Begin typing your search above and press return to search.

విశ్వంభర ది సరైన నిర్ణయమే

అంతా అనుకున్న ప్రకారం జరిగితే మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం ‘విశ్వంభర’ రిలీజై ఇప్పటికి ఏడు నెలలు పూర్తయి ఉండాలి.

By:  Garuda Media   |   21 Aug 2025 8:00 PM IST
విశ్వంభర ది సరైన నిర్ణయమే
X

అంతా అనుకున్న ప్రకారం జరిగితే మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం ‘విశ్వంభర’ రిలీజై ఇప్పటికి ఏడు నెలలు పూర్తయి ఉండాలి. ఈ ఏడాది సంక్రాంతికే ఆ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నారు. ఈ సినిమా మొదలైనపుడు, మేకింగ్ దశలో మంచి హైపే కనిపించింది. కానీ గత ఏడాది ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారో లేదో.. మొత్తం మారిపోయింది. అందులో విజువల్స్, ఎఫెక్ట్స్ పేలవంగా అనిపించడంతో ఆ టీజర్ ట్రోల్ మెటీరియల్‌గా మారిపోయింది. సినిమాకున్న క్రేజ్ తగ్గిపోయి నెగెటివిటీ ముసురుకుంది.

ఐతే అదేమీ పట్టించుకోకుండా సినిమాను అలాగే రిలీజ్ చేసేస్తే.. ఫలితం కచ్చితంగా తేడా కొట్టేదే. కానీ ‘విశ్వంభర’ టీం రాజీ పడలేదు. టీజర్‌కు వచ్చిన ఫీడ్ బ్యాక్‌ను తీసుకుని వీఎఫెక్స్‌ను మెరుగుపరచాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో చాలా ఖర్చు వృథా అయింది. బడ్జెట్ కూడా పెరిగింది. అయినా కూడా ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు. బెస్ట్ ఔట్ పుట్ వచ్చే వరకు ఎంత టైం అయినా పర్వాలేదనుకున్నారు. దీంతో 2025లో ఈ సినిమాను రిలీజ్ చేయలేని పరిస్థితి.

కొన్ని రోజుల ముందు వరకు ‘విశ్వంభర’ అక్టోబరు లేదా నవంబరులో రిలీజైపోతుందనే ఆశతో ఉన్నారు అభిమానులు. ఒక దశలో సంక్రాంతి రిలీజ్ అనే వార్తలు కూడా వచ్చాయి. కానీ తాజాగా చిరు స్వయంగా ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇది ఫ్యాన్స్‌కు ఒకింత నిరాశ కలిగించే విషయమే అయినా.. అది అన్ని రకాలుగా మంచిదే అని భావించాలి. హడావుడి పడి ఈ ఏడాదే సినిమాను రిలీజ్ చేస్తే అసలుకే మోసం రావచ్చు. ఔట్ పుట్ ఆశించినట్లు ఉండకపోవచ్చు. ‘విశ్వంభర’ వల్ల అనిల్ రావిపూడితో చిరు చేస్తున్న సినిమాకు కూడా ఇబ్బంది తలెత్తింది. ఆ చిత్రాన్ని మొదలుపెట్టినపుడే వచ్చే సంక్రాంతికి ఫిక్స్ చేశారు. పండక్కి పర్ఫెక్ట్ అనే అంచనాలున్న అలాంటి క్రేజీ ప్రాజెక్టును వెనక్కి జరిపి ‘విశ్వంభర’ను సంక్రాంతికి రిలీజ్ చేస్తే బాగుండదు.

అనిల్ సినిమా మీద అందరికీ మంచి గురి ఉంది. ఆ సినిమా ముందు రిలీజై పెద్ద హిట్టయితే ‘విశ్వంభర’కు అది ప్లస్ అవుతుంది. అలా కాకుండా హడావుడిగా ‘విశ్వంభర’ను ముందు రిలీజ్ చేసి, అది కొంచెం అటు ఇటు అయితే ఆ ప్రభావం అనిల్ మూవీ మీద కూడా పడుతుంది. కాబట్టి ‘విశ్వంభర’ వాయిదా మంచికే. ఇలా టైం తీసుకోవడం వల్ల ఆ సినిమా ఔట్ పుట్ బెటర్‌గా వచ్చే అవకాశముంది. ఈలోపు అనిల్ సినిమా రిలీజై పెద్ద హిట్టయితే.. విశ్వంభరకు కలిసొస్తుంది. ఈ రోజు రిలీజ్ కానున్న టీజర్ బాగుంటే.. ‘విశ్వంభర’కు కూడా తిరిగి మంచి బజ్ క్రియేట్ అవుతుందనడంలో సందేహం లేదు.