‘ఫంకీ’ నుంచి బయటికొచ్చేసిన విశ్వక్
ఆ ఫెయిల్యూర్ నుంచి బయటికి రావడానికి కొన్ని రోజులు పడుతుంది. అందుకే కొన్ని రోజులు వాళ్ల నుంచి ఏ అప్‌డేట్స్ ఉండవు.
By: Garuda Media | 18 Feb 2026 5:41 PM ISTఎన్నో ఆశలు పెట్టుకున్న ఒక సినిమాకు ఆశించిన ఫలితం రాకపోతే, అది పెద్ద డిజాస్టర్ అయితే.. అందులో భాగమైన వాళ్లందరూ డీలా పడిపోతారు. ఆ ఫెయిల్యూర్ నుంచి బయటికి రావడానికి కొన్ని రోజులు పడుతుంది. అందుకే కొన్ని రోజులు వాళ్ల నుంచి ఏ అప్‌డేట్స్ ఉండవు. హీరోల విషయంలో ఇది ఎక్కువగా జరుగుతుంటుంది. కానీ యంగ్ హీరో విశ్వక్సేన్ మాత్రం ఓ గట్టి ఎదురు దెబ్బ నుంచి త్వరగానే బయటికి వచ్చేశాడు.
అతను హ్యాట్రిక్ ఫ్లాపుల తర్వాత, కచ్చితంగా హిట్ కొడతానని ఆశించిన సినిమా.. ఫంకీ. తన ఫ్యాన్స్‌తో పాటు టీం అంతా కూడా ఈ సినిమా మీద ఎంతో నమ్మకం పెట్టుకుంది. కానీ గత వారాంతంలో రిలీజైన ఈ సినిమా నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. ఈ సినిమా విశ్వక్ మార్కెట్‌కు పెద్ద దెబ్బ అనడంలో సందేహం లేదు. ఈ ఫలితం విశ్వక్‌ను ఎంత బాధ పెట్టి ఉంటుందో అర్థం చేసుకోగలం.
కానీ విశ్వక్ మాత్రం ఆ సినిమా రిలీజైన వారం రోజుల లోపే కొత్త సినిమా అప్‌డేట్‌తో తన అభిమానులను పలకరించాడు. ‘కల్ట్’ పేరుతో విశ్వక్ స్వీయ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను త్వరలో రిలీజ్ చేయబోతున్నాడు. దాని గురించి అప్‌డేట్ రేపు ఇస్తానంటూ విశ్వక్ ప్రకటించాడు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే కూడా విశ్వకే అందించాడు. సందీప్ కాకరాల అనే కొత్త నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
‘ఇండియాస్ ఫస్ట్ స్లాషర్’ అంటూ క్యాప్షన్ జోడించి.. ఒక టెడ్డీ ఉన్న పోస్టర్‌తో ఈ అప్‌డేట్‌ను పంచుకున్నాడు విశ్వక్. ప్రేక్షకులు తీర్పు ఇవ్వడానికి ముందే ముందే తనే ‘కల్ట్’ అని టైటిల్‌కు పెట్టుకుని పెద్ద రిస్కే చేస్తున్నాడు విశ్వక్. తేడా కొడితే ఎంతగా ట్రోల్స్ పడతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి ఫస్ట్ గ్లింప్స్‌తో అతను ఎంతమేర ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడో చూడాలి. ఇంతకుముందు విశ్వక్.. ఫలక్‌నుమా దాస్, దమ్కీ చిత్రాలను డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ‘కల్ట్’ వేసవిలో విడుదలవుతుంది.
