన్ని అందుకుంటుంది. మరి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌర తన ఆర్‌ఆర్‌తో మెగాస్టార్ సినిమాను ఏ స్థాయికి తీసుకెళ్తారో చూడాలి. ఇక ఈ వార్తలపై చిత్ర యూనిట్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తే తప్ప ఈ సస్పెన్స్ వీడదు.
